
సాధారణంగా సంక్రాంతికి ఎక్కువగా సినిమాలు విడుదలవుతుంటాయి. మళ్లీ ఉగాది, దసరా, దీపావళి పండగులకు కూడా బాగానే రిలీజెస్ ఉంటాయి. చిన్నా, పెద్ద సినిమాలు పోటీ పడుతుంటాయి. అయితే ఇప్పుడు క్రిస్మస్ కూడా మరో సంక్రాంతిని తలపిస్తోంది. ఈ క్రిస్మస్‌కి ఏకంగా ఏడు సినిమాలు విడుదల కాబోతుండటం విశేషం. అయితే ఇందులో కుర్రాళ్లతో శివాజీ పోటీపడుతున్నాడు.
ఈ క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతున్న సినిమాల్లో శివాజీ ప్రధాన పాత్రలో నటించిన `దండోరా` మూవీ ఉంది. ఇది విలేజ్ డ్రామా నేపథ్యంలో రూపొందింది. సామాజిక అంశాలను చర్చించేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి, రవికృష్ణ, మౌనికా రెడ్డి, రాధ్య, అదితి భావరాజు వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు. మురళీ కాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కాబోతుంది. ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. సినిమాపై కూడా అంచనాలున్నాయి. ఈ క్రమంలో తాజాగా మహిళలకు సంబంధించిన శివాజీ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. అవి ఈ చిత్రానికి ప్రమోషనల్‌గా ఉపయోగపడుతున్నాయని చెప్పొచ్చు.
దీంతోపాటు ఆది సాయికుమార్ నటించిన `శంబాల` మూవీ ఈ నెల 25న విడుదల కాబోతుంది. షైనింగ్ పిక్చర్స్ పతాకంపై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మించారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఇందులో అర్చన అయ్యర్, స్వసిక, రవి వర్మ, మధునందన్, శివ కార్తీక్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. విడుదలైన ఈ మూవీ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. ప్రభాస్, నాని వంటి వారు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో ఈ చిత్రంపై మంచి బజ్ ఉంది. ఆది సాయికుమార్ బౌన్స్ బ్యాక్ అయ్యే మూవీ అవుతుందని చెప్పొచ్చు.
ఇదే రోజు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన `ఛాంపియన్` మూవీ విడుదల కానుంది. స్వప్న సినిమాస్ నుంచి జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ తో కలిసి ఈ సినిమాని నిర్మిస్తుంది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. రోషన్ సరసన అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంపై కూడా మంచి బజ్ ఉంది. మరి ఆడియెన్స్ ని ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.
ఈ నెల 25న విడుదల కాబోతున్న మరో మూవీ `ఈషా`. హర్రర్ థ్రిల్లర్‌గా దీన్ని రూపొందించారు. ఇందులో `రాజు వెడ్స్ రాంబాయి` ఫేమ్ అఖిల్ రాజు, త్రిగుణ్, హేబా పటేల్, సిరి హనుమంతు ప్రధాన పాత్రలు పోషించారు. హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీవాసు వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాసు విడుదల చేస్తున్నారు. టీజర్, ట్రైలర్స్ ఆకట్టుకోవడంతో ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలున్నాయి.
ఇక క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతున్న మరో మూవీ `పతంగ్`. ప్రీతి పగడాల, ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రణీత్ ప్రత్తిపాటి రూపొందించిన ఈ మూవీలో సింగర్ ఎస్పీ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. డి సురేష్ బాబు సమర్పణలో విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి కలిసి నిర్మించారు. ఈ చిత్రం కూడా ఈ నెల 25నే విడుదల కానుంది. ఈ మూవీకి పెద్దగా బజ్ లేకపోవడం గమనార్హం. కాకపోతే కంటెంట్ ఓరియెంటెడ్ మూవీగా దీన్ని చెప్పొచ్చు. మరి ఈ పోటీలో ఎంత వరకు నిలబడుతుందో చూడాలి.
ఈ నెల 25న విడుదల కాబోతున్న సినిమాల్లో మలయాళ మూవీ `వృషభ` కూడా ఉంది. మోహన్ లాల్ నటించిన చిత్రమిది. ఆయనతోపాటు సమర్జీత్ లంకేష్, నయన్ సారిక కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు నందకిశోర్ రూపొందించిన ఈ మూవీని కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మించారు. ఈ మూవీని తెలుగులో గీతా ఆర్ట్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది.
వీటితోపాటు కన్నడ మూవీ `మార్క్` కూడా తెలుగు రిలీజ్ అవుతుంది. ఇందులో సుదీప్ హీరోగా నటిస్తున్నారు. విజయ్ కార్తికేయా దర్శకత్వం వహించారు. యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ గురువారం క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతుంది.