కిచ్చ సుదీప్‌ `మాక్స్` మూవీ రివ్యూ, రేటింగ్‌

First Published | Dec 27, 2024, 7:58 AM IST

కిచ్చ సుదీప్‌ లేటెస్ట్ గా నటించిన మూవీ `మాక్స్`. కన్నడలో దుమ్మురేపుతున్న ఈ మూవీ నేడు తెలుగులో విడుదలైంది. ఇక్కడ ఆకట్టుకుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

`ఈగ` చిత్రంతో తెలుగులో పాపులర్‌ అయిన కిచ్చ సుదీప్‌ మరో సినిమాతో తెలుగు ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. తాజాగా ఆయన `మాక్స్` చిత్రంలో నటించారు. విజయ్‌ కార్తికేయన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీని వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్‌ థాను, సుదీప్‌ నిర్మించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే కన్నడలో(డిసెంబర్‌ 25న) విడుదలైంది. నేడు శుక్రవారం(డిసెంబర్‌ 27న) తెలుగులో విడుదలైంది. కన్నడ నాట పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. మరి ఆ స్థాయిలో తెలుగులో ఆకట్టుకుంటుందా? సుదీప్‌కి తెలుగులో మార్కెట్‌ని పెంచుతుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః 
అర్జున్‌(కిచ్చ సుదీప్‌) రెండు నెలల సస్పెన్షన్‌ తర్వాత ఓ పోలీస్‌ స్టేషన్‌లో బాధ్యతలు తీసుకోవడానికి వస్తుంటాడు. ఆయన వస్తున్నాడని తెలిసి పోలీస్‌ స్టేషన్‌లో పెద్ద హడావుడి అవుతుంది. హెడ్‌ కానిస్టేబుల్‌ రవణ(ఇళవరసు) గతంలో ఆయనతో పనిచేశాడు. ఆయన మూడ్‌ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదని చెబుతుంటాడు. చెప్పినట్టుగానే ఆయన వస్తూ వస్తూనే డ్యూటీ చేస్తాడు. ఇద్దరు కుర్రాళ్లు బాగా తాగి పోలీస్‌చెక్‌ పోస్ట్ ని గుద్దేస్తారు. పైగా లేడీ కానిస్టేబుల్‌ దుస్తులు చింపేస్తారు.

దీంతో వారిని కొట్టి పోలీస్‌ స్టేషన్‌లో పడేస్తాడు అర్జున్‌. వాళ్లు మినిస్టర్స్(ఆడుకాలం నరెన్‌, శరత్‌ లోహితస్వ) కొడుకులు. ఆ మినిస్టర్స్ చాలా డేంజరస్‌. వాళ్ల మనిషి గణేష్‌(సునీల్‌) మరింత క్రూరుడు, కింది వాళ్లు కరుడుగట్టిన విలన్లు. వాళ్లకి ఈ విషయం తెలిస్తే పోలీస్‌ స్టేషన్‌ ఉండదు, పోలీసులు ఉండరని అందులో ఉన్న పోలీసులు ఆందోళన చెందుతుంటారు. ఆ ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు కూడా వెనకాడతాడు. అందుకోసం ఏదో ఒక సాకు చెప్పి స్టేషన్‌ నుంచి వెళ్లిపోతారు. సెల్‌లో ఉన్న ఈ ఇద్దరు ఒకరినొకరు కొట్టుకుని, కాల్చుకుని చనిపోతారు.

పోలీస్‌ స్టేషన్‌లో ఈ ఘటన జరగడంతో ఇది పోలీసులే చేశారని ఆ మంత్రులకు, వారి మనుషులకు తెలిస్తే అందరిని తగలబెట్టేస్తారని భయపడిపోతుంటారు పోలీసులు. దీంతో అర్జున్‌కి ఈ విషయం చెబుతారు. ఆయన రంగంలోకి దిగడంతో కథ వేరే లెవల్‌కి మారుతుంది. మంత్రుల వైపు తిరిగే క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్ రూప(వరలక్ష్మి శరత్‌ కుమార్‌) రంగంలోకి దిగుతుంది.

ఆమె పోలీస్‌ స్టేషన్‌లో ఏం చేసింది? చనిపోయిన మంత్రుల కొడుకులను అర్జున్‌ ఏం చేశాడు? ఇంతకి ఆ కుర్రాళ్లు చేసిన తప్పేంటి? ఈ విషయం మంత్రులకు తెలిసిందా? వారి రియాక్షనేంటి? ఈ ఘటనకు అమ్మాయి అత్యాచారానికి ఉన్న లింకేంటి? అర్జున్‌ వేసిన ఎత్తులేంటి? ఈ క్రమంలో చోటు చేసుకున్న ట్విస్ట్ లు, టర్న్ లేంటి? అనేది మిగిలిన కథ. 
 


విశ్లేషణః 
స్క్రీన్‌ ప్లే బేస్డ్ చిత్రాలు చాలా తక్కువగా వస్తుంటాయి. గ్రిప్పింగ్‌గా తీస్తే, కథనాన్ని పరుగులు పెట్టిస్తే, ఆడియెన్స్ ఎంగేజ్‌ చేస్తే సినిమా హిట్టే. తాజాగా కిచ్చ సుదీప్‌ నటించిన `మాక్స్` సినిమాని అదే పంథాలో రూపొందించారు. రేసీ స్క్రీన్‌ప్లేకి, యాక్షన్‌, థ్రిల్లర్‌ అంశాలను జోడించారు. సినిమాని పరుగులు పెట్టించారు. సినిమా కేవలం ఒక రోజు రాత్రిలోనే జరుగుతుంది. సీఐగా బాధ్యతలు స్వీకరించడానికి హీరో రైలు దిగడం నుంచి గేమ్‌ స్టార్ట్ అవుతుంది.

ఆయన రాత్రి రావడంతో చెక్‌ పోస్ట్ వద్ద పోలీసులు విష్‌ చేస్తారు. అంతలోనే ఇద్దరు కుర్రాళ్లు తాగి చెక్‌ పోస్ట్ ని కారుతో గుద్దేయడంతో వారిని పట్టుకుని స్టేషన్‌లో వేయడంతో అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. వాళ్లని అరెస్ట్ చేయడం తమకు ఎంత ప్రమాదమో పోలీసులు చెప్పడం, పోలీసులంతా వెళ్లిపోవడం, కుర్రాళ్లిద్దరు కాల్చుకుని చనిపోవడంతో ఆ కేసు తమమీదకు రాకుండా తప్పించడం హీరో ప్లాన్. దానికి ఏం చేశాడనేది సినిమా,

దీనికి టీనేజ్‌ అమ్మాయి దారుణంగా అత్యాచారానికి గురి అయిన ఘటనని జోడించిన తీరు బాగుంది. సినిమా ప్రారంభం నుంచి పరుగులు పెట్టిస్తుంది. సాధారణంగా హీరో వస్తున్నాడంటే ఎలివేషన్‌ ఇస్తుంటారు. కానీ ఇందులో హీరో ముందు విలన్ల గురించి ఎలివేషన్‌ ఇవ్వడమే గమనార్హం. ఇదే ఇందులో కొత్త పాయింట్‌. 
 

సెల్‌లో ఆ ఇద్దరు కుర్రాళ్లు చనిపోయిన తర్వాత అర్జున్‌ స్టేషన్‌ కి రావడం, తమ కుర్రాళ్ల కోసం మినిస్టర్‌ మనుషులు రావడం, పెద్ద గొడవ చేయడం, వాళ్లని అర్జున్‌ ఎదుర్కోవడం, రాత్రి అంతా స్టేషన్‌ని వాచ్‌ చేస్తూ వెంటాడటం, వారి దృష్టి మరల్చడం కోసం అర్జున్‌ వేసిన ఎత్తులు ఆద్యంతం రేసీగా ఉంటాయి. ఉత్కంఠభరితంగా ఉంటాయి. సీట్‌ ఎడ్జ్ లో కూర్చొని చూస్తున్న ఫీలింగ్‌ ని తెప్పిస్తాయి.

యాక్షన్ కి థ్రిల్లర్ ని జోడించడంతో ఆ ఉత్కంఠ మరింతగా పెరుగుతుంది. ఫస్టాఫ్‌ వరకు కథనం మామూలుగానే సాగుతుంది. మధ్యలో కొంత బోరింగానూ ఉంటుంది. కానీ సెకండాఫ్‌ నుంచి స్క్రీన్‌ ప్లే పరుగులు పెట్టిస్తుంది. అర్థరాత్రి నిమిషానికి నిమిషం కౌంట్‌ అవుతున్నట్టుగానే ఆడియెన్స్ ఉత్కంఠ పెరుగుతుంది. నెక్ట్స్ ఏం జరగబోతుందనే క్యూరియాసిటీ క్రియేట్‌ అవుతుంది.

దీనికితోడు సుదీప్‌ చేసే యాక్షన్‌ అదిరిపోయేలా ఉంటాయి. ఆయా సీన్లని మరింత రక్తి కట్టేలా, గూస్‌బంమ్స్ తెప్పించేలా బీజీఎం ఇవ్వడం సినిమాకి హైలైట్‌. క్లైమాక్స్ నుంచి సినిమా పీక్‌లో ఉంటుంది. చివరికి ఎమోషనల్‌ టచ్‌ ఇచ్చి ముగించిన తీరు బాగుంది. ఇదే సినిమాకి హైలైట్‌ పాయింట్‌. 
 

సినిమా స్క్రీన్‌ ప్లే ప్రధానంగా సాగడంతో కథకి పెద్దగా స్కోప్‌ లేదు. ఇంకా చెప్పలంటే ఇందులో కథని పెద్దగా ఆశించలేం కూడా. అయితే విలన్‌ గురించి పోలీసులు ఎలివేషన్‌ ఇవ్వడం కొత్తగా ఉన్నా, అది సినిమా చివరి వరకు కంటిన్యూ చేయడం కాస్త ఓవర్‌గా అనిపిస్తుంది. ఆ విలన్లు మరీ గతంలో ఎప్పుడూ, ఏ సినిమాలోనూ చూడనంత క్రూరులుగా చెప్పిన తీరు అంతగా కనెక్ట్ కాలేదు.

ఎందుకంటే విలన్లు చేసిన సంఘటనలు ఏవీ చూపించలేదు. దీంతో ప్రారంభంలో అది కనెక్ట్ కాలేదు. సినిమా కథ కూడా ఎంతసేపు అక్కడక్కడే తిరిగిన ఫీలింగ్‌ కలుగుతుంది. అదే సమయంలో కొన్ని లాజిక్ కి అందని సన్నివేశాలు కూడా ఉంటాయి. క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ పాత్ర, ఆమె సన్నివేశాలు కన్విన్సింగ్‌గా లేవు. ఆమె చేసే హడావుడి పండలేదు. హీరో వేసే ఎత్తుగడల ఉచ్చులో విలన్లు ఈజీగా పడటం కూడా పెద్దగా పేలలేదు.

ఆయా సీన్లల్లో ఏదైనా ఉత్కంఠ అంశం, ట్విస్ట్ లు ఉంటే మరింతగా రక్తికట్టేది. సెకండాఫ్‌ని మాత్రం బాగా డీల్‌ చేశారు. రేసిగా తీసుకెళ్లి ఆ లోటును భర్తీ చేశాడు. సినిమా చూస్తున్నంత సేపు కార్తి నటించిన `ఖైదీ` గుర్తుకు వస్తుంది. దానికి సీక్వెల్‌ గానే అనిపిస్తుంది. ఆ సినిమాని మన ఆడియెన్స్ ఇప్పటికే చూసేయడంతో ఎంతసేపు ఆ సినిమానే గుర్తుకు వస్తుంది. అదొక్కటే ఇందులో మైనస్‌. 
 

నటీనటులుః 
సీఐ అర్జున్‌గా కిచ్చ సుదీప్‌ అదరగొట్టాడు. తనదైన మాస్‌ ఎంట్రీతో, అలాగే మాస్‌ యాక్షన్‌ సీన్లతో, ఎత్తులకు పై ఎత్తులు వేసే సన్నివేశాల్లో ఆయన బాగా చేశాడు. ఇక యాక్షన్‌ సీన్లలో రెచ్చిపోయాడు. తనకు బాగా సెట్‌ అయ్యే పాత్ర కూడా కావడంతో ఈజీగా చేసేశాడు. ఇక రవణగా ఇళవరసు పాత్ర బాగా ఆకట్టుకుంటుంది. ఆయన ఇచ్చిన ట్విస్ట్ బాగుంటుంది. ఎమోషనల్‌గా ఉంటుంది.

విలన్‌గా సునీల్‌ తనదైన స్టయిల్‌లో చేశాడు. మెప్పించాడు. ఇటీవల కాలంలో కమెడియన్‌గా కంటే విలన్‌గానే బాగా కనిపిస్తున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్‌ పాత్రకి పెద్దగా స్కోప్‌ లేదు. తన మార్క్ ని చూపించలేకపోయింది. పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులు అందరు పాత్రలకు ప్రయారిటీ ఉంది. మంత్రులు, ఇతర విలన్లు ఓకే అనిపించారు. 
 

టెక్నీషియన్లుః 
సినిమా టెక్నీకల్‌గా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ విషయంలో శేఖర్‌ చంద్ర తన మార్క్ చూపించారు. సినిమా అంతా రాత్రి నడుస్తుంది. కానీ ఆ రాత్రి సీన్లని కూడా అంత బాగా తీయడం విశేషం. ఎడిటర్‌ ఎస్‌ ఆర్‌ గణేష్‌ బాబు ఎడిటింగ్‌ కూడా బాగుంది. ఇంకా చెప్పాలంటే ఈ మూవీకి ఆయన ఒక హైలైట్‌. మ్యూజిక్‌ సినిమాకి బ్యాక్‌ బోన్‌. హైలైట్‌ కూడా. పాటలకంటే బీజీఎంతో ఇరగదీశారు.

అజనీష్‌ లోక్‌నాథ్‌ ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నారు. ఇప్పుడు `మాక్స్` సినిమాతో తానేంటో ప్రూవ్‌ చేసుకున్నారు. తనదైన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో సినిమాని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లాడు. దర్శకుడు విజయ్‌ కార్తికేయ స్క్రీన్‌ హైలైట్‌. సినిమాలు కొన్ని చోట్ల లాజిక్ లు మిస్‌ అయినా రేసిగా కథనాన్ని నడిపించిన తీరు అదిరిపోయింది.

`ఖైదీ` స్క్రీన్‌ ప్లే ఫార్మాట్‌ని ఫాలో అయినా తన మార్క్ ని చూపించడం విశేషం. క్రైమ్‌ని, యాక్షన్‌, థ్రిల్లర్‌ అంశాలకు ఎమోషనల్‌ సీన్లు కూడా జోడించి తీరు బాగుంది. కథ పెద్దగా లేకపోవడమే కొంత లోటుగా అనిపిస్తుంది. ఇది పక్కన పెడితే మంచి యాక్షన్‌ థ్రిల్లర్ ని అందించాడని చెప్పొచ్చు. 
 

ఫైనల్‌గాః `మాక్స్` పరుగులు పెట్టించే యాక్షన్‌ థ్రిల్లర్‌.

రేటింగ్‌ః 3
 

Latest Videos

click me!