
టాలీవుడ్‌లో రెండో తరం నటీనటుల్లో చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్‌లో అనేక సినిమాలు వచ్చాయి. మోస్ట్ హిట్ పెయిర్‌గా ఈ జోడీకి ఉంది. ఈ కాంబినేషన్‌లో సుమారు 19 సినిమాలు వచ్చాయి. ఇందులో కొన్ని కీలక పాత్రల్లో విజయశాంతి మెరవగా, మరికొన్ని గెస్ట్ రోల్స్ ఉండటం విశేషం. చివరగా `మెకానిక్ అల్లుడు` చిత్రంలో నటించారు. మళ్లీ కలిసి పనిచేయలేదు.
ఇటీవల `విశ్వంభర`లో విజయశాంతి నటిస్తుందనే వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని తెలుస్తుంది. అయితే విజయశాంతికి సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇందులో చిరంజీవితో పనిచేయడం గురించి విజయశాంతి స్పందించింది. వండర్‌ఫుల్ ఎక్స్ పీరియెన్స్ అని తెలిపింది. ఎన్నో హిట్ మూవీస్ చేసినట్టు తెలిపింది. తమ కాంబినేషన్‌కి మంచి క్రేజ్ ఉండేదని వెల్లడించింది. దీంతోపాటు బాలయ్యతోనూ ఆల్మోస్ట్ సమానంగానే సినిమాలు చేసినట్టు తెలిపింది విజయశాంతి.
అయితే వీరంతా 80బ్యాచ్‌కి చెందిన ఆర్టిస్ట్ లు. వారంతా ప్రతి ఏడాది కలుస్తుంటారు. పార్టీలు చేసుకుంటారు. ప్రతి ఏడాది ఒక స్టార్ ఆతిథ్యమిస్తుంటారు. ఇటీవల రెండు మూడు సార్లు చిరంజీవి ఇంట్లోనే ఈ పార్టీ జరగడం విశేషం. ఇందులో చిరంజీవి, వెంకటేష్, నరేష్, మోహన్‌లాల్, శరత్ కుమార్, ప్రభు, టైగర్ ష్రాఫ్, రమేష్ అరవింద్, భాను చందర్, నాగార్జున, సుమన్ అలాగే రమ్యకృష్ణ, జయసుధ, నదియ, రాధ, శోభన, ఖుష్బూ, సుహాసిని, సుమలత, రాధిక ఇలా అప్పట్లో స్టార్లుగా వెలిగిన వారంతా కనిపిస్తుంటారు. కానీ విజయశాంతి ఇందులో మిస్సింగ్.
ఈ పార్టీలకు సంబంధించిన ప్రశ్న విజయశాంతికి ఎదురయ్యింది. అందరు కనిపిస్తారు. మీరు ఎందుకు కనిపించరు అనే ప్రశ్న అడిగింది యాంకర్. దీనికి లేడీ సూపర్ స్టార్ స్పందిస్తూ, తనని చిరంజీవి ఎప్పుడూ పిలవలేదని చెప్పింది. ఆయా పార్టీలకు తనని పిలవరని వెల్లడించింది విజయశాంతి. అంతేకాదు, ఇలాంటి పార్టీలకు తాను దూరం అని స్పష్టం చేసింది. తాను షూటింగ్, లేదంటే ఇళ్లు, రాజకీయ ఉద్యమాలు, లేదంటే ఇళ్లు, ఇలానే ఉంటుందని, ఇలాంటి పార్టీలకు వెళ్లే రకాన్ని కాదు అని వెల్లడించింది.
చిరంజీవి తనని పిలిచే ప్రయత్నం చేయలేదు, ఒకవేళ పిలిచినా తాను వెళ్లను అని చెప్పింది. ఈ పార్టీలకు తనకు నచ్చవు అని, అందుకే దూరంగా ఉంటానని, ఎప్పుడూ తనని ఆహ్వానించే ప్రయత్నం చేయరు అని వెల్లడించింది. తనకు ఇలాంటివి ఇష్టం ఉండదని చెప్పింది. షూటింగ్‌లు, ఇళ్లు తప్ప తనకు వేరే ప్రపంచం ఉండదని వెల్లడించింది. అందుకే ఆ 80 బ్యాచ్‌లో, ఆ పార్టీల్లో తాను ఉండనని తెలిపింది ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించింది విజయశాంతి.
ఇదిలా ఉంటే విజయశాంతి సినిమాలు మానేసి సుమారు 15ఏళ్లు అవుతుంది. ఆమె రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. అయితే ఇటీవల మాత్రం సైలెంట్‌గా కనిపిస్తుంది. ఎన్నికల సమయంలో హడావుడి కనిపించినా ఆమెకి సీట్లు దక్కలేదు. దీంతో మళ్లీ సైలెంట్ అయ్యింది. ఆ మధ్య సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మహేష్ బాబు హీరోగా నటించిన `సరిలేరు నీకెవ్వరు`లో ముఖ్య పాత్రలో నటించి మెప్పించింది. ఇప్పుడు కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న చిత్రంలోనూ కీలక పాత్రలో విజయశాంతి కనిపించబోతున్నారట.