నటుడు ధనరాజ్ టాలీవుడ్ లో కమెడియన్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. తనకున్న కామెడీ ఇమేజ్ కి భిన్నంగా తొలిసారి ధనరాజ్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రంలో నటించారు. ధనరాజ్ ప్రధాన పాత్రలో నటించిన 'బుజ్జీ ఇలారా' చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధనరాజ్ చేసిన ఈ విభిన్నమైన ప్రయత్నం ఎలా ఉందొ సమీక్షలో తెలుసుకుందాం.
కథ :
వరంగల్ పట్టణంలో వరుసగా బాలికల కిడ్నాప్ లు జరుగుతుంటాయి. ఈ కేసుని ఛేదించే బాధ్యతని ఇన్స్పెక్టర్ కేశవ(ధనరాజ్)కి ఎస్పీ అప్పగిస్తారు. కేశవకి భార్య అనసూయ( చాందిని తమిళరాసన్) కుమార్తె పావని ఉంటారు. తన కుమార్తె వయసున్న బాలికలే ఎక్కువగా కిడ్నాప్ అవుతుండడంతో కేశవ ఈ కేసుని సీరియస్ గా తీసుకుని ఇంటరాగేషన్ మొదలు పెడతాడు.
ఈ క్రమంలో కిడ్నాప్ ల వెనుక ఓ వ్యక్తి హస్తం ఉందని ధనరాజ్ కి తెలుస్తుంది. కొత్తగా కిడ్నాప్ చేసిన బాలికల్ని హత్య చేసి వారి గుండెలని తీసుకుంటుంటారు. దీనితో ఈ కేసు మరింత కఠినంగా మారుతుంది. వెంటనే మరో పోలీస్ అధికారి ఖయ్యుమ్ ( సునీల్) కి కూడా ఈ కేసు భాద్యతలు ఇస్తారు. సునీల్ రంగంలోకి దిగిన తర్వాత మరింత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి. అసలు కిడ్నాప్ చేస్తోంది ఎవరు ? గుండెలని ఎందుకు తీసుకుంటున్నారు ? ఈ కేసుని ధనరాజ్, సునీల్ చేధించగలిగారా ? అని తెలుసుకోవడమే ఈ చిత్ర కథ. సుస్పెస్ థ్రిల్లర్ చిత్రం కాబట్టి ఈ అంశాలన్నీ సినిమా చూసే తెలుసుకోవాలి.
విశ్లేషణ :
కరెంట్ తీగ, తెనాలి రామకృష్ణ, ఇంట్లో దెయ్యం నాకేం భయం లాంటి వినోదాత్మక చిత్రాలని తెరకెక్కించిన జి నాగేశ్వర్ రెడ్డి ఈ చిత్రాన్ని దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. సినిమాటోగ్రాఫర్ అంజి ఈ చిత్రానికి దర్శకుడు. ధనరాజ్ ని ప్రధాన పాత్రలో పెట్టి సైకలాజికల్ థ్రిల్లర్ తో చిత్ర యూనిట్ చేసిన సాహసోపేత ప్రయత్నం ఈ చిత్రం. కథ ప్రారంభం నుంచి ఒక సపరేట్ మూడ్ లో సాగుతుంది. థ్రిల్లర్ చిత్రాలకు కావాల్సింది అదే. గతంలో కమెడియన్ గా కనిపించిన ధనరాజ్ ఈ చిత్రంలో సీరియస్ పోలీస్ గా కనిపిస్తారు.
ప్రారంభ సన్నివేశాల్లో ధనరాజ్ ని ఈ పాత్రలో చూడడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. కానీ కథ ముందుకు సాగే కొద్దీ ధనరాజ్ పాత్రతో ట్రావెల్ చేస్తాం. సునీల్ కూడా పోలీస్ అధికారిగానే కనిపిస్తాడు. సునీల్ ని చాలా చిత్రాల్లో సీరియస్ రోల్స్ లో చూశాం కాబట్టి అతడి పాత్ర ఇబ్బందిగా అనిపించదు. హీరోయిన్ చాందిని తమిళంలో గ్లామర్ రోల్స్ లో మెప్పించింది. ఈ మూవీలో ఓ పాపకి తల్లిగా వైవిధ్యం చూపించింది. క్లైమాక్స్ లో ఆమె నటనే సినిమాకి హైలైట్.
గతంలో తెరకెక్కిన సైకో థ్రిల్లర్ చిత్రాలని దృష్టిలో పెట్టుకుని మరీ అతిగా అనిపించే సీన్లు రాసుకున్నారు. హింసాత్మక సన్నివేశాలు జీర్ణించుకోలేని విధంగా ఉంటాయి. ప్రేక్షకుల ఇబ్బంది కలిగిస్తాయి. సైకో థ్రిల్లర్ చిత్రాలని ఓపిగ్గా చూడగలిగే వారికి మాత్రమే ఈ మూవీ అని చెప్పొచ్చు. ఇలాంటి చిత్రాలు థ్రిల్ అందించడంతో పాటు ఎమోషనల్ గా కూడా కనెక్ట్ కావాలి. అది ఇందులో మిస్ అయింది. క్లైమాక్స్ ని ఊహించని విధంగా మలచి మెప్పించారు. ఇతర సన్నివేశాలు కూడా షార్ప్ గా, డీసెంట్ గా చిత్రీకరించి ఉంటే బావుండేది. ఈ చిత్రం థియేటర్స్ లో కంటే ఓటిటిలో ఎక్కువగా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది.
టెక్నికల్ గా:
సాంకేతిక అంశాల్లో ముందుగా సంగీతం గురించి మాట్లాడాలి. ప్రతి సన్నివేశానికి బలం చేకూరేలా సాయి కార్తీక్ నేపథ్య సంగీతం అందించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ బాధ్యతలు దర్శకుడు అంజినే నిర్వహించారు. థ్రిల్లర్ అనిపించే పరిస్థితులు ఉండేలా ఆయన కెమెరా వర్క్ ఉంది. ఫస్ట్ హాఫ్ లో ఎడిటింగ్ ఇంకాస్త పని చెప్పి ఉండాల్సింది. డైలాగులు కూడా నార్మల్ గా ఉంటాయి. దర్శకుడిగా అంజి డీసెంట్ జాబ్ చేశారు. ఇతర ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ కూడా ఒకే అని చెప్పాలి. కథకి ఇంకాస్త పదును పెట్టి ఉంటే మెరుగైన ఫలితం ఉండేది. థియేటర్స్ కి కూడా జనాలు ఆకర్షించే అవకాశం ఉండేది.
ఫైనల్ థాట్ :
ధనరాజ్ చాలా సీరియస్ పాత్రలో నటించిన విభిన్నమైన ప్రయత్నం ఈ చిత్రం. సీరియస్ సైకో డ్రామాలు ఫాలో అయ్యేవారికి మాత్రమే ఈ చిత్రం నచ్చుతుంది.
రేటింగ్ : 2.5/5