మీ మరణం దిగ్భ్రాంతి కలిగించింది, మన్మోహన్ సింగ్ మృతిపై చిరంజీవి భావోద్వేగ సందేశం 

First Published | Dec 27, 2024, 9:03 AM IST

ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుముశారు. ఆయన మృతికి ప్రజలు, ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. చిరంజీవి ఓ భావోద్వేగ సందేశం పంచుకున్నారు. 
 

భార‌త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డిసెంబర్ 26వ తేదీన కన్నుమూశారు. కొన్నాళ్లుగా వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మన్మోహన్ సింగ్ పరిస్థితి విషమించడంతో గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అడ్మిట్ చేశారు. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ శరీరం చికిత్సకు సహకరించలేదు. ఎంత ప్రయత్నం చేసినా ఆయన్ని కాపాడుకోలేకపోయామని, ఆసుపత్రి వర్గాలు బులెటిన్ విడుదల చేశాయి. 

1991 నుండి 1996 వరకు డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత దేశ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నెరవేర్చారు. ఆ కాలంలో ఆర్థిక సంస్కరణలు రూపొందించి, ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించారు. 


డాక్టర్ మ‌న్మోహ‌న్ సింగ్ పొలిటికల్ కెరీర్ పరిశీలిస్తే..  1991లో రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. 1998 నుండి 2004 వరకు ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ అధికారంలోకి వచ్చింది.  డాక్టర్ మన్మోహన్ సింగ్ 22 మే 2004న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2009 మే 22న రెండోసారి గెలిచి ప్రధాని బాధ్యతలు చేపట్టారు. మ‌న్మోహ‌న్ సింగ్, భార్య  గురుశరణ్ కౌర్‌. వీరికి ముగ్గురు కుమార్తెలు సంతానంగా ఉన్నారు.

దేశ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన నిరాడంబర నేత మన్మోహన్ సింగ్ మరణవార్త ప్రజలను విషాదంలో నింపింది. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి మన్మోహన్ సింగ్ మరణంపై స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా భావోద్వేగ సందేశం పంచుకున్నారు. 
 

Chiranjeevi-Manmohan Singh

''భారత దేశంలో పుట్టిన గొప్ప లీడర్, విద్యావేత్త, మృదు స్వభావి మన్మోహన్ సింగ్ గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశ ఆర్థిక మంత్రిగా, 13వ ప్రధానిగా సేవలు అందించిన ఆయన ముందు చూపు, ఆర్థిక సంస్కరణలు దేశాభివృద్ధికి దోహదం చేశాయి.ఆయన విజయాలు చరిత్రలో నిలిచిపోతాయి. ఆయన ప్రభుత్వంలో పార్లమెంట్ మెంబర్ గా, టూరిజం మంత్రిగా బాధ్యతలు నెరవేర్చడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తాను.  

Chiranjeevi

ఆయనను కలిసిన క్షణాలు, ఆయన నుండి నేను పొందిన స్ఫూర్తి, జ్ఞానం ఎప్పటికీ మర్చిపోలేను. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. రెస్ట్ ఇన్ పీస్ మన్మోహన్ జీ, ఓం శాంతి... ''అని చిరంజీవి ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. పీఆర్పీ పార్టీని కాంగ్రెస్ లో  విలీనం చేసిన చిరంజీవి, 2012లో రాజ్య సభకు ఎంపికయ్యారు. అనంతరం టూరిజం మంత్రిగా సెంట్రల్ క్యాబినెట్ లో 2014 వరకు బాధ్యతలు నెరవేర్చారు. 

Latest Videos

click me!