
మెగాస్టార్ చిరంజీవికి, రాజశేఖర్ కి మధ్య గొడవలున్నాయని అంటుంటారు. అనడమే కాదు, చాలా సార్లు బహిరంగంగా అవి కనిపించాయి. పలు సందర్భాల్లో చిరంజీవిని ఓపెన్‌గానే విమర్శించారు రాజశేఖర్ దంపతులు. రాజకీయంగా విభేదించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై విమర్శలు చేశారు. ఇది కేసులు, కోర్ట్ వరకు వెళ్లింది. ఓ సారి చిరంజీవి అభిమానులు రాజశేఖర్ కారుపై దాడి కూడా చేశారు. అప్పట్లో అది పెద్ద రచ్చ అయ్యింది. కానీ ఇప్పుడు అవన్నీ సర్దుమనిగాయి. చిరు కూడా రాజశేఖర్ విషయంలో పాజిటివ్‌గా ఉన్నారు. ఆయనకు పలు విషయాల్లో హెల్ప్ కూడా చేశారు. అయితే ఈ గొడవలకు ముందు వీరి మధ్య మంచి అనుబంధమే ఉంది. ఇద్దరు కలిసి పార్టీలు చేసుకున్న సందర్భాలున్నాయి. రాజశేఖర్ సినిమా సక్సెస్ పార్టీకి చిరు గెస్ట్ గా హాజరయ్యారు.
రాజశేఖర్ 1980-20లో హీరోగా చాలా పీక్లో ఉన్నారు. ఆ సమయంలో చిరంజీవి, బాలయ్యలకు పోటీ ఇచ్చారు. ఒకానొక దశలో వెంకటేష్, నాగార్జునలను దాటి పోయారు కూడా. ఆ సమయంలో రాజశేఖర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ ఉన్నాయి. వరుసగా యాక్షన్ సినిమాలతో యాంగ్రీ యంగ్ మేన్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. అయితే ఈ ఇమేజ్‌ని బ్రేక్ చేసిన మూవీ `అల్లరి ప్రియుడు`. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇందులో రమ్యకృష్ణ, మధూ హీరోయిన్లుగా నటించారు. 1993లో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రాజశేఖర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు రాజశేఖర్ ఇమేజ్‌ని కూడా మార్చేసింది. ఆయన ఇందులో కామెడీ చేశాడు, రొమాన్స్ చేశాడు. అదిరిపోయే డాన్సులతో హీరోయిన్లతో డ్యూయెట్లు పాడారు. ఇవన్నీ ఆడియెన్స్ కి కొత్తగా అనిపించాయి. దీంతో బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా సక్సెస్‌తో కమర్షియల్ సినిమాల్లో ఉన్న టేస్ట్ ఏంటో రాజశేఖర్‌కి అర్థమయ్యింది.
ఈ మూవీ ప్రారంభంలో పెద్దగా ప్రభావం చూపకపోయినా నెమ్మదిగా పుంజుకుంది. ఏకంగా చాలా సెంటర్లలో రెండు వందల రోజులకుపైగా ప్రదర్శించబడింది. దీంతో రాజశేఖర్, రాఘవేంద్రరావు 200 డేస్ ఫంక్షన్ నిర్వహించారు. అయితే ఈ సెలబ్రేషన్స్ కి చిరంజీవి గెస్ట్ గా రావడం విశేషం. చిరంజీవినే కాదు ఏకంగా టీమిండియా క్రికెట్ జట్టు కూడా పాల్గొంది. కెప్టెన్ కపిల్ దేవ్, అజారుద్దీన్‌తోపాటు ఇతర జట్టు సభ్యులు పాల్గొన్నారు. వారితోపాటు మీనా, రమ్యకృష్ణ, మురళీ మోహన్, ఇలా చాలా మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. `అల్లరి ప్రియుడు` మూవీ సక్సెస్ పార్టీని బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన అరుదైన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. అందరిని ఆకట్టుకుంటుంది. ఇందులో చిరంజీవి, రాజశేఖర్ చాలా జోష్‌తో కనిపించారు. అంతేకాదు ఇది వారి మధ్య ఉన్న అనుబంధాన్ని, స్నేహాన్ని ప్రతిబింబించింది. అయితే ఇందులో చిరు బీర్ బాటిల్ క్యాప్ తీస్తూ జోష్‌లో కనిపించడం విశేషం.
అప్పట్లో చిరంజీవి, రాజశేఖర్ మధ్య ఈ అనుబంధానికి కారణం `అంకుశం` మూవీ అనిచెప్పొచ్చు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ మూవీ 1989లో విడుదలై, బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇందులో ఆవేశంతో కూడిన రాజశేఖర్ పాత్ర ఎంతగానో ఆకట్టుకుంది. విలన్‌గా నటించిన రామిరెడ్డితో వచ్చే యాక్షన్ సీన్లు ఆద్యంతం కట్టిపడేశాయి. జీవిత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా అప్పట్లో టాలీవుడ్‌ని షేక్ చేసింది. ఈ సినిమాకి ఫిదా అయిన చిరంజీవి హిందీలో `ప్రతిబంధ్` పేరుతో రీమేక్ చేశారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. అక్కడ జూహీ చావ్లా హీరోయిన్‌గా నటించింది. ఇందులో విలన్ రోల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అందుకే రామిరెడ్డినే హిందీలో కూడా తీసుకున్నారు. అల్లు అరవింద్ నిర్మించిన ఈ మూవీ 1990లో విడుదలై అక్కడ దుమ్ములేపింది. చిరంజీవికి మంచి హిట్‌ని అందించింది. హిందీలో ఆయన మార్కెట్‌ని విస్తరింపచేసింది. అలా చిరు, రాజశేఖర్ మధ్య అనుబంధానికి `అంకుశం`భీజం పోసిందని చెప్పొచ్చు.
ఇక ప్రస్తుతం రాజశేఖర్ కమ్ బ్యాక్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన నటించిన సినిమాలు పరాజయం చెందడంతో కొంత గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు భారీ కమ్ బ్యాక్ ఇవ్వబోతున్నారట. విలన్‌గానూ నటించేందుకు రెడీ అయినట్టు సమాచారం. విజయ్ దేవరకొండ మూవీలో రాజశేఖర్ విలన్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. దిల్ రాజు నిర్మించే ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. `రౌడీ జనార్థన్`పేరుతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ ప్రారంభమైంది. ఇందులో కీర్తిసురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే `రబ్బరు పందు` అనే తమిళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారని, ఇందులో రాజశేఖర్ హీరోగా నటించనున్నట్టు టాక్. దీంతోపాటు శర్వానంద్ మూవీలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వీటికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది.
మరోవైపు చిరంజీవి ఇప్పుడు వరుసగా నాలుగు సినిమాల లైనప్‌తో బిజీగా ఉన్నారు. తన సమకాలీకులైన హీరోల్లో ఎవరికీ లేని లైనప్ చిరుకి ఉందని చెప్పొచ్చు. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న `విశ్వంభర` పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న `మన శంకరవరప్రసాద్ గారు` మూవీ సైతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ నుంచి `మీసాల పిల్లా` అంటూ సాగే పాట ఇటీవలే విడుదలై దుమ్ములేపుతోంది. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. వీటితోపాటు శ్రీకాంత్ ఓడెలతో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నారు చిరు. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. అలాగే `స్పిరిట్`లోనూ కనిపిస్తారని టాక్.