
పాపులర్ కామెడీ షో `ఎక్స్ ట్రా జబర్దస్త్`ని క్లోజ్ చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. షోని మిస్ అవుతున్న ఫీలింగ్ స్టార్ట్ అయ్యింది. అదే సమయంలో కొంత మందిని తీసేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఇంద్రజ వెళ్లిపోయారు, సిరి వెళ్లిపోతారు. కమెడియన్లని కూడా తీసేస్తారట. ఈ క్రమంలో అసలు జబర్దస్త్ షోలో ఏం జరుగుతుంది. ఏం చేయబోతున్నారు. ఆ స్థానంలో వచ్చే కొత్త షో ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
తెలుగు బుల్లితెర వినోదం రంగంలో అత్యంత వినోదాన్ని పంచే షోలో `జబర్దస్త్` ఉండేది. 2013 నుంచి ఈ షో ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రారంభంలో ఇది ఒక్క షోగానే స్టార్ట్ అయినా, దానికి వస్తోన్న ఆదరణని, కమెడియన్ల పోటీని పరిగణలోకి తీసుకుని మల్లెమాల, ఈటీవీ వారు రెండు షోలుగా విడగొట్టారు. గురువారం జబర్దస్త్, శుక్రవారం ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలుగా రన్ చేశారు. `జబర్దస్త్` కంటే ఎక్స్ ట్రా జబర్దస్త్ లో కాస్త ఎక్కువ కామెడీ ఉండేలా చూసుకున్నారు. బాగా పేలే స్కిట్లని, బాగా కామెడీ చేసే కమెడియన్లని ఎక్స్ ట్రాలో వేశారు.
జబర్దస్త్ షోకి అనసూయ యాంకర్‌గా ఉండగా, ఎక్స్ ట్రా జబర్దస్త్ కి రష్మి గౌతమ్ యాంకర్‌గా ఉన్నారు. ఈరెండు షోలకు నాగబాబు, రోజా జడ్జ్ లుగా వ్యవహరించారు. చమ్మక్ చంద్ర, అదిరే అభి, బలగం వేణు, ఫణి, కిర్రాక్ ఆర్పీ వంటి వారు ప్రారంభంలో బాగా కామెడీ చేశారు.ఆ తర్వాత హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రాంప్రసాద్, గెటప్ శ్రీనులు వచ్చి షోని పీక్‌కి తీసుకెళ్లారు. ఇమ్మాన్యుయెల్, రాకేష్, నూకరాజు, కెవ్వు కార్తీక్, ప్రవీణ్, నరేష్, భాస్కర్‌లు ఆ కామెడీని కొనసాగిస్తున్నారు.
2020 వరకు బాగానే నవ్వులు పూయించింది. ఆ తర్వాత నుంచి షోలో డిస్టర్బ్ స్టార్ట్ అయ్యింది. షో నుంచి జడ్జ్ నాగబాబు వెళ్లిపోయారు. అంతుకు ముందే చాలా మంది కమెడియన్లు సినిమాల్లో బిజీ అయి వెళ్లిపోయారు. నాగబాబు తర్వాత కొన్ని రోజులకు రోజా వెళ్లిపోయారు. వారి స్థానంలో కృష్ణ భగవాన్, ఇంద్రజ, ఆ తర్వాత ఖుష్బూ వచ్చారు. మరోవైపు యాంకర్లు మారారు. రెండేళ్ల క్రితం జబ్దర్దస్త్ షోకి యాంకర్ అనసూయ మానేశారు. ఆమె స్థానంలో సౌమ్యరావు వచ్చారు, కొన్నాళ్ల తర్వాత బిగ్ బాస్ సిరి తీసుకొచ్చారు.
అయితే ఇటీవల కాలంలో కామెడీ అంతగా పండటం లేదు. చాలా చప్పగా సాగుతుంది. చాలా స్కిట్లు పేలడం లేదు. కంటెంట్ లేక ఇతర కమెడియన్లు, యాంకర్లు, జడ్జ్ ల మీద పంచ్‌లు వేయడం, ఒకరిపై ఒకరు కామెంట్లతో కూడిన స్కిట్లు చేయడం చేస్తున్నారు. దీంతో వీటికి టీఆర్‌పీ రేటింగ్ దారుణంగా పడిపోతుంది. ఈ నేపథ్యంలో నష్ట నివారణ చర్యలు చేపట్టింది మల్లెమాల, ఈటీవీ. ఒక షోని తీసేయాలని, ఉన్న వాటిలో బెస్ట్ టీమ్‌తో కామెడీ చేయించాలని ప్లాన్ చేసింది. చాలా రోజులుగా ఈ కసరత్తులు జరుగుతున్నాయి. జూన్ నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు.
ఇటీవల `ఎక్స్ ట్రా జబర్దస్త్`ని తీసేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకు ముందే జడ్జ్ ఇంద్రజకి వీడ్కోలు పలికారు. ఆమె గ్యాప్ తీసుకుంటున్నట్టు ప్రకటించారు. మరి ఇంతకి ఈ షోలను ఏం చేయబోతున్నారనేది చూస్తే.. జబర్దస్త్ యదావిధిగా రన్ కాబోతుంది. జస్ట్ ఎక్స్ ట్రా అనే పదాన్నే తొలగిస్తున్నారు. అయితే రెండు రోజులు ఈ షోనే ప్రసారం చేయబోతున్నారు. శుక్రవారం, శనివారం రెండు రోజులు టెలికాస్ట్ కాబోతుంది. ఇప్పటి వరకు గురు, శుక్ర రన్ అయ్యింది. ఇప్పుడు ఒక రోజు జరిగింది. అయితే ఇంద్రజ ఉండరు, అలాగే యాంకర్ సిరిని తీసేస్తున్నారు. మరోవైపు బాగా కామెడీ చేయలేని కమెడియన్లని కూడా తీసేస్తున్నట్టు తెలుస్తుంది. రెండు రోజుల్లో మూడు మూడు స్కిట్లు ప్రదర్శిస్తారట. మిగిలిన గ్యాప్‌లో స్టాండప్ కామెడీ చేయిస్తారని తెలుస్తుంది.
అయితే ఇందులో ఇంద్రజని తొలగించడానికి మరో కారణం ఉంది. ఇంద్రజ జబర్దస్త్ తోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి కూడా జడ్జ్ గా ఉన్నారు. అందులోనూ యాంకర్ రష్మినే. ఈ ఇద్దరు కంటిన్యూగా శుక్ర, శని, ఆదివారంకనిపించాల్సి వస్తుందని చెప్పి, ఇంద్రజని జబర్దస్త్ నుంచి తప్పించారట. ఆమె శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉంటుంది. మరి యాంకర్‌గా రష్మినే ఉంచుతారా? సిరికి ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది.
మరి గురువారం వచ్చే కొత్త షో ఏంటనేది చూస్తే.. ఆ రోజు ఢీ షో ప్రసారం కానుంది. అయితే ఢీని రెండుగా చేస్తున్నారు. రెండు రోజులు ప్రసారం చేయబోతున్నారు. ఇప్పటి వరకు బుధవారం మాత్రమే వస్తుంది.ఇకపై బుధవారం, గురువారం కూడా ఈ షోని ప్రసారం చేస్తారు. ఆ రకంగా దీన్ని విస్తరించబోతున్నారు. అందులో భాగంగా కొత్త జడ్జ్ గా హీరోయిన్ హన్సికని దించిన విషయం తెలిసిందే. డాన్సర్ల నుంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో దీన్ని పెంచినట్టు తెలుస్తుంది. గురువారం సెలబ్రిటీ స్పెషల్‌గా ఈ ఢీ షోని ప్రసారం చేయబోతున్నారు. ఇందులో జడ్జ్ లు, యాంకర్లు మారడం లేదు.
మరోవైపు సోమవారం `ఆలీతో సరదా`గా షోని టెలికాస్ట్ చేయబోతున్నారట ఈటీవీ వాళ్లు. మంగళవారం సుమ అడ్డాని తీసుకొస్తున్నారు. శనివారం రావాల్సిన సుమ అడ్డాని మంగళవారానికి మార్చేశారట. ఇలా కొత్తగా అడ్జెస్ట్ మెంట్ చేశారట.