
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఈనెల 24న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ అవుతోంది. పవన్ కళ్యాణ్ నటించిన తొలిపాన్ ఇండియా చిత్రం కావడంతో అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. అయితే ఈ చిత్రం ఎక్కువ రోజులు ఆలస్యం కావడం, పలుమార్లు రిలీజ్ డేట్ లు వాయిదా పడడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. వాళ్ల నిరాశ నుంచి దూరం చేస్తూ జోష్ నింపేలా చిత్ర యూనిట్ మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితమే లాంచ్ చేశారు.
మొగల్ సుల్తాన్ ఔరంగజేబు పాలనలో హిందూ ధర్మంపై జరిగిన దాడి, ఔరంగజేబు చేసిన అరాచకాలు నేపథ్యంలో హరిహర వీరమల్లు చిత్రం హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కింది. మొగల్ సామ్రాజ్యాన్ని వణికించిన వీరుడిగా హరిహర వీరమల్లుగా పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దాదాపు మూడు నిమిషాల పాటు గ్రాండ్ విజువల్స్, పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ అప్పియరెన్స్ తో మ్యాజిక్ క్రియేట్ చేసింది. షెడ్యూల్ చేసిన థియేటర్లలో అదే విధంగా యూట్యూబ్ లో ట్రైలర్ ని లాంచ్ చేశారు. థియేటర్లలో అభిమానుల నుంచి హరిహర వీరమల్లు ట్రైలర్ కి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.
ట్రైలర్ లో ఔరంగజేబు చేస్తున్న అరాచకాలను చూపించిన విధానం.. ఆ తర్వాత తనికెళ్ల భరణి చెప్పిన డైలాగులతో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చిన తీరు ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. నిధి అగర్వాల్, పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఎమోషనల్ గా ఆకట్టుకుంటున్నాయి. కోటలో చిక్కుకుపోయిన అమ్మాయి పంచమిగా నిధి అగర్వాల్ నటిస్తోంది. సర్దుకోలేకపోతున్నాను.. సాయం చేస్తావా అని నిధి అగర్వాల్ అడగడం.. ఆమెని కోట నుంచి తప్పించేందుకు పవన్ కళ్యాణ్ వ్యూహాలు రచించడం లాంటి సన్నివేశాలు చూపించారు.
ఇప్పటివరకు మేకల్ని తినే పులుల్నిచూసుంటారు.. ఇప్పుడు పులిని వేటాడే బెబ్బులిని చూస్తారు అంటూ పవన్ చెప్పే డైలాగ్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. సునీల్ ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ అనుచరుడిగా నటిస్తున్నట్లు అర్థమవుతుంది.
ట్రైలర్ లో పొలిటికల్ డైలాగ్ లు కూడా బాగానే పేలాయి. నేను రావాలని చాలామంది దేవుడిని ప్రార్ధిస్తుంటారు. కానీ మీరు మాత్రం నేను రాకూడదని కోరుకుంటున్నారు అని చెప్పే డైలాగ్ పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితాన్ని ప్రతిబింబిస్తుంది.
ఇక ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ పవర్ ఫుల్ గా కనిపించారు. ఆయన పాత్రకి పర్ఫెక్ట్ ఛాయిస్ అన్నట్లుగా నటించారు. ట్రైలర్ చివర్లో పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి బాబీ డియోల్ ఆంధీ వచ్చేసింది అని చెప్పడం ఆసక్తికరం. పవన్ కళ్యాణ్ ని ప్రధాని నరేంద్ర మోడీ ఆంధీ అంటూ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. మోడీ ప్రశంసల్ని గుర్తు చేసేలా ఆంధీ డైలాగ్ ఉంది. చివర్లో తోడేలు కళ్ళలోకి కళ్ళు పెట్టి దాన్ని భయపెట్టే షాట్ ట్రైలర్ లో మరో హైలెట్.
ఓవరాల్ గా హరిహర వీరమల్లు ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచే విధంగా ఉంది. నిర్మాత ఏం రత్నం, డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఎక్కడ క్వాలిటీ అవుట్ మిస్ కాకుండా జాగ్రత్త పడినట్లు ఉన్నారు. మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. కీరవాణి అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బావుంది. సినిమాల్లో కంటెంట్ కనుక క్లిక్ అయితే పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నార్త్ ఆడియన్స్ లో ఆసక్తిని పెంచేలా హిందూ ధర్మంపై దాడి అనే అంశాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత ఏం రత్నం మాట్లాడుతూ.. ఇటీవల హిందీలో ఛావా అనే మూవీ రిలీజ్ అయింది. ఆ చిత్రం ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. హరిహర వీరమల్లు కూడా పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే చిత్రమని ఏఎం రత్నం అన్నారు.