వివాదంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రొడక్షన్ హౌస్, ఉద్యోగులను మోసం చేసారా?

First Published Jun 23, 2024, 8:26 AM IST

ప్రాజెక్ట్‌లో పని చేసిన నటీనటులకు వెంటనే డబ్బు చెల్లించిన సంస్థ తమ వద్దకు వచ్చే సరికి సాకులు చెప్తూ వేతనాలు ఇవ్వట్లేదని మండిపడ్డారు.  


నిర్మాత తమకు ఇవ్వాల్సిన చివరి పైసా సైతం ముక్కు పిండి వసూలు చేస్తూంటారు హీరో,హీరోయిన్స్. అదే వారి సొంత ప్రొడక్షన్ హౌస్ అయితే అందరికీ అలాగే క్లియర్ చేయాలనుకోరా అని  సోషల్ మీడియా జనం డైరక్ట్ గా ప్రశ్నిస్తున్నారు. అందుకు కారణం రకుల్ ప్రీతి సింగ్ ప్రొడక్షన్ హౌస్ లో స్టాప్ కు జీతాలు ఇవ్వకపోవటమే. వారు సోషల్ మీడియా ద్వారా తమ ఆవేదనను వెల్లబుచ్చుతున్నారు. వివరాల్లోకి వెళితే...
 


బాలీవుడ్‌లో పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరిట రకుల్ భర్త జాకీ భగ్నానీ కి ప్రముఖ నిర్మాణ సంస్థ ఉంది. ఇప్పుడు అందులో ఉద్యోగులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని పబ్లిక్‌గా బయట పెట్టడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. దాంతో పూజా ఎంటర్‌టైన్‌మెంట్ (Pooja Entertainment) వివాదంలో చిక్కుకుంది. నిర్మాణ సంస్థ తమకు ఇవ్వాల్సిన వేతనాలను చెల్లించట్లేదని సంస్థ సిబ్బంది సోషల్‌ మీడియా వేదికగా ఆరోపణలు చేశారు. 
 


వారు తీసిన సినిమాకు బడ్జెట్‌ ఎక్కువయినందువల్ల తమకు వేతనాలు చెల్లించలేకపోతున్నామని నిర్మాణ సంస్థ తెలిపినట్లుగా అందులోని ఓ సభ్యురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తాము కష్టపడి చేసిన పనికి చెల్లించాల్సిన జీతాలను ఏడాది కాలంగా ఇవ్వకపోవడంతో పరిస్థితి దయనీయంగా మారిందని, అందువల్లే ఈ విషయాన్ని బయటకు చెప్పక తప్పట్లేదన్నారు. 
 


1986లో పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ సంస్థ ఏర్పాటైంది. కూలీ నంబర్ 1, బడేమియా చోటే మియా (1998), బీవీ నంబర్ 1, ఖామోషీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తీసింది. ఆ తర్వాత అనేక సినిమాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ రావడం లేదు. రీసెంట్‌గా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా బడే మియా చోటే మియా అనే యాక్షన్ మూవీ తీసింది. ఘోరమైన నష్టాల్ని చవిచూసింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు పనిచేసినందుకు గానూ తమకు ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వట్లేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
 


ప్రొడక్షన్ డిజైన్ వర్కర్ అయిన బాధితురాలు రెండేళ్ల క్రితం దాదాపు 100 మంది సిబ్బందితో కలిసి ఓ సినిమాలో పనిచేశానని తెలిపారు. ప్రస్తుతం వారందరూ రెండు నెలల జీతం కోసం ఇంకా ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్‌లో పని చేసిన నటీనటులకు వెంటనే డబ్బు చెల్లించిన సంస్థ తమ వద్దకు వచ్చే సరికి సాకులు చెప్తూ వేతనాలు ఇవ్వట్లేదని మండిపడ్డారు. ‘నేను కష్టపడి సంపాదించిన డబ్బు నాకెప్పుడు వస్తుంది’ అంటూ  ప్రశ్నించారు. 
 


బాలీవుడ్ సిని పరిశ్రమ రూల్స్ ప్రకారం.. సినిమా పూర్తయిన 45-60 రోజుల్లో బకాయిలన్నీ చెల్లించాలి. కానీ ఇప్పటివరకు తమకు 2 నెలల జీతాలు అందలేదని.. పూజా సంస్థలో పనిచేసిన ఉద్యోగులు పబ్లిక్‌గా చెబుతున్నారు. వైష్ణవి అనే ఉద్యోగి మాట్లాడుతూ.. తనతో పాటు పనిచేసిన 100 మందికి.. తమకు ఇవ్వాల్సిన జీతాల కోసం గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేసింది.


అదే సమయంలో ఇదే సంస్దలో పనిచేసే మరో ఉద్యోగి స్పందిస్తూ.. ఔట్ డోర్ షూటిం‍గ్స్ జరిగేటప్పుడు తమకు సరైన తిండి కూడా పెట్టరని ఆరోపించారు. 3 నెలలు పనిచేస్తే రెండు నెలల జీతం ఎగ్గొడతారని చెప్పాడు. ఇప్పుడు తాము ఈ విషయాన్ని బయటకు చెప్పడం వల్ల మిగతా వాళ్లయినా జాగ్రత్త పడతారని అందుకే ఇలా పోస్టులు పెడుతున్నామని అన్నారు. మరి ఈ ఆరోపణలపై రకుల్, జాకీ  స్పందన ఏమిటనేది చూడాలి?
 


రకుల్ కెరీర్ విషయానికి వస్తే... త్వరలో ‘భారతీయుడు 2’తో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది .   కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో శంకర్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు సినీప్రియుల దృష్టిని ఆకర్షించాయి. ఇందులో కాజల్, సిద్ధార్థ్‌లతో పాటు ఓ కీలక పాత్రలో మెరవనుంది రకుల్‌. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ఈ సినిమాలోని తన పాత్ర గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. 
 


రకుల్ మాట్లాడుతూ...‘‘ఇది కచ్చితంగా నా కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రాల్లో ఒకటిగా ఉండిపోతుంది. ఇందులో నేను పోషించిన పాత్ర కూడా మునుపటి కంటే భిన్నంగా ఉండనుంది. ఈ చిత్రంలో నేను ఆత్మవిశ్వాసం కలిగిన అమ్మాయిగా కనిపించనున్నాను. అనుకున్న దాన్ని ఎలా సాధించాలో ఆమెకు బాగా తెలుసు. ఈ ప్రాజెక్టుతో ప్రయాణం చేస్తున్నన్ని రోజులు..ఈ పాత్ర నా నిజజీవితానికి దగ్గరగా ఉందనే భావన కలిగింది. మరిన్ని విషయాలు వెల్లడించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. కానీ ఇప్పుడు చెప్పలేను. శంకర్‌ సర్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది’’అని చెప్పుకొచ్చింది. 
 


న్యూదిల్లీకి చెందిన రకుల్‌.. కన్నడ సినిమా ‘గిల్లీ’తో నటిగా ఎంట్రీ ఇచ్చారు. 2014లో విడుదలైన ‘యారియాన్‌’తో ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ రాణిస్తున్నారు. ప్రస్తుతం ‘దే దే ప్యార్‌ దే2’ చిత్రీకరణలో ఉంది రకుల్‌.

Latest Videos

click me!