ఇటీవల మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మనం ఎక్కడి నుంచి వచ్చాం అనే మూలాలు మరచిపోకూడదు. తాను కానీ, రాంచరణ్ కానీ ఈ స్థాయిలో ఉన్నామంటే అందుకు ఆద్యుడు మెగాస్టార్ చిరంజీవి గారే కదా.. నన్ను మీరంతా పవన్ కళ్యాణ్ అని పిలిచినా, ఓజి ఓజి అని అరిచినా అందుకు కారణం చిరంజీవి గారే కదా అని తెలిపారు.
పవన్ చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా అల్లు అర్జున్ కి కౌంటర్ ఇచ్చినట్లు అయింది. ఇటీవల అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య దూరం పెరిగింది అంటూ ప్రచారం జరిగింది. దీనికి కారణం అల్లు అర్జున్ బిహేవియర్ అని కూడా ఫ్యాన్స్ చర్చించుకున్నారు. సంధ్య థియేటర్ వివాదంలో చిక్కుకున్న తర్వాత అల్లు అర్జున్ పై విమర్శలు, సెటైర్లు మరింతగా పెరిగాయి. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ మాట్లాడిన చాలా మాటలు ఆడియన్స్ కి అల్లు అర్జున్ పై కౌంటర్ గానే వినిపించాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం ఉండాలి. ఆ లక్షణం రాంచరణ్ కి ఉంది అని పవన్ ప్రశంసించారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు కూడా అల్లు అర్జున్ కి కౌంటర్ ఇచ్చినట్లు అయింది. చిరంజీవి ఒక ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆప్త గ్లోబల్ బిజినెస్ కాన్ఫెరెన్స్ ఈవెంట్ లో పాల్గొన్న చిరంజీవి అక్కడ అద్భుతంగా ప్రసంగించారు. ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్, రాంచరణ్ ని ఉద్దేశించి కేకలు వేయడం ప్రారంభించారు. వెంటనే చిరంజీవి అవును.. పవన్ కళ్యాణ్, రాంచరణ్ నా అఛీవ్మెంట్స్. వీళ్ళిద్దరూ నేను సాధించిన ఘనతలు అని చెప్పారు. కానీ అల్లు అర్జున్ పేరు మాత్రం రాలేదు. చివరికి నా ఫ్యామిలిలో ఉన్న మిగిలిన బిడ్డలు కూడా నా అఛీవ్మెంట్ అని కవర్ చేశారు. నేను ఇన్నేళ్లల్లో సాధించింది ఏంటని వెనక్కి చూసుకుంటే అది నా ఫ్యామిలీ అని చిరంజీవి గర్వంగా చెప్పుకున్నారు.
నాతో పాటు ఇంతమంది నటులు నా ఫ్యామిలీ నుంచి ఉన్నారంటే అది నాకు గర్వకారణం. ఇది కదా మనం సాధించింది అని అనిపిస్తుంది. ఇటీవల పవన్ కళ్యాణ్ నన్ను కలిసినప్పుడు ఒక మాట అన్నాడు. అన్నయ్య నువ్వు ఒక మాట అనేవాడివి గుర్తుందా, ఏమన్నాను రా అని అడిగా.. భగవంతుడు నటుడిగా అవకాశం ఇచ్చాడు, ఇది నాతోనే ఆగిపోకూడదు.. రాజ్ కపూర్ ఫ్యామిలిలో ఎంత మంది నటులు ఉన్నారో అదే విధంగా ఇక్కడ మెగా ఫ్యామిలీ ఎదగాలి అని అన్నావు. ఇప్పుడు నీ మాటలే నిజమయ్యాయి అన్నయ్య అని కళ్యాణ్ నాకు గుర్తు చేశాడు. నువ్వు మంచి మనసుతో ఏ మాట అన్నా అది జరిగి తీరుతుంది అన్నయ్య అని కళ్యాణ్ చెప్పాడు.
మరికొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చిరంజీవి చేశారు. ఇండస్ట్రీలో ట్యాలెంట్ ఉండాలి. కాదనను. కానీ దానికంటే ముఖ్యంగా క్రమశిక్షణ, ప్రవర్తన ముఖ్యం. కొన్ని సార్లు ట్యాలెంట్ సెకండరీ అవుతుంది. నువ్వు నీ తోటివారితో ఎలా ఉన్నావు, దర్శక నిర్మాతలని ఎంత బాగా చూసుకుంటున్నావు అనేది చాలా ముఖ్యం అని చిరంజీవి అన్నారు.
నన్ను గుర్తించింది ప్రేక్షకులే.. ఇండస్ట్రీ కాదు. రామారావు గారితో సినిమాలు చేసిన దర్శకులు నాతో ఎక్కువ సినిమాలు చేశారు. అది కూడా నా అదృష్టం అని చిరంజీవి తెలిపారు. తన కెరీర్ గురించి చిరంజీవి చేసిన చాలా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.