Akshara Haasan:10th క్లాస్ 3 సార్లు ఫెయిల్.. డైరెక్టర్ అవ్వడమే టార్గెట్, కమల్ హాసన్ చిన్న కూతురు ఓపెన్ కామెంట్స్

Published : Oct 03, 2026, 05:25 PM IST

Akshara Haasan: 10వ తరగతి మూడుసార్లు ఫెయిల్ అయినా.. డైరెక్టర్ అవ్వడమే తన లక్ష్యం అంటోంది లోకనాయకుడు కమల్ హాసన్ చిన్న కూతురు. ఎటువంటి దాపరికాలు లేకుండా తన చదువు గురించి, లక్ష్యం గురించి ఓపెన్‌గా మాట్లాడారు అక్షర హాసన్.

PREV
15
స్టార్ కిడ్స్ లైఫ్ అంత ఈజీ కాదు..

సినిమా పరిశ్రమలో 'స్టార్ కిడ్స్' ప్రయాణం అనగానే ప్రతిదీ సులభంగానే సాగిపోతుందని, అవకాశాలు తలుపు తడతాయని చాలామంది భావిస్తుంటారు. కానీ అందరి పరిస్థితి ఒకేలా ఉండదని, నటుల పిల్లలకు కూడా వారి స్థాయిలో సవాళ్లు, సొంత ప్రాధాన్యతలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు నటి అక్షర హాసన్. లోకనాయకుడు కమల్ హాసన్-సారికల చిన్న కుమార్తె, ప్రముఖ నటి శ్రుతి హాసన్ చెల్లెలిగా సినీ లోకానికి బాగా సుపరిచితమైన అక్షర.. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తన చదువు, కెరీర్, కుటుంబ నేపథ్యం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

25
10వ తరగతిలో మూడుసార్లు ఫెయిల్..

అక్షర హాసన్ తన చవువు గురించి ఎటువంటి దాపరికాలు లేకుండా ఓపెన్‌గా మాట్లాడారు. హైస్కూల్ రోజుల్లో తాను చదువులో సరిగ్గా రాణించలేకపోయానని అంగీకరించారు. పదో తరగతి పరీక్షల్లో వరుసగా మూడుసార్లు విఫలమయ్యానని, ఇక పాస్ కావడం తన వల్ల కాదని గ్రహించి చదువును మధ్యలోనే ఆపేసినట్లు వెల్లడించారు. ఈ రోజుల్లో సినీ ప్రముఖులు తమ లోపాలను, ఫెయిల్యూర్స్ ను బయటకు చెప్పడానికి జంకుతున్న వేళ.. అక్షర ఈ విధంగా ఓపెన్‌గా చెప్పడం విశేషం.

35
కొరియోగ్రాఫర్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్‌గా..

ఎంతో మంది స్టార్స్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తాను నేరుగా హీరోయిన్‌గా మారలేదని అక్షర అన్నారు. మొదట డ్యాన్స్‌‌పై ఉన్న ఆసక్తితో తన స్నేహితుల మ్యూజిక్ వీడియోలకు కొరియోగ్రఫీ చేస్తూ కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తి పెరగడంతో దర్శకత్వ విభాగం వైపు అడుగులు వేశారు. 'సొసైటీ', 'శభాష్ నాయుడు' వంటి చిత్రాలకు సహాయ దర్శకురాలిగా (అసిస్టెంట్ డైరెక్టర్) పనిచేశారు. ఒకసారి యాక్టింగ్ కూడా ప్రయత్నించి చూడాలనే ఉద్దేశంతోనే 'షమితాభ్' ద్వారా వెండితెరకు పరిచయమయ్యానని, అయితే తన అసలు లక్ష్యం మాత్రం మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించడమేనని తేల్చిచెప్పారు అక్షర హాసన్.

45
ఇంట్లో ఎలాంటి ఒత్తిడీ లేదు

భవిష్యత్తులో కచ్చితంగా డైరెక్టర్‌గా మారి సినిమా తీస్తానన్న ఆశాభావం వ్యక్తం చేశారు అక్షర. కమల్ హాసన్, సారికల వంటి దిగ్గజ నటుల పిల్లలు కావడం వల్ల తమపై సినిమాల్లోకే రావాలనే ఒత్తిడి ఉందా అని ప్రశ్నించగా.. "మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎప్పుడూ నటులు కావాలని బలవంతం చేయలేదు. నటన ఇష్టం లేకపోతే మీకు నచ్చిన రంగంలో స్థిరపడొచ్చని పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఆ స్వేచ్ఛే మాపై ఉన్న పెద్ద భారాన్ని దించింది" అని అక్షర క్లారిటీ ఇచ్చారు.

55
ముఖం మీదే విమర్శిస్తారు..

అంతేకాకుండా తమ కుటుంబంలో సినిమాలపై చాలా సీరియస్‌గా, నిజాయితీగా విమర్శలు ఉంటాయని ఆమె తెలిపారు. నటనలో తప్పులు చేస్తే మొహమాటం లేకుండా ముఖం మీదే విమర్శిస్తారని, బయటి ప్రశంసల కంటే ఇంట్లో లభించే ఈ నిజాయితీ విమర్శలే తమను మెరుగుపరుచుకోవడానికి సహాయపడతాయని వివరించారు. ప్రస్తుతం అక్షర హాసన్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Read more Photos on
click me!

Recommended Stories