
అనుష్క శెట్టి తన కెరీర్‌లో కమర్షియల్ మూవీస్‌తోపాటు విభిన్నమైన రోల్స్ కూడా చేసింది. `అరుంధతి` వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలు. అలాగే `వేదం` లాంటి విభిన్నమైన మూవీస్ కూడా చేసి మెప్పించింది. `వేదం` అనుష్క కెరీర్‌లో ఓ స్పెషల్ మూవీగా నిలుస్తుంది. ఇందులోని సరోజ పాత్ర సైతం అంతే ప్రత్యేకంగా నిలుస్తుంది. అయితే ఈ చిత్ర దర్శకుడు క్రిష్ ఈ పాత్ర ని కంటిన్యూ చేయాలనుకున్నారట. `వేదం`తో దాన్ని స్టాప్ చేయకుండా సరోజ పాత్రతో మరో సినిమా చేయాలనుకున్నాడట. మంగళవారం `ఘాటి` ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆయన ఈ విషయాలను పంచుకన్నారు.
``వేదం` సినిమా తర్వాత స్వీటీతో మరో మూవీ చేయాలనే ఆలోచన ఎప్పటినుంచో ఉండేది. సరోజ చాలా గొప్ప పాత్ర. ఆ పాత్రని కొనసాగించాలని ఆలోచన కూడా జరిగింది. అయితే ఆర్గానిక్ గా ఉండే ఒక కథ కోసం ఎదురుచూస్తున్నప్పుడు `ఘాటి` వచ్చింది. ఇందులో శీలావతి క్యారెక్టర్ అనుష్క గ్రేస్, యాటిట్యూడ్, సూపర్ స్టార్ డమ్ కి పర్ఫెక్ట్ యాప్ట్` అని తెలిపారు క్రిష్. `ఘాటి` ఎలా స్టార్ట్ అయ్యిందో తెలిపారు.
``డాక్టర్ చింతకింద శ్రీనివాసరావు గొప్ప రచయిత. ఆయన రచనలు అద్భుతంగా ఉంటాయి. మా కంపెనీలో 'అరేబియన్ కడలి' వెబ్ సిరీస్ కి కథ మాటలు రాశారు. వేరే కథల గురించి చర్చించే సమయంలో `ఘాటి` ఆలోచన చెప్పారు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్‌లో శిలావతి గాంజా రకం పెరుగుతుంది. దానికోసం ఒక వ్యవస్థ పని చేస్తుంటుంది. వాటిని మోయడానికి కొంతమంది కూలీలు ఉంటారు. వారిని ఘాటీలని పిలుస్తారు. వాళ్ళ నేపథ్యం గురించి చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. 30 పేజీల కథగా రాశారు. చాలా నచ్చింది. దాన్ని డెవలప్ చేయడం మొదలు పెట్టాను. లొకేషన్ కోసం తూర్పు కనుమలకు వెళ్లాను. అదంతా ఒక కొత్త ప్రపంచం. జీవన శైలి అంతా కొత్తగా ఉంది. ఒక కొత్త ప్రపంచం, కల్చర్ ని చూపించే స్కోప్ ఉండటంతో ఈ మూవీ స్టార్ట్ చేశాం. `ఘాటి` కథ పూర్తిగా ఫిక్షనల్. గంజాయి అనేది ఒక సోషల్ ఇష్యూ. దాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే అవన్నీ దాటి గంజాయి సమాజంలోకి వస్తుంది. సర్వైవల్ కోసం చేసినా పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఐడెంటిటీ, సర్వైవల్ థీమ్స్ తో వస్తున్న సినిమా ఇది` అని చెప్పారు క్రిష్.
దర్శకుడు ఇంకా చెబుతూ, `ఈ సినిమా కమర్షియల్ యాక్షన్ తో స్వీటీ కోసం చేసిన ఒక బిగ్ స్కేల్ మూవీ. మనందరం ఎదుర్కొంటున్న ఒక సమస్య నిర్మూలనకి ఊతమిస్తుంది కానీ గ్లోరీఫై చేసేలా ఉండదు. ఇది చాలా కాంప్లెక్స్ స్టోరీ. చాలా తీవ్రమైన భావోద్వేగాలు ఉంటాయి. ఈ కథని చాలా అందంగా, సినిమాటిక్ గా అన్ని జాగ్రత్తలు తీసుకుని చెప్పాను. `ఘాటి` కథని యాక్షన్ తో చెబితేనే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు అలాంటివి. చాలా తీవ్రమైన పాత్రలు, చాలా తీవ్రమైన భావోద్వేగాలతో ఉంటాయి. యాక్షన్ సీక్వెన్స్ లో ఆ ఎమోషన్ కనిపిస్తుంది. ఎమోషన్స్, పెర్ఫార్మెన్స్, లొకేషన్స్ పరంగా లార్జెస్ట్ కాన్వాస్ ఉన్న సినిమా ఇది` అని వెల్లడించారు.
`అనుష్క బలం ఏంటో మనందరికీ తెలుసు. స్వీటీ సినిమా బాగుంటే ఆ రేంజ్ ఎలా ఉంటుందో చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. `అరుంధతి` నుంచి `భాగమతి` వరకు ఎన్నో ఐకానిక్ పెర్ఫార్మెన్స్ లు ఇచ్చారు. `ఘాటి`లో తనకి చాలా ఎక్సైటింగ్ క్యారెక్టర్ దొరికింది. మేమంతా బిలీవ్ చేసి ఈ ప్రాజెక్టుని ఎక్కడ రాజీ పడకుండా నిర్మించారు. బిజినెస్ చాలా బావుంది. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం` అని చెప్పారు. అనుష్క శెట్టి మెయిన్ లీడ్‌గా చేస్తున్న `ఘాటి` మూవీ యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది. ఇందులో ఆమెకి జోడీగా తమిళ నటుడు విక్రమ్ ప్రభు నటించారు. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ మూవీని UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కాబోతుంది.