
టాలీవుడ్‌లో ప్రస్తుతం నాలుగు స్థంభాలుగా నలుగురు హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలను పిలుస్తుంటారు. అయితే ఈ నలుగురి సినిమాలు ఒకేసారి విడుదలైన సందర్భాలు లేవనే చెప్పాలి. కానీ ఇప్పుడు మొదటిసారి ఈ నలుగురు హీరోలు ఒకేసారి రాబోతున్నారు. అది కూడా సంక్రాంతికి రానుండటం విశేషం. టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి ఇలాంటి అరుదైన సందర్భం రాబోతుంది. అందుకు వచ్చే సంక్రాంతి వేది క కాబోతుండటం విశేషం. వచ్చే2027 సంక్రాంతికి చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్ సినిమాలు విడుదలకు ప్లాన్ చేసుకుంటున్నారట.
చిరంజీవి ఈ సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీతో ఆడియెన్స్ ని అలరించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రీజినల్ ఫిల్మ్స్ లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో వెంకటేష్ కీలక పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. దీనితో సంక్రాంతి టేస్ట్ ఏంటో చిరంజీవి చూశారు. దీంతో వచ్చే సంక్రాంతిని కూడా టార్గెట్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం చిరు.. బాబీ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నారు. మార్చిలో ఇది ప్రారంభం కానుంది. ఇందులో మోహన్ లాల్ కనిపిస్తారని టాక్. ప్రియమణి హీరోయిన్‌గా ఫైనల్ అయ్యిందట. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
అదే సంక్రాంతికి వెంకటేష్ మూవీ కూడా కన్ఫమ్ అయ్యింది. వెంకటేష్ ఇప్పుడు త్రివిక్రమ్‌తో `ఆదర్శకుటుంబం` మూవీ చేస్తున్నారు. దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబతున్నారు. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే `ఎఫ్ 2`, `ఎఫ్3`, `సంక్రాంతికి వస్తున్నాం` వంటి చిత్రాలు వచ్చాయి. వీటితోపాటు ఈ సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్ గారు`లోనూ మెరిశారు. అనిల్ రావిపూడి సంక్రాంతి టార్గెట్ గా వచ్చి హిట్ కొడుతున్నారు. సంక్రాంతి పండక్కి ఉన్న సత్తా ఏంటో ఆయన బాగా చూశారు. దీంతో నెక్ట్స్ వెంకటేష్‌తో చేయబోతున్న సినిమాని కూడా సంక్రాంతికే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు.
అలాగే బాలకృష్ణ కూడా సంక్రాంతి బరిలో దిగబోతున్నారు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. గ్యాంగ్ స్టర్ కథతో ఈ సినిమా సాగుతుందట. ఆ మధ్యనే ఈ మూవీని ఓపెనింగ్ చేశారు. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్‌ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాని కూడా సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు. సరిగ్గా మూడేళ్ల క్రితం బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో `వీరసింహారెడ్డి` చేశారు. ఇది సంక్రాంతికే విడుదలయ్యింది. ఇప్పుడు చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన `వాల్తేర్ వీరయ్య` కూడా అదే సంక్రాంతికి వచ్చి హిట్ అయ్యింది. ఇప్పుడు సేమ్ కాంబినేషన్స్ లో మరోసారి ఈ ఇద్దరు పోటీ పడుతుండటం విశేషం.
ఇక సడెన్‌గా ఇప్పుడు సంక్రాంతి బరిలోకి కింగ్ నాగార్జున కూడా వచ్చి చేరారు. ఆయన ఇప్పుడు కార్తీక్ అనే దర్శకుడితో `కింగ్100` చేస్తున్నారు. ఆ తర్వాత `సోగ్గాడే చిన్ని నాయన` ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. `సోగ్గాడే చిన్న నాయన`కి సీక్వెల్‌గా ఇది రాబోతుందని సమాచారం. వచ్చే సంక్రాంతికి జనవరి 15న ఈ మూవీని విడుదల చేయబోతున్నట్టు నాగార్జున ప్రకటించారు. డేట్ మార్క్ చేసుకోండి అంటూ ఆదివారం వెల్లడించడం విశేషం. దీంతో నలుగురు సీనియర్లు వచ్చే సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద పోటీ పడబోతున్నారనేది కన్ఫమ్ అయ్యింది. నలుగురు హీరోల మధ్య పోటీ రసవత్తరంగా ఉండబోతుందని చెప్పొచ్చు. అదే సమయంలో అభిమానులకు అది కనువిందు చేసే పండగగా కూడా ఉండబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా నలుగురు సీనియర్ల సినిమాలు ఒకేసారి విడుదలకావడం కూడా తెలుగు సినిమా చరిత్రలో అరుదైన సందర్భంగా చెప్పొచ్చు. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతి హీటు ఇప్పట్నుంచే పెరిగిపోతుంది.