
తెలంగాణ విముక్తి పోరాటం నేపథ్యంలో సాగి చారిత్రక కథాంశంతో రూపొందిన సినిమా ‘రజాకార్’. పొలిటికల్ గా ఎన్నో వివాదాలకు కేంద్రంగా నిలిచిన ఈ చిత్రం ఎన్నో అడ్డంకుల్ని దాటుకొని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో తెలంగాణ పోరాట యోధుల గాథను చూపించటంతో పాటు వివాదాస్పదమైన అంశాల ప్రస్తావన ఉంది.
మార్చి 15న విడుదలైన ఈ మూవీ ఒక వర్గం వారిని కించపరిచే విధంగా ఉందంటూ వివాదం చెలరేగింది. థియేటర్‌లో కాస్త పర్వాలేదని మెప్పించిన ఈ మూవీ విమర్శల కారణంగా ఇప్పటి వరకు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు కాలేదు. అయితే, దాదాపు 9 నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలో విడుదల కు రంగం సిద్దమై ప్రకటన వచ్చింది.
అప్పట్లో నిజాం పరిపాలనలో హైదరాబాద్ సంస్థానంలో ఎలాంటి అరాచకాలు, అకృత్యాలు జరిగాయి.. గ్రామాల్లో రజాకార్లు ఎంతటి దురాగతాలకు పాల్పడ్డారు.. వారిని ఎదిరించి పోరాడే క్రమంలో ప్రజలే సాయుధులై కదన రంగంలోకి దూకిన తీరు.. ఈ క్రమంలో వీరమరణం పొందిన వేలాది యోధుల కథలు.. తెలంగాణ చరిత్రలో ఇప్పటికీ సజీవం. చరిత్ర పుటల్లో దాగిన ఆ నెత్తుటి కథల్నే ‘రజాకార్’ రూపంలో భావోద్వేగభరితంగా తెరపై చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు యాట సత్యనారాయణ. రజాకార్ల దుశ్చర్యలను ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ సినిమాని ఆసక్తికరంగా ముందుకు నడిపించారు.
గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, హిందీ భాషల్లో విడుదలయింది. తెలంగాణ పోరాట యోధుల గురించి రాబోయే తరాలకు చెప్పాలనే 'రజాకార్' నిర్మించినట్లు ఆయన చెప్పారు.
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ హక్కులను 'ఆహా' సంస్ధ సొంతం చేసుకుంది. ఈమేరకు తన సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ కూడా చేసింది. త్వరలో రజాకర్ చిత్రాన్ని స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు ఆహా ప్రకటించన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, రిలీజ్ డేట్ ఎప్పడనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. అయితే డిసెంబర్ 20న ఓటీటీలో విడుదల కావచ్చు అంటున్నారు.
ఇక ఈ సినిమాలో అప్పట్లో తబ్లిగ్ ఫర్మానా పేరుతో రజాకార్లు ప్రజల్ని బలవంతంగా మతమార్పిడి చేయించిన తీరు.. తెలుగు భాష మాట్లాడుతున్నారన్న అక్కసుతో బడుల్లో పిల్లలపై వారు చేసిన దారుణాలు.. ఊళ్లలో మహిళలు, ఆడపిల్లలపై రజాకార్లు, వాళ్ల ప్రతినిధుల అఘాయిత్యాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ ప్రథమార్ధం సాగుతుంది.
అయితే దీంట్లో ప్రత్యేకంగా హీరోలంటూ ఎవరూ కనిపించరు. ఎందుకంటే ప్రతి పది పదిహేను నిమిషాలకు ఒకసారి ఓ శక్తిమంతమైన పాత్ర తెరపైకి వచ్చి తనదైన పోరాట స్ఫూర్తిని చూపించి మాయమవుతుంటుంది.
అలాగే సినిమాలో ఎక్కువ శాతం తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ఉన్న వీరగాథలే. (Razakar Movie ) అయితే అవన్నీ తెలిసిన కథలే అయినా తెరపై చూసినప్పుడు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటాయి. కొన్ని ఎపిసోడ్లలో రజాకార్ల అకృత్యాలు చూస్తున్నప్పుడు వాళ్లు కనిపిస్తే నిజంగా మనమే తిరగబడాలన్నంత ఆవేశం కలిగించేలా ఉంటాయి.
బాబీ సింహా, అనసూయ, వేదిక, అనుష్యా త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే వంటి ముఖ్య నటీనటులు రజాకర్ చిత్రంలో నటించారు. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం కావడానికి ముందు రజాకార్లు సాగించిన అకృత్యాలను ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు చెప్పారు.