సినిమా కళా రంగాన్ని ప్రోత్సాహించే ఉద్దేశ్యంతో, కళాకారుల ప్రతిభ, వారి సేవాలను గుర్తించే ఎంకరేజ్ చేసే క్రమంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంది అవార్డులను అందించేది ప్రభుత్వం. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన పోరాటాల ఫలితంగా ఆ అవార్డులు ఆగిపోయాయి. రెండు రాష్ట్రాలు విడిపోయాక.. అప్పటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాకతీయ అవార్డుల, సింహా అవార్డుల పేరుతో పురస్కారాలు ఇవ్వాలని భావించింది.
మరోవైపు ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం నంది అవార్డుల పేరుతోనే ఓ ఏడాది అవార్డులను ప్రకటించింది. కానీ వివాద్ కావడంతో దాన్ని ఆపేశారు. అప్పట్నుంచి మళ్లీ ఇప్పటి వరకు ఆ అవార్డుల ఊసేలేదు. తెలంగాణ ప్రభుత్వం కాలయాపన చేస్తూ వచ్చింది. అవార్డుకి పేరుకి సంబంధించిన కమిటీని కూడా వేశారు. సింహా అవార్డులు అనే పేరుని పరిశీలించారు. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. ఇండస్ట్రీ పెద్దలు కూడా దానిపై ఆసక్తి చూపించలేదు. ఎవరూ ప్రభుత్వాన్ని అడిగే పరిస్థితి లేదు. దీంతో అంతా లైట్ తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో రెండు తెలుగు ప్రభుత్వాలు ఈ నంది అవార్డులను పక్కన పెట్టేశాయి. అసలు ఇలా ఒక అవార్డులు ఉండేవనే విషయమే మర్చిపోయే పరిస్థితికి తీసుకువచ్చారు. ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆ మధ్య చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం వచ్చిన సందర్భంగా నంది అవార్డుల ప్రస్తావన తెచ్చారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఇండస్ట్రీ పెద్దలు సలహాలు, సూచనలు చేయాలని తెలిపారు.
దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, టాలీవుడ్ పెద్దలకు చురకలు అంటించారు. డిసెంబర్ 9న నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్దులను తెస్తామని ప్రకటించామని, దానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. అయితే దీనికి సంబంధించిన సూచనలు, సలహాలు చేయాలని ఇండస్ట్రీ పెద్దలను కోరాను. కానీ ఇప్పటి వరకు వారి నుంచి స్పందన లేదు, ఏ కారణం చేత వాళ్లు స్పందించలేదో తెలియదు. కానీ గద్దర్ పేరుతో అవార్డులను తీసుకురావాలనుకుంటున్నాం.
ఈ లోపు ఇండస్ట్రీ నుంచి స్పందించి వారు ఏమైనా సలహాలిస్తే వాటిని పరిగణలోకి తీసుకుంటాం. లేదంటే ముందు చెప్పినట్టుగానే డిసెంబర్ 9న అవార్డులు ఇవ్వాలది నిర్ణయిస్తాం. గద్దర్ పేరుతో అవార్డులు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని, మాకు ఏది బాగా అనిపిస్తుందో దానితోనే ముందుకు వెళ్తాం అని తెలిపారు రేవంత్ రెడ్డి.
revanth reddy.j
మురళీ మోహన్ ప్రస్తావన తెచ్చిన నేపథ్యంలో సీఎం రియాక్ట్ అవుతూ టాలీవుడ్ పెద్దలకు చురకలు అంటించారు. ప్రభుత్వం చెప్పినా స్పందించకపోవడంతో ఒకింతా ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు అనిపిస్తుంది. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రాగానే ఎగిరి గంతులేశారు. బట్టలు చించుకుని అభిమానాన్ని చాటుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వానికి స్పందించకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మరి ఈ అవార్డుల విషయం ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.