ఒకప్పుడు రీమేక్ చిత్రాల ట్రెండ్ ఎక్కువగా ఉండేది. ఓటీటీ వచ్చాక రీమేక్ చిత్రాల ప్రభావం తగ్గింది. ప్రస్తుతం సీక్వెల్స్ హవా సాగుతోంది. సూపర్ హిట్ చిత్రాలకు సీక్వెల్స్ చేయడానికి మేకర్స్ ఇష్టపడుతున్నారు. అందుకే డైరెక్టర్ శంకర్ లాంటి వాళ్ళు కూడా ఎప్పుడో పాతికేళ్ల క్రితం వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా భారతీయుడు 2 తెరకెక్కించారు. అది విజయం సాధించలేదు. రీసెంట్ గా పుష్ప 2 వచ్చింది. బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది.
చిరంజీవి, బాలయ్య గతంలో నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి, ఆదిత్య 369 లాంటి చిత్రాలకు సీక్వెల్స్ రావాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి తన పాత సినిమాల గురించి చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రాలకి సీక్వెల్స్ కానీ, రీమేక్స్ గాని వస్తే ఏ హీరోలు ఏ సినిమా చేయాలో కూడా వివరించారు. మెగాస్టార్ మాటలు వింటే ఆయన ఛాయిస్ పర్ఫెక్ట్ అనాల్సిందే.
ముందుగా గ్యాంగ్ లీడర్ చిత్రం గురించి చెప్పారు. ఆ మూవీలో నా పాత్రని రాంచరణ్ కానీ, ఎన్టీఆర్ కానీ ఎవరో ఒకరు పోషించాలి. వారికి ఆ పాత్ర బాగా సెట్ అవుతుంది అని చిరు అన్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ అయితే మహేష్ బాబుకి బాగా సెట్ అవుతుంది. అదే విధంగా రాంచరణ్ కి కూడా బావుంటుంది అని అన్నారు.
ఠాగూర్ సినిమాకి మాత్రం తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే పర్ఫెక్ట్ ఛాయిస్ అని చిరు తెలిపారు. ఇంద్ర చిత్రం అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి బాగా సెట్ అవుతుందని చిరు తెలిపారు.
ఇక ఛాలెంజ్ చిత్రం అయితే అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఇద్దరికీ బావుంటుంది అని తెలిపారు. రౌడీ అల్లుడు చిత్రం అల్లు అర్జున్ కి కానీ, రవితేజకి కానీ బావుంటుంది అని తెలిపారు. చివర్లో స్వయం కృషి మూవీ గురించి అడగగా అది చిరంజీవికి మాత్రమే సాధ్యం అని తన గురించి తాను చెప్పుకున్నారు. దీనితో అక్కడున్న వారంతా చప్పట్లతో మోతెక్కించారు.