'పుష్పక విమానం' మూవీ రివ్యూ

First Published | Nov 12, 2021, 2:08 PM IST

"దొరసాని", "మిడిల్ క్లాస్ మెలొడీస్" చిత్రాలతో టాలెంటెడ్ హీరోగా అటు ఇండస్ట్రీలో ఇటు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నారు ఆనంద్ దేవరకొండ. ఆయన కొత్త సినిమా "పుష్పక విమానం" మొదటినుంచీ అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. గీత్ సైని, శాన్వీ మేఘన హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది.
 

తెలుగులో ఇప్పుడొస్తున్న యంగ్  హీరోలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు అంటూ రొటీన్ గా బాటలో ప్రయాణం పెట్టుకోకుండా తమని కొత్తగా ప్రెజెంట్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తూ నటుడుగా బెస్ట్ అనిపించుకోవడంతో పాటు యూత్ లో తమకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నారు.  పావు గంటకో పాట,అరగంటకో ఫైట్ ఉండాలి, హీరో బిల్డప్ ఉండాలి, అనే రూల్స్  పెట్టుకోకుండా కథని నమ్ముకొని సినిమాలు చేస్తున్నారు. తమ సినిమాలలో కథే హీరో అని, తాము ఆ కథని నడిపించే పాత్రధారులం మాత్రమే అని అంటున్నారు. కెరీర్ మొదటి నుంచీ డిఫరెంట్ జోనర్ కథలతోనే వెళ్తున్న ఆనంద్ దేవరకొండ తాజా చిత్రం ఇది. ఈ సినిమా కథేంటి...ఈ సినిమా స్పెషాలిటీ ఏమిటి, భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ అవుతుందా  వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 
 


కథేంటి

  గవర్నమెంట్ టీచర్ చిట్టిలంక సుంద‌ర్ (ఆనంద్ దేవ‌ర‌కొండ‌) కి పెళ్లైన వెంటనే ఓ చిత్రమైన సమస్య ఎదురౌతుంది. అతని  భార్య మీనాక్షి  (గీత్ సైని)రెండో రోజే లేచిపోవటం జీర్ణించుకోలేని విషయంగా మారుతుంది. దానికి తోడు తన భార్య గురించి ఆరాతీసే చుట్టూ ఉన్న జనాలకు ఏం సమాధానం చెప్పాలో అని సమమతమైపోతూంటాడు. తీవ్ర మనస్తాపానికి గురి చేస్తుంది. అప్పటికీ ఆమె ఇంట్లో ఉన్న‌ట్లే బ‌య‌టి వారంద‌రికీ చెప్పి న‌మ్మించే ప్రయత్నం చేస్తూంటాడు. అప్పటికి ప్రక్కింటి   మ్యూజిక్ కంపోజర్  హిందోళం (హర్ష వర్దన్), స్కూల్ హెడ్ మాస్టర్ (నరేష్) అయితే మీ ఆవిడ ఎక్కడ అని టార్చర్ పెడుతూంటారు. 



ఆ క్రమంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవటానికి ఓ చిన్న సెటప్ చేసుకుంటాడు.  త‌న భార్య‌గా న‌టించేందుకు షార్ట్ ఫిలిం లేడీ ఆర్టిస్ట్‌ రేఖ (శాన్వీ మేఘన) ను హైర్ చేసుకుంటాడు. అంతా సెట్ అవుతుందనుకునేలోగా అతని జీవితం ఊహించని ఓ టర్న్ తీసుకుంటుంది. మీనాక్షి గురించిన ఓ షాకింగ్ నిజం తెలుస్తుంది.  అక్కడనుంచి పోలీస్ లు, క్రైమ్ అంటూ లైఫ్ అష్టవంకరలు తిరగటం మొదలెడుతుంది. అతని జీవితంలో వచ్చిన ఆ టర్న్ ఏమిటి..లేచిపోయిన అతని భార్య ఏమైంది. అద్దెకు తెచ్చుకున్న భార్య సంగతేంటి..మధ్యలో ఎస్సై రంగం( సునీల్) ఇన్విస్టిగేషన్ విషయం ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉంది


తెలుగులో కొత్త తరహా కథలు మెల్లిమెల్లిగా మొదలవుతున్నాయి. హిందీలో రాజ్ కుమార్ రావు , ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌశల్  వంటి  కాన్సెప్ట్ హీరోలు ఎంచుకుంటున్న  కథలు ఇక్కడా మనవాళ్లు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అలాంటిదే. ఓ ఐదేళ్ల క్రితం ఇలాంటి కథ ఖచ్చితంగా హీరోకు చెప్పటానికి కూడా దర్శకులు ధైర్యం చేసేవారు కాదు. అయితే ఓటీటి లలో పరభాషా చిత్రాలు చూసిన మన వాళ్లు మెల్లిగా కాన్సెప్టు చిత్రాలకు అలవాటు పడుతున్నారు. దాంతో కొత్త తరం హీరోలు ధైర్యం చేస్తున్నారు. ఈ మారుతున్న కథా క్రమంలో ఈ సినిమా వచ్చింది. కానీ చిన్న కథకు ఉండే డైనమిక్స్ ని పట్టుకోలేకపోయింది.  ఫలానా అంటూ ఓ జానర్ కు ఈ సినిమా ఫిక్స్ కాలేకపోవటమే ఇబ్బందిగా మారింది. 


స్టోరీ ఐడియా  కొత్తగా ఉండటం(పెళ్లాం లేచిపోయిన కుర్రాడి కథ) తో కాసేపు కొత్త సీన్స్ వచ్చాయి. అయితే ఎప్పుడైతే హీరో ఆ సమస్యను దాటడం కోసం రొటీన్ నిర్ణయం(భార్య ప్లేస్ లో వేరొకరిని) తీసుకున్నాడో అక్కడే కథ గాడి తప్పటం మొదలై, సెకండాఫ్ కు వచ్చే సరికి అది క్రైమ్ జానర్ లోకి జారుకుంది. ప్రారంభంలో ఉన్న కొత్తదనం,ఫన్ మొత్తం మాయమైపోయింది. ఎన్నో సినిమాల్లో చూసిన క్రైమ్ ఇన్విస్టిగేషన్ కథ మొదలైపోయి, విసుగు తెప్పించింది. కథలో కాంప్లిక్ట్ అయిన భార్య లేచిపోయిందనే విషయం ప్రపంచానికి తెలిస్తే ఏమౌతుందనే కాంప్లిక్ట్ పలచబడిపోయింది. ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి పూర్తిగా మాయమై,వేరే కాంప్లిక్ట్ ఎత్తుకున్నారు. దాంతో ఫస్టాఫ్ ఒకలా, సెకండాఫ్ మరోలా అనిపించింది. 


 తన భార్య లేచిపోయిందనే విషయం దాచిపెడుతూంటే అది ప్రపంచానికి తెలిసిపోయినప్పుడు ఏం జరిగింది..అప్పుడు హీరో ఏం నిర్ణయం తీసుకున్నాడు అనే దిసగా కథనం నడిపితే బాగుండేదేమో. అలాకాకుండా లేచిపోయిన భార్యని వెతుకుతూ హీరో జర్నే చేసే సీన్స్ తో నడపటం విసుగెత్తించింది. లైటర్ వీన్ ఫన్ తో,సిట్యువేషన్ కామెడీతో మొదలైన సినిమా సెకండాఫ్ కు వచ్చే సరికి స్క్రీన్ ప్లే పరుగులు పెట్టడం మానేసి, జనాలను విసుగెత్తించటం మొదలెట్టింది.  ట్విస్ట్ లు బాగానే ఉన్నాయి కానీ కథలో జెల్ కాలేదు. మనకు ఈ కథ చూస్తూంటే అల్లరి నరేష్ తో చేసిన మేడమీద అబ్బాయి (అదీ మళయాళ రీమేక్) ఖచ్చితంగా గుర్తుకు వస్తుంది. అదీ సెకండాఫ్ ఇదే సమస్య. ఇదే తరహా కథనం. కథలో కాంప్లిక్ట్ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాకపోవటంతో  ఎంగేజింగ్ గా కథ చెప్పకపోయారు. 
 

Pushpaka Vimanam

 
టెక్నికల్ గా చూస్తే ..
.

మార్క్ కే రాబిన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. పాటలు గొప్పగా ఏమీ లేవు. కాకపోతే పాటల పిక్చరైజేషన్ డీసెంట్ గా,నీట్ గా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటింగ్ పరంగా చూస్తే..సెకండాఫ్ ని బాగా ట్రిమ్ చేస్తే ...ఫస్టాఫ్ కొంతలొ కొంత మ్యాచ్ చేయచ్చు. రైటింగ్ సైడే బాగా వీక్ గా ఉంది. డైలాగులు బాగున్నాయి. కొన్ని బాగా పేలాయి. అలాగే డైరక్టర్ మేకింగ్ పరంగా బడ్జెట్ లిమిటేషన్స్ లో బాగానే ప్రయత్నం చేసారనిపించింది. ఆర్టిస్ట్ ల నుంచి మంచి ఫెరఫార్మెన్స్ రాబట్టారు. అయితే ఫస్టాప్ లో కామెడీ గా నడిపిన కథని సెకండాఫ్ లో అంత సీరియస్ ఎప్రోచ్ ఎందుకు తీసుకున్నారో మాత్రం అర్దం కాదు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అయితే అసలు ఆకట్టుకోలేదు.
 

నటుడుగా ఆనంద్ దేవరకొండ ...మొదటి సినిమాకు ఇప్పటికీ బాగా పరిణితి కనిపిస్తుంది. ఇక  గీత్ సైనీ కూడా నాచురల్ గా నటించే ప్రయత్నం చేసింది.  అద్దెకు తెచ్చుకున్న భార్యగా సాన్వీ కూడా తన నటనతో ఆకట్టుకుంది. హైలైట్ అ పోలీస్ అధికారి పాత్రలో సునీల్ ఎప్పటిలాగే చేసారు.  హిందోళంగా హర్షవర్దన్ అదరకొట్టారు. 
 

Pushpaka Vimanam

నచ్చేవి

ఫస్టాఫ్ లో వచ్చే ఫన్,సిట్యువేషన్ కామెడీ

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

నచ్చవి

కాంప్లిక్స్ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాకపోవటం 
విషయం లేని సెకండాఫ్ 
 

Pushpaka Vimanam


ఫైనల్ థట్
టైటిల్ బాగుందనో, ట్రైలర్ బాగుందనో టెమ్ట్ కాకూడదు
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2
 

ఎవరెవరు...
 

బ్యానర్స్: కింగ్ అఫ్ ది హిల్ ప్రొడక్షన్, టాంగా ప్రొడక్షన్స్ 
 నటీనటులు: ఆనంద్ దేవరకొండ, గీత్ సైనీ, శాన్వీ మేఘన, సునీల్, భద్రం, సుదర్శన్, వీకే నరేష్ తదితరులు
సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్
 ఆర్ట్ డైరెక్టర్ : నీల్ సెబాస్టియన్, 
ఎడిటర్ : రవితేజ గిరిజాల
 మ్యూజిక్: రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని.
 కాస్టూమ్స్ : భరత్ గాంధీ 
 రచన-దర్శకత్వం: దామోదర 
సమర్పణ: విజయ్ దేవరకొండ
 నిర్మాతలు: గోవర్థన్ రావు దేవరకొండ, విజయ్ దషీ, ప్రదీప్ ఎర్రబెల్లి 
రన్ టైమ్: 2 గంటల 22 నిముషాలు
 రిలీజ్ డేట్: 2021-11-2021 

Latest Videos

click me!