
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన `ఈ నగరానికి ఏమైంది` మూవీ ఎనిమిదేళ్ల క్రితం వచ్చి పెద్ద హిట్ అయ్యింది. రీ రిలీజ్ చేసినా దుమ్మురేపింది. దీంతో దానికి సీక్వెల్‌గా `ఈ నగరానికి ఏమైంది రిపీట్` ని రూపొందించారు. ఇందులో విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను, రామ్, శివాత్మిక రాజశేఖర్, శ్రీరామ్ చంద్ర వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు.
ఎస్‌ఎస్ ఒరిజినల్స్, రూట్‌నాడ్ సినిమాస్ పతాకాలపై సృజన్ యారబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మించారు. ఈ చిత్రం గురువారం(నవంబర్ 19)న విడుదలైంది. మంచి వసూళ్లతో రాణిస్తోంది. అయితే ఇప్పటికే ఇది బ్రేక్ ఈవెన్ అయ్యిందట. ఈ నేపథ్యంలో మంగళవారం సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించారు.
`ఈ నగరానికి ఏమైంది రిపీట్` మూవీ ఆరు రోజులు పూర్తి చేసుకుంది. మరి కలెక్షన్లు చూస్తే, మంగళవారం ఈ చిత్రం రూ.2.10కోట్ల గ్రాస్, కోటీ 80లక్షల నెట్ కలెక్షన్లని సాధించింది. ఓవర్సీస్‌లో కోటీ వసూలు చేసింది. మొత్తంగా ఆరో రోజు ఇది మూడు కోట్లు రాబట్టింది. ఇక ఆరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.42.25కోట్లు రాబట్టడం విశేషం. ఇందులో ఇండియా గ్రాస్ రూ.25.35కోట్లు, నెట్ రూ.21.80కోట్లు. ఓవర్సీస్‌లో 16.90కోట్ల కలెక్షన్లు.
తెలుగు స్టేట్స్ కి ధీటుగా ఓవర్సీస్‌లోనూ కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.15కోట్లు. అంటే ముప్పై కోట్ల గ్రాస్ రావాలి. ఆ లెక్కన ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇప్పుడు లాభాల్లో వెళ్తోంది. ఈ క్రమంలో మంగళవారం సక్సెస్ సెలబ్రేషన్ నిర్వహించారు. ఇందులో విశ్వక్ సేన్ ఎమోషనల్ అయ్యాడు. తరుణ్ భాస్కర్ ఫైర్ అయ్యాడు.
విశ్వక్ సేన్ మాట్లాడుతూ తన జర్నీని వెళ్లడించాడు. హీరోగా కావాలని ఆడిషన్స్ ఇస్తున్న సమయంలో ఒక సినిమాకి తనని ఎంపిక చేశారట. `మొదట హీరో అన్నారు, ఆ తర్వాత సెకండ్ లీడ్ అన్నారు, తర్వాత థర్డ్ ప్లేస్ అన్నారు, కొన్ని రోజుల తర్వాత ఫోర్త్ ప్లేస్ అన్నారు. అలా 20 రోజులు రోజూ ఆఫీస్ చుట్టూ తిరిగాను, చివరికి నువ్వు ఈ సినిమా లేవు అని చెప్పారు. అది కూడా 20 రోజుల క్రితమే డిసైడ్ అయ్యారట.
ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డాను. లవర్ వదిలేసినా అంత బాధపడలేదు, ఆమె వీడి దగ్గర డబ్బులు లేవని వదిలేసింది. కానీ సినిమాలో లేవని చెబితే చాలా బాధపడ్డాను. ఆ తర్వాత ముంబై వెళ్లి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో కోర్స్ చేసి, సొంతంగా సినిమా తీయాలని `ఫలక్‌నూమా దాస్` సినిమా స్టార్ట్ చేశాను. ఆ సమయంలోనే తరుణ్ భాస్కర్ `ఈ నగరానికి ఏమైంది` సినిమా తీస్తున్నాడని తెలిసింది.
తాను లేట్‌గా ఆడిషన్‌కి ఫోటో పంపించాను. ఆయన లక్కీకి నన్ను కలవాలని చెప్పాడు, అంతకు ముందే పబ్‌లో ఆయనకు ధమ్కీ ఇచ్చిన. ఆ తర్వాత మార్నింగ్ మెసేజ్ పెట్టిన నేను ఈ క్యారెక్టర్ కాదు, తాగిన మత్తులో ఏదో చేసిన సారీ అని చెప్పిన. కానీ తరుణ్ నన్ను పిలిపించి ఈ స్క్రిప్ట్ చెప్పారు. రెండు రోజులు టైమ్ తీసుకొని ఆ క్యారెక్టర్ లో ఇన్‌వాల్వ్ అయి ఆయన ముందు ఆడిషన్ ఇచ్చాను. అందరు క్లాప్స్ కొట్టారు.
సినిమా ఓకే అయ్యింది. కానీ అంత ఈజీగా ఛాన్స్ ఎలా వస్తుందని అనుకున్నా, వారం అయ్యింది, కాల్ రాలేదు. వామ్మో ఏదో అయ్యిందనుకున్నా, ఆతర్వాత తరుణ్‌కి ఫోన్ చేస్తే, నీ వెనకాల ఏదో జరుగుతుంది. వద్దులే, ఇందులో నువ్వు లేవు అని చెప్పాడు. మళ్లీ షాక్. రిజెక్షన్స్ కొత్త కాదు, కానీ ఏం జరిగిందో తెలియాలని అడిగితే, ఇలా అమ్మాయి పేరుతో మెయిల్ వచ్చిందని చెప్పారు.
అది నేను కాదు, రాంగ్ అని ప్రూవ్ చేయాలి, లేదంటే జీవితాంతం ఆ మరక నాపై ఉండిపోతుందని తరుణ్‌ని రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకొని మెయిల్ నాకు ఫార్వార్డ్ చేశాడు. అది ఎక్వైరీ చేస్తే, కాలేజీలో ఒకడిని నేను కొడితే ఆ కోపంతో లేడీ మెయిల్ క్రియేట్ చేసి పంపించాడట. ఆ విషయం తెలిశాక తరుణ్ నన్ను నమ్మాను. ఆల్మోస్ట్ పాతాళంలోకి పడిపోతున్న నన్ను చేయి పట్టి పైకి లేపి అవతల పడేశాడు.
`ఈ నగరానికి ఏమైంది` మూవీతో నన్ను ఎక్కడికో తీసుకెళ్లాడు. ఆ తర్వాత `ఫలక్‌నూమా దాస్`తో సక్సెస్ కొట్టాను. తర్వాత సినిమాలు చేస్తున్నాను, కానీ సరైన సక్సెస్ రావడం లేదు, ఏదో మిస్ అవుతుంది. సంతృప్తి లేదు. కెరీర్ ఎలా అనే టెన్షన్ పట్టుకుంది. ఈ క్రమంలో మళ్లీ `ఈ నగరానికి ఏమైంది 2`తో మరోసారి ముగినిపోతున్న నన్ను పైకి లేపాడు. మరోసారి లైఫ్ ఇచ్చాడు.
తరుణ్ ఈ సినిమాకి హీరో, సినిమాకే కాదు, నా లైఫ్‌కి కూడా తనే హీరో. థ్యాంక్యూ తరుణ్. నన్ను మార్చేశావు. ఇలా లైఫ్ ఇచ్చినందుకు` అని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు విశ్వక్ సేన్. విశ్వక్ మాటలకు తరుణ్ కూడా ఎమోషనల్ కావడం విశేషం.
ఇక ఈ ఈవెంట్‌లోనే తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ, తన ఆవేదన వ్యక్తం చేశాడు. `డైరెక్షన్ అనేది కూలి పని కాదు. చదువుకుని వచ్చి చేసే పని. వాళ్లకు సరైన గౌరవం ఇచ్చిన మన నిర్మాతలకు థాంక్యూ. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ లెక్కలు వేసుకుంటారు. కానీ లెక్కలేకుండా ప్రేమించేది ప్రేక్షకులు మాత్రమే. మా సినిమాకు లెక్కలేనంత ప్రేమ ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు.
నేనెవరో చూడకుండా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారంటే అది సినిమాపై మీకున్న ప్రేమ. ఈ ప్రేమతో ఏదైనా సాధ్యమే. ప్రేక్షకులే గేమ్ ఛేంజర్స్. నాకు దర్శకుడిగా చాలా ఫుల్‌ఫిల్‌మెంట్ వచ్చింది. నిజాయితీగా పనిచేసే ప్రతి ఒక్కరినీ ప్రేమించాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు నా సినిమాల్లో డబ్బుకు పెద్దగా వాల్యూ లేదని, డబ్బు వెంట పడొద్దని చెప్పేవాడిని.
కానీ ఇప్పటి నుంచి నేను డబ్బునే ఫాలో అవుతాను. నెక్స్ట్ సినిమా నుంచి ఏ, బీ, సీ.. అన్నింటినీ ఫోకస్ చేసి సినిమాలు చేస్తా. చాలామంది చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు కదా. ఒక అథెంటిక్ వాయిస్ ఎంత దూరం వెళ్తుందో చూపిస్తాను. డ్యూటీ ఎక్కుతున్నాను. నేను మోకాళ్ల మీద పడి ప్రతి ఒక్కరినీ సార్, మేడం అని పిలవను. నాకు జనమే ముఖ్యం. నేను డైరెక్షన్ చేసినా, యాక్టింగ్ చేసినా శ్రద్ధ పెట్టి చేస్తాను. నా వాయిస్ ఏంటనేది చూపిస్తాను.
ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగినా సినిమా ద్వారా దాన్ని కరెక్ట్ చేస్తాను. ఇది రాసి పెట్టుకోండి. `ఈఎన్ఈ రిపీట్` సక్సెస్ నాకు గొప్ప హోప్ ఇచ్చింది. నాకు ప్రేక్షకులే ఉన్నారు. మేము నిజాయితీగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. మీరు కూడా ఆ ప్రేమను తిరిగి ఇవ్వండి` అంటూ ఆగ్రహం చెందడంతోపాటు ఆవేదన వ్యక్తం చేశాడు తరుణ్. ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.