విశ్లేషణ : పరారీలో ఉన్న సుకుమారన్ కురుప్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నప్పుడు దర్శకుడు శ్రీనాధ్ రాజేంద్రన్ పై విమర్శలు వినిపించాయి. ఒక క్రిమినల్ ని ఉత్తముడిగా చూపించేందుకు ఈ చిత్రం చేస్తున్నారు అంటూ అంతా విమర్శించారు. కానీ సినిమా చూస్తే ఆ విమర్శలకు విలువ లేదు అనిపిస్తుంది. ఎందుకంటే దుల్కర్ సల్మాన్ పాత్రని రాజేంద్రన్ ఎక్కడా హీరోలాగా చూపించలేదు. భయంకరమైన క్రిమినల్ ఎలా బిహేవ్ చేస్తాడో.. అలాగే కురుప్ పాత్రని ప్రజెంట్ చేశారు. క్రైమ్ సన్నివేశాల్లో దుల్కర్ సల్మాన్ తన నటనలో క్రూరత్వాన్ని పండించాడు. అతడు నటించాడు అనడం కంటే జీవించాడు అంటే బావుంటుంది. అంతలా దుల్కర్ ఆ పాత్రలో ఒదిగిపోయాడు. కథని గమనిస్తే దర్శకుడు కొంత వాస్తవం, కొంత కల్పితం అన్నట్లుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక 80వ దశకంలో విజువల్స్ ని స్రీన్ పై అద్భుతంగా చూపించారు. కానీ ఒక థ్రిల్లర్, క్రైమ్ డ్రామాకు కావలసిన రేసీ స్క్రీన్ ప్లే, వేగం ఈ చిత్రంలో లోపించింది. సినిమా చాలా నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. ఇక ఈ చిత్రానికి ఉన్న హైప్, దుల్కర్ సల్మాన్ స్టార్ డంకి అంచనాలు అందుకోవడంలో ఈ మూవీ కాస్త వెనుకబడిందనే చెప్పాలి. పైకి మాస్ మూవీలాగా కనిపించినా ఈ చిత్రంలో మాస్ టచ్ పూర్తిగా లోపించింది.