రాజశేఖర్‌ సినిమాని రీమేక్ చేసి హిట్‌ కొట్టిన చిరంజీవి.. ఆ ఘనత సాధించిన ఫస్ట్ తెలుగు హీరో మెగాస్టారే?

First Published Jul 15, 2024, 6:59 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి, రాజశేఖర్‌కి మధ్య ఏదో మనస్పార్థాలుంటాయనే వార్తలు వస్తుంటాయి. కానీ రాజశేఖర్‌ మూవీని చిరంజీవి రీమేక్‌ చేసి హిట్‌ కొట్టడం విశేషం. 
 

మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్‌లో చాలా రీమేక్‌ సినిమాలున్నాయి. ఆయనకు పెద్ద హిట్లు ఇచ్చిన చిత్రాల్లో రీమేక్‌ లే ఎక్కువ. `ఠాగూర్‌`, `ఖైదీ నెంబర్‌ 150` కూడా రీమేక్‌లే. ఇంకా చెప్పాలంటే చిరంజీవికి కమర్షియల్‌ బ్లాక్‌ బస్టర్స్ తోపాటు మెగాస్టార్‌ ఇమేజ్‌ని తీసుకురావడంలో రీమేక్ చిత్రాల పాత్ర చాలా ఉంది. ఇప్పుడు ఓటీటీలు వచ్చి రీమేక్‌ల హవా తగ్గింది. కానీ ఒకప్పుడు ఏ ఇండస్ట్రీలో అయినా రీమేక్‌ల జోరు సాగింది. తమిళ చిత్రాలు తెలుగులో, తెలుగు మూవీస్‌ తమిళంలో, మలయాళ మూవీస్‌ని తెలుగులో, తెలుగు చిత్రాలు హిందీలోనూ రీమేక్‌ చేసి హిట్లు అందుకున్నారు. హిందీ మూవీస్‌ కూడా తెలుగులో చాలా విరివిగా రీమేక్‌ చేసేవాళ్లు. అలా చిరంజీవి సైతం చాలా సినిమాలు రీమేక్‌ చేశారు. 

ఇదిలా ఉంటే మెగాస్టార్‌, తన తోటి హీరో రాజశేఖర్‌ మూవీని రీమేక్‌ చేయడం ఓ విశేషమైతే, ఆ మూవీతో ఆయన పెద్ద హిట్‌ అందుకోవడం మరో విశేషం. తెలుగులో బ్లాక్‌ బస్టర్‌ అయిన మూవీని హిందీలో రీమేక్‌ చేశారు చిరు. అక్కడ అది పెద్ద కమర్షియల్‌ హిట్‌ని సాధించింది. ఈ మూవీతో చిరుకి హిందీలో మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఆ తర్వాత చిరుకి అక్కడ విజయాలు దక్కలేదు. దీంతో ఆయన బాలీవుడ్‌లో స్టార్‌గా ఎదగలేకపోయాడు. రెండు మూడు సినిమాలతో ఆ ప్రయత్నాలు మానుకుని తెలుగుకే పరిమితమయ్యారు మెగాస్టార్‌. 
 

Latest Videos


మరి చిరంజీవి రీమేక్‌ చేసిన రాజశేఖర్‌ చిత్రం ఏది? అనేది చూస్తే.. రాజశేఖర్‌ ఇప్పుడు డౌన్‌ అయ్యాడు. కానీ పదేళ్ల వరకు ఆయన మంచి ఫామ్‌లో ఉన్నాడు. పదిహేనేళ్ల క్రితం ఆయన స్టార్‌ హీరోగా రాణించారు. చిరంజీవి, బాలయ్య, నాగ్‌, వెంకీలకు దీటుగా సినిమాలు చేసి విజయాలు అందుకున్నారు. అంతేకాదు ఈ హీరోలకు పోటీ ఇచ్చాడు. కొన్ని సందర్భాల్లో వాళ్లని డామినేట్ కూడా చేశాడు. వాళ్లకంటే పెద్ద హిట్‌ చిత్రాలు చేసి స్టార్‌ హీరోగా రాణించారు. 
 

రాజశేఖర్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ మూవీలో `అంకుశం` ఒకటి. యాక్షన్‌ థ్రిల్లర్‌గా వచ్చిన చిత్రమిది. జీవిత హీరోయిన్‌గా, రామిరెడ్డి విలన్‌గా నటించిన ఈ సినిమాకి కోడి రామకృష్ణ దర్శకుడు. 1989లో ఈ మూవీ విడుదలై పెద్ద హిట్‌ అయ్యింది. అప్పట్లో రాజశేఖర్‌ ఫుల్‌ ఫామ్‌లో ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కమర్షియల్‌గా భారీ వసూళ్లని రాబట్టింది.  తెలుగులో ఓ సంచలనంగా నిలిచింది. ఈ సినిమా గురించి ఇండస్ట్రీ కూడా చర్చించుకుందంటే ఏ స్థాయిలో సక్సెస్‌ అయ్యిందో ఊహించుకోవచ్చు. 
 

ఈ సినిమానే చిరంజీవి హిందీలో రీమేక్‌ చేశారు. బాలీవుడ్‌లో `ప్రతిబంధ్‌` పేరుతో రీమేక్‌ చేశారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో చిరంజీవికి జోడీగా జూహీ చావ్లా హీరోయిన్‌గా నటించగా, రామిరెడ్డినే విలన్‌గా చేశాడు. ఈ మూవీ అక్కడ కూడా సేమ్ రిజల్ట్. చిరంజీవి బాలీవుడ్‌లో కొత్త కావడంతో తెలుగు రేంజ్‌లో హిట్‌ కాలేదుగానీ, ఓ కొత్త హీరోకి అది పెద్ద హిట్‌ అనే చెప్పాలి. తొలి సినిమాతోనే బాలీవుడ్‌లో హిట్‌ అందుకున్నాడు చిరంజీవి. ఓ తెలుగు హీరో తొలి సినిమాతోనే బాలీవుడ్లో హిట్‌ కొట్టడం అదే ఫస్ట్ టైమ్‌. ఆ అరుదైన ఘనత చిరుకే దక్కింది.
 

`ప్రతిబంధ్‌` హిట్‌ కావడంతో వెంట వెంటనే బాలీవుడ్‌లో రెండు సినిమాలు చేశాడు. `ఆజ్‌ కా గూండా రాజ్‌`, `ది జెంటిల్ మ్యాన్‌` చిత్రాలు రీమేక్‌ చేశారు. కానీ ఈ రెండు సినిమాలు ఆదరణ పొందలేదు. దీంతో ఇక బాలీవుడ్‌ ప్రయత్నాలు విరమించుకున్నారు. తెలుగుకే పరిమితమయ్యాడు. తెలుగులోనే భారీ కమర్షియల్‌ మూవీస్‌ చేసి హిట్లు అందుకున్నారు. మెగాస్టార్‌గా ఎదిగారు చిరంజీవి. ఇప్పుడు యంగ్‌ హీరోలు ఎంతో మంది సూపర్‌ స్టార్లుగా ఎదిగా రాణిస్తున్నా, వారికి పోటీ ఇస్తున్నాడు. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు చిరు. ప్రస్తుతం ఆయన `విశ్వంభర` సినిమాలో నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష కథానాయిక. సోషియో ఫాంటసీ గా తెరకెక్కుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతుంది. 
 

click me!