సంధ్య థియేటర్ వివాదం హీరో అల్లు అర్జున్ ని వెంటాడుతుంది. తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెందిన నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు. ఒక రోజు రాత్రి జైలు జీవితం గడిపాడు. ఈ అరెస్ట్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వినిపించాయి. తెలంగాణ సీఎంని ట్రోల్ చేస్తూ పోస్ట్స్ వెలువెత్తాయి.
ఈ వివాదంలోకి తనను లాగడంపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ తో పాటు టాలీవుడ్ ప్రముఖుల పై విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న ఘటనలో మహిళ మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టులు చేశారు. ఏ 11గా ఉన్న అల్లు అర్జున్ కూడా అరెస్ట్ అయ్యాడు. అదుపులోకి తీసుకోవడానికి ఇంటికి వెళ్లిన పోలీసులతో అల్లు అర్జున్ దురుసుగా ప్రవర్తించాడు.
ఒక్క రోజు అల్లు అర్జున్ జైలులో ఉన్నందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎంని దూషించారు. అల్లు అర్జున్ కి ఏమైందని ఇండస్ట్రీ మొత్తం ఆయన్ని పరామర్శించడానికి వెళ్లారు. అల్లు అర్జున్ కి ఏమైనా కాలు పోయిందా? కన్ను పోయిందా? లేక కిడ్నీలు పాడయ్యాయా?. అల్లు అర్జున్ ని పరామర్శించిన ఇండస్ట్రీ పెద్దలు చావు బతుకుల్లో ఉన్న ఆ పిల్లాడిని కలిశారా? పరామర్శించారా? అసలు వీళ్ళను ఎలా అర్థం చేసుకోవాలి.. అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
ఈ వివాదం పరిశీలిస్తే... డిసెంబర్ 4వ తేదీ రాత్రి పుష్ప 2 ప్రీమియర్స్ ప్రదర్శన నేపథ్యంలో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్దకు హీరోయిన్ రష్మికతో పాటు వెళ్లారు. అల్లు అర్జున్ రాకతో భారీగా అభిమానులు సంధ్య థియేటర్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్ పేరు ఏ 11గా చేర్చారు. డిసెంబర్ 12న అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఆయనకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ ఎంపీ అడ్వకేట్ నిరంజన్ రెడ్డిని రంగంలోకి దించారు.
ఆయన వాదనలతో ఏకీభవించిన కోర్టు అల్లు అర్జున్ కి 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఒకరోజు రాత్రి అల్లు అర్జున్ చంచల్ గూడ జైలులో గడపాల్సి వచ్చింది. హైకోర్టులో వాదనలు జరుగుతుండగానే.. కింది కోర్టు తీర్పు మేరకు అల్లు అర్జున్ ని చంచల్ గూడ జైలుకి తరలించారు. కోర్టు బెయిల్ మంజూరు చేసిన క్రమంలో ఆర్డర్ కాపీ.. జైలు అధికారులకు అందాల్సి ఉంది. ఆ కాపీ మాకు సకాలంలో అందలేదన్న కారణం చూపుతూ అల్లు అర్జున్ ని జైలులో ఉంచారు.
Allu Arjun
ఇక అల్లు అర్జున్ అరెస్ట్ ఉద్దేశపూర్వకంగా జరిగింది. పుష్ప 2 సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మరిచారు. సీఎం ఇగో హర్ట్ కావడంతో అల్లు అర్జున్ పై కక్ష కట్టారని.. టీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలు, చిత్ర ప్రముఖులు అల్లు అర్జున్ అరెస్ట్ ని ఖండించారు. అరెస్ట్ అనంతరం విడుదలైన అల్లు అర్జున్ ని టాలీవుడ్ ప్రముఖులు పరామర్శించారు. స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి కలిసి సంఘీభావం తెలిపారు. అల్లు అర్జున్ కి ఇండస్ట్రీ ప్రముఖులు మద్దతు తెలపడాన్ని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఖండించారు.