
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసిన మూవీస్ ఉన్నాయి. అదే సమయంలో డిజాస్టర్లు కూడా ఉన్నాయి. కానీ ఓ మూవీ విషయంలో మాత్రం విచిత్రమైన అనుభవం ఎదురైంది.
చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన ఒక సినిమా డిజాస్టర్ రిజల్ట్ ని చవిచూసింది. కానీ ఇది థియేటర్లలో మాత్రం వంద రోజులు ఆడింది. మరి ఆ సినిమా ఏంటి? ఆ కథేంటో చూద్దాం.
చిరంజీవి తన జీవితంలో ఎక్కువ కష్టపడిన మూవీ `అంజి`. ఈ సినిమా కోసం ఆయన సుమారు ఆరేళ్లు టైమ్ కేటాయించారు. షూటింగ్ కోసం ఎంతో కష్టపడ్డాడు. కొన్నేళ్లపాటు ఒకే డ్రెస్ వేసుకుని షూటింగ్‌లో పాల్గొన్నారు. సుమారు రెండేళ్లపాటు చిత్ర క్లైమాక్స్ తీయడానికే పట్టింది.
అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. చిరంజీవి పారితోషికం కూడా తీసుకోలేదు. అడ్వాన్స్ తప్ప, ఆ తర్వాత ఆయన రిలీజ్ వరకు పారితోషికం అడగలేదు, దాన్ని ప్రొడక్షన్ కోసం ఖర్చు చేయాలని తెలిపారు. అంతేకాదు ఐదేళ్లపాటు ఇతర సినిమాల డేట్స్ అడ్జస్ట్ చేసి ఈ చిత్రానికి కేటాయించారు.
`అంజి` సినిమా అప్పట్లోనే భారీ వీఎఫ్ఎక్స్ తో రూపొందిన మూవీ. భారీ బడ్జెట్ మూవీ కూడా. తెలుగు సినిమాలోనే ఇదొక రికార్డుగా చెప్పొచ్చు. దర్శకుడు కోడి రామకృష్ణ విజన్‌కిది ప్రతిబింబం. శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మించారు.
ఈ మూవీని చిరంజీవి కోసమే చేశారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి చిరంజీవితో ఓ మూవీ చేయాలనుకున్నారు. చిరంజీవి మంచి ఫాంటసీ మూవీ చేయాలనే ఆసక్తిని వెల్లడించారు. ఈ విషయాన్ని కోడిరామకృష్ణకి చెప్పారు. కానీ అప్పటికే కమర్షియల్ హీరోగా రాణిస్తున్న, ఆ విభాగంలో పీక్‌లో ఉన్న చిరంజీవికి ఇలాంటి సినిమా సెట్ అవుతుందా? అనే అనుమానం దర్శకుడిలో ఉంది.
చిరంజీవితోనూ ఈ విషయాన్ని పంచుకున్నారు. కానీ మెగాస్టార్ తాను చేస్తానని చెప్పారు. దీంతో ఆయన కోసమే ఈ మూవీని రెడీ చేశారు దర్శకుడు కోడి రామకృష్ణ. అందుకే చిరు కూడా ఎంత కష్టమైనా, ఎన్ని రోజులు లేట్ అయినా ఈ మూవీ కోసం ప్రాణం పెట్టి పనిచేశారు.
వీఎఫ్ఎక్స్ వల్ల ఈ మూవీ షూటింగ్ డిలే అయ్యింది. ఆ గ్రాఫిక్స్ రావడానికి కూడా చాలా టైమ్ పట్టింది. హాలీవుడ్ స్టూడియోస్ ఈ మూవీ కోసం పనిచేశాయి. నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి సైతం దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించారు. చిరంజీవి ఫస్ట్ టైమ్ తమ బ్యానర్‌లో చేస్తున్న మూవీ కావడంతో ఆయన చాలా పర్సనల్‌గా తీసుకున్నారు.
అందుకే ఖర్చు విషయంలోనూ రాజీపడలేదు. సుమారు రూ.25-30కోట్లు పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. అప్పట్లో ఇది హైయ్యెస్ట్ బడ్జెట్ మూవీ. ఇది పూర్తి కావడానికి ఆరేళ్లు పట్టింది. ఎట్టకేలకు 2004 జనవరి 15న ఈ చిత్రాన్ని విడుదల చేశారు.
సంక్రాంతి సీజన్ కావడంతో భారీ సినిమాలున్నాయి. ఓ వైపు బాలయ్య `లక్ష్మీనరసింహ` చిత్రం ఉంది. మరోవైపు ప్రభాస్ `వర్షం` చిత్రం విడుదలైంది. ఆ నెక్ట్స్ డే `అంజి` విడుదలైంది.ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. కానీ మొదటి రోజుతోనే ఆ అంచనాలన్నీ తలక్రిందులయ్యాయి.
మూవీ ఆడియెన్స్ ఆశించిన స్థాయిలో లేదు. దీంతో ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. మూవీ డిజాస్టర్‌గా మారిపోయింది. ముప్పై కోట్లతో నిర్మించిన ఈ చిత్రానికి బిజినెస్ కూడా బాగానే అయ్యింది. బయ్యర్లంతా నష్టపోవాల్సి వచ్చింది.
కానీ ఈ చిత్రానికి వీఎఫ్‌ఎక్స్ లో జాతీయ అవార్డు, రెండు నంది అవార్డులు వరించాయి. దర్శకుడు కోడి రామకృష్ణ మాత్రం దీన్ని తన కెరీర్‌లో బెస్ట్ మూవీగానే చెబుతారు. ఆడియెన్స్ కి నచ్చకపోయినా, టెక్నీకల్‌గా ఇదొక బ్రిలియంట్ ఫిల్మ్ అనేది ఆయన అభిప్రాయం.
డిజాస్టర్ ఫలితాన్ని చవిచూసిన `అంజి` చిత్రం థియేటర్‌లో మాత్రం వంద రోజులు ఆడటం విశేషం. ఇది చిరంజీవి ఫ్యాన్ బేస్‌కి, ఆయన ఇమేజ్‌కి, క్రేజ్‌కి నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ మూవీ నెల్లూరు రామరాజు థియేటర్లో వంద రోజులు ఆడింది. అక్కడ ఇది శతదినోత్సవం జరుపుకుంది.
ఇలా `అంజి` మూవీ ఈ విషయంలో ఒక అరుదైన రికార్డుని సాధించిందని చెప్పొచ్చు. ఇక చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. ఇది కూడా సోషియో ఫాంటసీగా తెరకెక్కుతోంది. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ మూవీ కూడా భారీ వీఎఫ్ఎక్స్ తో రూపొందుతోంది. వాటి కారణంగానే డిలే అవుతుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది. వీఎఫ్‌ఎక్స్ విషయంలో టీమ్ సాటిస్ఫై అయితే గానీ రిలీజ్ డేట్‌ని ప్రకటించే అవకాశం లేదట. మరి ఆ డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.