దిల్ రాజు తన కెరీర్ లో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసింది చాలా తక్కువ. దిల్ రాజు ఎక్కువగా కొత్త దర్శకులని పరిచయం చేస్తుంటారు. పక్కాగా కథ రాయించుకోవడం, కొత్త దర్శకుడిని ఎంచుకుని హిట్ల మీద హిట్లు కొట్టడం దిల్ రాజు సక్సెస్ ఫార్ములా. దిల్ రాజు తన కెరీర్ లో సుకుమార్, బోయపాటి, వంశీ పైడిపల్లి, బొమ్మరిల్లు భాస్కర్ లాంటి క్రేజీ దర్శకులని ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
దిల్ రాజు పరిచయం చేసినప్పుడు వాళ్లంతా స్టార్ డైరెక్టర్లు కాదు. స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసే విధానానికి దిల్ రాజు వ్యతిరేకమా అంటే.. అదీ కాదు. ఆయనకి కూడా స్టార్ డైరెక్టర్లతో సినిమా చేయాలని ఉంటుందట. ఈ విషయాన్ని స్వయంగా దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
గతంలో పూరి జగన్నాథ్ తో సినిమా చేయాలని దిల్ రాజు చాలా ప్రయత్నించారట. కానీ కుదర్లేదు. శ్రీను వైట్లతో సినిమా చేయాలని ఆనందం మూవీ తర్వాతే ట్రై చేశారట. ఆయనతో కూడా ప్రాజెక్ట్ మెటీరియల్ కాలేదు. ఆర్య తర్వాత సుకుమార్ తో మరో సినిమా చేయడానికి చర్చలు జరిగాయి. సుకుమార్ జగడం కథ వినిపించారు. ఆ కథ నచ్చక దిల్ రాజు చేయలేదు. సుకుమార్ తో సినిమా కుదర్లేదు కాబట్టి ఆ టైం లో దిల్ రాజు.. రాజమౌళితో మూవీ చేయడానికి ప్రయత్నించారట.
రాజమౌళిని వెళ్లి అడగగా ఒక మాట అన్నారట.. మీలాంటి నిర్మాత నాతో సినిమా చేస్తే అది మరొక చిత్రం మాత్రమే అవుతుంది. అదే కొత్త దర్శకుడితో చేస్తే ఇండస్ట్రీలో మరొకరికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు అని చెప్పారు. రాజమౌళి మాటలకు దిల్ రాజు ఫిదా అయ్యారట. ఏది ఏమైనా జక్కన్నతో దిల్ రాజు కాంబినేషన్ సెట్ కాలేదు.
కానీ దిల్ రాజు.. శంకర్ దగ్గర మాత్రం బుక్కయ్యారు. అంత పెద్ద దర్శకుడితో దిల్ రాజు చేసిన గేమ్ ఛేంజర్ చిత్రం ఇటీవల విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి నష్టాలు తప్పవని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా చేసినప్పటికీ అది మూడేళ్ళ పాటు వాయిదా పడుతూ ఎట్టకేలకు విడుదలైంది. కానీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు.