
హీరో రాజశేఖర్, మెగాస్టార్ చిరంజీవికి ఆ మధ్య గొడవలు అయ్యాయి. చిరుని రాజకీయంగా విభేదించారు రాజశేఖర్. ఆయనపై పలు ఆరోపణలు చేయడంతో గొడవలకు కారణమయ్యింది. ఆ తర్వాత అన్నీ సెట్ అయ్యాయి. ఇప్పుడు అంతా బాగానే ఉన్నారని టాక్. ఆ మధ్య తనకు చిరు హెల్ప్ కూడా చేశారని రాజశేఖరే పలు ఇంటర్వ్యూస్‌లో తెలిపారు. అయితే సినిమాల పరంగా ఒకప్పుడు ఇద్దరి మధ్య పోటీ ఉండేది. ఇద్దరూ యాక్షన్ హీరోలుగా చేసిన నేపథ్యంలో ఇద్దరి మధ్య బాక్సాఫీసు వద్ద పోటీ నడిచింది. అయితే ఆ మధ్య ఓ సారి తాను విలన్ రోల్ చేస్తానంటే చిరంజీవి రిజెక్ట్ చేశారట. అంతేకాదు గతంలోనూ ఆయనతో ఓ మూవీ చేస్తానని ఆసక్తి చూపినా నో చెప్పినట్టు వెల్లడించారు రాజశేఖర్.
రాజశేఖర్ ఇప్పుడు హీరోగానే కాదు బలమైన క్యారెక్టర్స్ చేసేందుకు చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఆయన ఆ మధ్య `ఎక్స్ టార్డినరీ మ్యాన్` చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు. నితిన్ హీరోగా వచ్చిన ఈ మూవీ ఆడలేదు. దీంతో ఆలోచనలో పడ్డారు రాజశేఖర్. ఇప్పుడు మళ్లీ కమ్ బ్యాక్ అవుతున్నారు. అయితే ఈ సారి బలమైన పాత్రలతో బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం `బైకర్` అనే చిత్రంలో నటించారు. శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ఇటీవల విడుదలైంది. బైక్ రేసింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. శర్వానంద్‌కి ఫాదర్ రోల్ అని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు కాదు తొమ్మిదేళ్ల క్రితమే విలన్‌గా చేసేందుకు రెడీ అయ్యారు రాజశేఖర్. కానీ చిరంజీవి వల్లే వెనక్కి తగ్గారట. 2016లో రామ్ చరణ్ హీరోగా `ధృవ` మూవీ వచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ మూవీ తమిళంలో వచ్చిన `తని ఒరువన్`కి రీమేక్. అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్ తెలుగులో నిర్మించారు. ఈ సినిమాలో విలన్‌గా అరవింద స్వామి నటించారు. తమిళంలోనూ ఆయనే విలన్. తెలుగులోనూ ఆయన్నే తీసుకున్నారు. అయితే తెలుగు వెర్షన్ విలన్ పాత్రని చేసేందుకు ఆసక్తి చూపించారు హీరో రాజశేఖర్. చిరంజీవికి తన ఇంట్రెస్ట్ ని వెల్లడించారు.
`తని ఒరువన్`లో అరవింద స్వామి పాత్ర చాలా బలంగా ఉంటుంది. హీరో రేంజ్ రోల్ అని చెప్పొచ్చు. చాలా కూల్‌గా, స్టయిలీష్‌గా ఉంటుంది. ఫోన్‌లోనే విలనిజం చూపిస్తుంటారు. హీరోకి చుక్కలు చూపించే పాత్ర సినిమాలో బాగా హైలైట్ అయ్యింది. ఆ రోల్ నచ్చి తాను చేసేందుకు సిద్దమయ్యాడు రాజశేఖర్. కానీ అందులో హీరోతో లేని విలన్ సింగిల్ సీన్లు చాలా ఉన్నాయి. వాటిని యదాతథంగా తెలుగు రీమేక్‌లో వాడుకోవచ్చని భావించిన చిరు అండ్ టీమ్ రాజశేఖర్‌కి నో చెప్పారట. కొత్తగా రాజశేఖర్‌ని తీసుకుంటే ఆయా సీన్లు అన్నీ మళ్లీ షూట్ చేయాలి. అప్పుడు బడ్జెట్ పెరిగిపోతుంది. ఖర్చు ఎక్కువ అవుతుంది. అదే తమిళ మూవీలోని సీన్లని వాడుకుంటే కలిసి వస్తుందని భావించిన చిరు అండ్ టీమ్, రాజశేఖర్ కి నో చెప్పారట. ఆయనకు కూడా ఈ విషయాన్ని వివరించడంతో అర్థం చేసుకుని తప్పుకున్నారట. ఈ విషయాన్ని రాజశేఖర్ స్వయంగా ఐడ్రీమ్‌కిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఇప్పుడే కాదు, గతంలోనూ ఓ సారి చిరంజీవితో కలిసి నటించేందుకు రాజశేఖర్ ఆసక్తి చూపించారు. `స్నేహం కోసం` సినిమాలో విజయ్ కుమార్ నటించిన పాత్రని రాజశేఖర్ అడిగారు. అది వయసు పరంగా పెద్దగా ఉండే రోల్, ఏజ్‌లో రాజశేఖర్ తనకంటే చిన్నవాడు కావడంతో ఆ పాత్రకి సూట్ కావని చెప్పి రిజెక్ట్ చేశారట చిరు. అలా రెండు సార్లు రాజశేఖర్ ని రిజెక్ట్ చేశారు మెగాస్టార్. ఇదిప్పుడు ఆసక్తికరంగా మారింది.