అల్లు అర్జున్ అరెస్ట్, వైఎస్ జగన్ ఎంట్రీతో పొలిటికల్ టర్న్! మొదలైన సరికొత్త చర్చ 

First Published | Dec 13, 2024, 8:19 PM IST

అల్లు అర్జున్ అరెస్ట్ ని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. ఆయన ట్వీట్ తో అల్లు అర్జున్ అరెస్ట్ కొంత పొలిటికల్ టర్న్ తీసుకుంది. 
 

అల్లు అర్జున్ పుష్ప 2 సక్సెస్ ని పూర్తి స్థాయిలో ఆస్వాదించలేని పరిస్థితి నెలకొంది. డిసెంబర్ 4వ హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక వివాహిత కన్నుమూసింది. తొమ్మిదేళ్ల ఆమె కుమారుడు కూడా అపస్మారక స్థితికి వెళ్ళాడు. బాలుడికి చికిత్స జరుగుతుంది. 

ఈ ఘటనపై పుష్ప 2 నిర్మాతలతో పాటు హీరో అల్లు అర్జున్ స్పందించారు. ఏమి చేసిన పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేము. ఆ కుటుంబానికి జరిగిన నష్టం అపరిమితం. చాలా వేదనగా ఉంది. బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రూ. 25 లక్షల రూపాయలు నష్టపరిహారంగా ఆ కుటుంబానికి ఇస్తున్నట్లు అల్లు అర్జున్ ప్రకటించారు. కాగా ఈ ఘటనను క్రిమినల్ కేసుగా నమోదు చేసిన పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. 

ఉదంతం జరిగి 13 రోజులు అవుతుండగా నేడు ఉదయం అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు చిక్కడపల్లి స్టేషన్ కి తీసుకెళ్లారు. 105,118(1)ఆర్/డబ్ల్యూ  BNS 3/5 సెక్షన్స్ క్రింద కేసులు నమోదు చేశారు. అనంతరం ఆయన్ని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించింది. హైకోర్టులో మధ్యంతర బెయిల్ కి అల్లు అర్జున్ న్యాయవాదులు పిటిషన్ వేశారు. కోర్టు బెయిల్ గ్రాంట్ చేయడంతో అల్లు అర్జున్ కి ఊరట లభించింది. 

Tap to resize

YS Jagan

కాగా అల్లు అర్జున్ అరెస్ట్ ని పలువురు చిత్ర ప్రముఖులు, రాజకీయ నాయకులు ఖండించారు. మహిళ మరణం విచారకరం. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అదే సమయంలో అల్లు అర్జున్ ని బాధ్యుడిని చేయడం, క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం సబబు కాదని తమ గళం వినిపించారు. 

హీరో నాని, శర్వానంద్, విజయ్ దేవరకొండ, రష్మిక మందాన, నితిన్ వంటి చిత్ర ప్రముఖులు ముక్త కంఠంతో అల్లు అర్జున్ అరెస్ట్ ని ఖండించారు కేటీఆర్, బండి సంజయ్, రాజా సింగ్ వంటి ప్రముఖులు అల్లు అర్జున్ కి మద్దతుగా నిలిచారు. కాగా ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 

''హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది. అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్  తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్‌పై క్రిమినల్‌ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతంకాదు. అల్లు అర్జున్‌ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను'' అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. 

కాగా వైఎస్ జగన్ ఎంట్రీతో ఈ వివాదం మరింత పొలిటికల్ టర్న్ తీసుకుంది. శని, ఆదివారాలు కోర్టుకు సెలవులు కాగా.. శుక్రవారం అరెస్ట్ చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి పేరును మరచిన అల్లు అర్జున్ పై ఈ విధంగా కక్షసాధించారనే వాదన తెరపైకి తెచ్చారు. 

మరోవైపు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అల్లు అర్జున్ అత్యంత సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన శిల్పా రవికి మద్దతు తెలిపాడు. స్వయంగా సతీసమేతంగా నంద్యాల వెళ్లి, శిల్పా రవికి ఓటు వేయాలని కోరాడు. కేవలం శిల్పా రవికే అల్లు అర్జున్ మద్దతు తెలిపినప్పటికీ అది... పరోక్షంగా వైసీపీకి అల్లు అర్జున్ సానుకూలంగా వ్యవహరించినట్లు అయ్యింది. ఎన్నికల ప్రచారం చివరి రోజు చోటు చేసుకున్న ఈ పరిణామం.. మెగా హీరోలను ఆగ్రహానికి గురి చేసింది. 

నాగబాబు పోలింగ్ డే ఈవెనింగ్ తన అసహనం వెళ్లగక్కాడు. ప్రత్యర్థులకు మద్దతు తెలిపేవాడు మావాడైన పరాయివాడే అంటూ..ఘాటైన సెటైర్ వేశారు. మెగా ఫ్యామిలీ, జనసేన ఎంత హేట్ చేస్తే... వైసీపీ అల్లు అర్జున్ ని అంతగా ప్రేమించడం మొదలు పెట్టింది. అల్లు అర్జున్ మావాడు అంటూ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. పుష్ప 2 విషయంలో కూడా ఇదే జరిగింది. చరణ్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నెగిటివ్ ప్రచారం చేస్తే... వైసీపీ పాజిటివ్ కామెంట్స్ తో అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ ని ఎదుర్కొన్నారు. 

హైకోర్టులో అల్లు అర్జున్ కి చివరి క్షణంలో బెయిల్ రావడానికి కూడా వైసీపీ ఎంపీ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు. ఆయన వాదనలతో ఏకీభవించిన కోర్టు అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలుసుకున్న చిరంజీవి దంపతులు అల్లు అరవింద్ నివాసానికి వెళ్లారు. పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ వస్తున్నారంటూ ప్రచారం జరిగింది. 

Latest Videos

click me!