ఎప్పుడూ నవ్వించే వైవా హర్ష ఏడిపించేశాడు, ఓటీటీలో దుమ్ములేపుతోంది.. ఆ ఒక్క లోపం లేకుంటే దీన్ని మించే మూవీ లేదు

Published : Sep 14, 2025, 02:43 PM IST

Viva Harsha : వైవా హర్ష, కమెడియన్ ప్రవీణ్ ప్రధాన పాత్రల్లో నటించిన బకాసుర రెస్టారెంట్ చిత్రం ఓటీటీలో దూసుకుపోతోంది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హీరోగా ప్రవీణ్ చేసిన తొలి ప్రయత్నం బకాసుర రెస్టారెంట్.

PREV
15
ఓటీటీలో బకాసుర రెస్టారెంట్ 

ప్రముఖ నటుడు ప్రవీణ్ టాలీవుడ్ లో కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. ప్రేమ కథా చిత్రం, ప్రతి రోజూ పండగే లాంటి చిత్రాల్లో ప్రవీణ్ కామెడీ చాలా బావుంటుంది. హీరోగా ప్రవీణ్ చేసిన తొలి ప్రయత్నం బకాసుర రెస్టారెంట్. ఈ ఎస్ జె శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఆగస్ట్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం థియేటర్స్ లో అంతగా రాణించలేదు. కానీ ఇటీవల ఓటీటీలో రిలీజ్ చేశారు.

25
ఎవరెవరు నటించారంటే 

అమెజాన్ ప్రైమ్ వీడియోలో బకాసుర రెస్టారెంట్ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ దక్కుతోంది. దానికి కారణం ఈ చిత్రంలో ఉండే కథాంశమే అని చెప్పాలి. దర్శకుడు బకాసుర రెస్టారెంట్ మూవీ కోసం చాలా మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారు. అయితే ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో సన్నివేశాలపై ఇంకా శ్రద్ద తీసుకుని ఉంటే చిన్న చిత్రాల్లో అద్భుతమైన మూవీగా నిలిచేది. ఈ మూవీలో ప్రవీణ్ హీరో కాగా, వైవా హర్ష, కృష్ణ భగవాన్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించారు. ఇది మంచి సందేశంతో కూడిన హర్రర్ కామెడీ చిత్రం. 

35
కథ ఏంటంటే.. 

కథ విషయానికి వస్తే.. ప్రవీణ్ తన స్నేహితులతో కలసి ఉంటూ సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తుంటాడు. ఇష్టం లేకపోయినా తనని కష్టపడి చదివించిన తల్లిదండ్రుల కోసం ఉద్యోగం చేస్తుంటాడు. ఎప్పటికైనా సొంతంగా మంచి రెస్టారెంట్ ప్రారంభించాలనేది అతడి కోరిక. రెస్టారెంట్ ప్రారంభించాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. దీనితో ఆ డబ్బుని కూడబెట్టడం కోసం యూట్యూబ్ లో వైరల్ వీడియోలు చేస్తుంటాడు.  హారర్ టచ్ ఉండే వీడియోలు బాగా వైరల్ అవుతాయి కాబట్టి ఎక్కడైనా పాడుబడిన బంగ్లాలో దెయ్యం ఉన్నట్లు వీడియో తీయాలని అనుకుంటాడు. తన స్నేహితులతో కలసి ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఈ క్రమంలో అనుకోకుండా ఒక ఆత్మ బయటకి వస్తుంది. ఆ ఆత్మ ప్రవీణ్ స్నేహితుల శరీరాల్లోకి ప్రవేశించి వాళ్ళు వండుకున్న ఫుడ్ మొత్తం తినేస్తూ ఉంటుంది. విపరీతమైన ఆకలి ఉన్న ఆ ఆత్మ ఎవరు ? ఎందుకు ఫుడ్ అంతలా తింటోంది / దానిని వదిలించుకోవడం ఎలా అని ప్రవీణ్, అతడి స్నేహితులు తెలుసుకోవడం ప్రారంభిస్తారు. 

45
ఏడిపించేసిన వైవా హర్ష 

ఒకసారి ఆ ఆత్మే తన ఫ్లాష్ బ్యాక్ చెబుతుంది. ఇంతకీ ఆ ఆత్మ ఎవరు ? ఆ వ్యక్తి ఎలా చనిపోయి ఆత్మగా మారాడు ? చివరికీ దానిని ప్రవీణ్ అతడి స్నేహితులు వదిలించుకున్నారా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఫ్లాష్ బ్యాక్ లో మరణించి ఆత్మగా మారింది ఎవరో కాదు వైవా హర్ష. అతడి పాత్ర ఈ చిత్రంలో చాలా ఎమోషనల్ గా ఉంటుంది. వైవా హర్ష కి విపరీతమైన ఆకలి రోగం ఉంటుంది. అతడికి తల్లిదండ్రులు ఉండరు. నానమ్మే పోషిస్తూ ఉంటుంది. ఎంత ఫుడ్ తిన్నా ఇంకా కావాలనిపించే ఆకలి అతడిది. నానమ్మ మరణం తర్వాత అతడి జీవితం దుర్భరంగా మారుతుంది. ఆ సన్నివేశాల్లో వైవా హర్ష కంటతడి పెట్టించేలా నటించారు. 

55
మిడిల్ క్లాస్ కి కనెక్ట్ అయ్యే సందేశం 

ప్రీ క్లైమాక్స్ లో వచ్చే అల్లరి దెయ్యాల సన్నివేశాలు ఈ చిత్రానికి మైనస్ అనే చెప్పాలి. ఆ సన్నివేశాలు సిల్లీగా ఉంటాయి. ప్రవీణ్ స్నేహితులు ఆ దెయ్యలతో కలిసి చేసిన కామెడీ ఏమాత్రం వర్కౌట్ కాలేదు. క్లైమాక్స్ లో ప్రవీణ్ అతడి స్నేహితులు.. వైవా హర్షకి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. శ్రీకాంత్ అయ్యంగార్ తో ప్రవీణ్ చెప్పే జాబ్ కష్టాల డైలాగులు మిడిల్ క్లాస్ యువతకి కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఓవరాల్ గా బకాసుర రెస్టారెంట్ మూవీ ఓటీటీలో మంచి టైం పాస్ అని చెప్పొచ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories