మిత్ర మండలి మూవీ రివ్యూ, రేటింగ్‌.. జాతిరత్నాలు లా కడుపుబ్బ నవ్వించిందా?

Published : Oct 16, 2025, 07:32 AM IST

Mithra Mandali Review: దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ వారం విడుదలైన మొదటి సినిమా `మిత్ర మండలి`. కామెడీ ప్రధానంగా రూపొందిన ఈచిత్రం ఆడియెన్స్ ని అలరించిందా? సినిమా ఎలా ఉందంటే? 

PREV
16
మిత్ర మండలి సినిమా రివ్యూ

దర్శకుడు అనుదీప్‌ `జాతిరత్నం` సినిమాతో బడ్డీ కామెడీ చిత్రాల ట్రెండ్‌ ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఆ తరహాలోనే చాలా సినిమాలు వచ్చాయి. వస్తున్నాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే సక్సెస్‌ అయ్యాయి. ఇప్పుడు ఆ కోవలోనే వచ్చిన చిత్రం `మిత్ర మండలి`. అనుదీప్‌ స్నేహితుడు విజయేందర్‌ ఈ చిత్రానికి దర్శకుడు కావడం విశేషం. ప్రియదర్శి, నిహారిక ఎన్‌ఎం జంటగా నటించిన ఈ మూవీలో వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, వీటీవీ గణేష్ ముఖ్య పాత్రలు పోషించారు. బ్రహ్మానందం ఓ మెరుపు మెరిశారు. బీవీ వర్క్స్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్‌ బ్యానర్‌పై కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప్‌, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ చిత్రం నేడు గురువారం(అక్టోబర్‌ 16)న విడుదలైంది. ఈ సినిమాని ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఏఏఏ థియేటర్‌లో వీక్షించాను. మొదట్నుంచి సినిమాకి బజ్‌ ఉండటంతో థియేటర్‌ కళకళలాడింది. మరి సినిమా కూడా అలానే నవ్వులు పూయించేలా ఉందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

26
`మిత్ర మండలి` మూవీ కథ ఏంటంటే?

ఇది పూర్తి బడ్డీ కామెడీ చిత్రం. కథలేని కథ అని సినిమా ప్రారంభంలోనే చెప్పారు. జంగలిపట్నం అనే ఊరులో మిత్ర మండలి బ్యాచ్‌ చైతన్య(ప్రియదర్శి), సాత్విక్‌(విష్ణు ఓయి), అభి(రాగ్‌ మయూర్‌), రాజీవ్‌(ప్రాసద్‌ మెహరా) పెద్ద చిల్లర్‌గాళ్లు. చిల్లర పనులతో గోల గోల చేస్తుంటారు. పక్కనోళ్లని బకరా చేస్తుంటారు. వాళ్లే ఆడుకుంటారు, నవ్వుకుంటారు, కొట్టుకుంటారు. బాగా ఎంజాయ్‌ చేస్తుంటారు. ఇందులో సాత్విక్‌, అభి అందమైన అమ్మాయి స్వేచ్ఛ(నిహారిక ఎన్‌ఎం)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతారు. ఆమెని ఇంప్రెస్ చేయడానికి నానా తంటాలు పడుతుంటారు. ఆమె ప్రేమ కోసం కొట్టుకుంటారు కూడా. అదే సమయంలో ఆ ఊర్లో తుట్టె కులం వాళ్లు తమదే పెద్ద కులమని భావిస్తుంటారు. కులం విషయంలో చావడానికైనా, చంపడానికైనా వెనకాడరు. కుల పెద్ద నారాయణ(వీటీవీ గణేష్‌) కనుసన్నాల్లోనే అక్కడ అంతా నడుస్తుంది. వాళ్లతో గొడవపడటానికి, ఎదురెళ్లడానికి ఎవరూ సాహసించరు. ఈ సారి తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తుంటాడు నారాయణ. అడ్డువచ్చిన వారిని బెదిరిస్తాడు. చివరికి ఎమ్మెల్యే టికెట్‌ సంపాదిస్తాడు. కానీ అదే సమయంలో తన కూతురు స్వేచ్ఛ మిస్‌ అవుతుంది. కూతురు కిడ్నాప్‌ అయ్యిందని పోలీసులకు కంప్లెయింట్‌ చేస్తాడు. ఈ కేసుని స్థానిక ఎస్‌ఐ(వెన్నెల కిశోర్‌) ఇన్వెస్టిగేట్‌ చేస్తుంటాడు. పోలీసులు చేయాలనుకున్న పనులన్నీ వారికంటే ముందే చేస్తూ షాక్‌ ఇస్తుంటాడు ఇంపార్టెంట్ క్యారెక్టర్‌(సత్య). ఆ సమయంలో కార్‌ పోయిందని ఒకడు వస్తాడు. వాడిని విచారించగా, అసలు కథ బయటపడుతుంది. స్వేచ్ఛ లేచిపోయిందా? కిడ్నాప్‌ అయ్యిందనేది ఆయన రివీల్‌ చేస్తాడు. మరి ఇంతకి స్వేచ్ఛ లేచిపోయిందా? కిడ్నాప్‌ అయ్యిందా? ఎవరితో లేచిపోయింది? ఎవరు కిడ్నాప్‌ చేశారు? స్వేచ్ఛ మిస్సింగ్‌కి, మిత్ర మండలి బ్యాచ్‌కి సంబంధమేంటనేది అసలు కథ.

36
`మిత్ర మండలి` మూవీ విశ్లేషణః

`మిత్ర మండలి` కథలేని కథ అని సినిమా ప్రారంభంలోనే క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇందులో కథని ఆశించలేం. కేవలం సందర్భానుసారంగా కామెడీ ఎలా పుట్టింది, మిత్ర మండలి బ్యాచ్‌ చేసే చిల్లర్‌ పనులు ఎలా నవ్వులు పూయించానేదానితో సినిమా అంతా సాగుతుంది. ఇందులో డైలాగ్‌ కామెడీ ఉంది. సందర్భానుసారంగా పుట్టే కామెడీ ఉంది. స్ఫూఫ్‌ కామెడీ ఉంది. ఇవన్నీ మిక్స్ చేసి రూపొందించారు. సినిమా మొత్తం ప్రియదర్శి, విష్ణు, రాగ్‌ మయూర్‌, ప్రసాద్‌ బెహరా పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఈ మిత్ర మండలి కుర్రాళ్లే హీరోయిన్‌ని లేపుకుపోయారని వాళ్ల నాన్న భావించడం, వీళ్లని పట్టుకునేందుకు తుట్టెకులం వాళ్లు అంతా ప్రయత్నించడం, మిత్ర మండలి బ్యాచ్ పారిపోవడం, వాళ్లు వెంటపడటంతో సినిమా అంతా సాగుతుంది. ప్రారంభంలో మిత్ర మండలి బ్యాచ్‌ క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్‌ చేశారు. వీళ్లు ఎంతటి దేర్‌ ధిమాక్‌ గాళ్లో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. నోరు ఎక్కువ, బుర్ర తక్కువగా ఉంటారు. వీళ్లు చేసే పనులు ఫన్నీగా ఉండటంతో ఆయా సీన్ల నుంచి కామెడీని జనరేట్‌ చేసే ప్రయత్నం చేశారు. హీరోయిన్‌ని చూడగానే విష్ణు, రాగ్‌ మయూర్ ప్రేమలో పడటం, ఆమె కోసం కొట్టుకోవడం, ఆమె కోసం భారీ డైలాగులు చెప్పడం ఫన్నీగా ఉంటాయి. మరోవైపు తుట్టెకులం గురించి నారాయణ చేసే పోరాటం, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకోవడం, ఇంతలోనే కూతురు కిడ్నాప్‌ కావడంతో ఆ కిడ్నాప్‌కి, ఈ మిత్రమండలి బ్యాచ్‌కి లింక్‌ చేస్తూ కథని నడిపించారు. మొదటి భాగం మొత్తం కిడ్నాప్‌కి కారణం ఎవరు అనేది చెప్పడం, రెండో భాగంలో ఆ కిడ్నాప్‌ చేసింది వీళ్లే అని, వాళ్లని ఛేజ్‌ చేయడంతో సాగుతుంది. మధ్య మధ్యలో ప్రియదర్శి, విష్ణు, రాగ్‌ మయూర్‌, ప్రసాద్‌ బెహరా మధ్య వచ్చే గొడవలు, వారి స్నేహాన్ని చూపించారు. సరదాగా సినిమాని తీసుకెళ్లారు. చివర్లో కులానికి సంబంధించిన సెటైర్లు వేస్తూ ఫన్నీగా ముగించారు.

46
`మిత్ర మండలి`లో హైలైట్స్, మైనస్‌లు

సినిమా మొత్తం ఫన్నీ వేలో సాగుతుంది. లాజిక్‌లు ఉండవు, ఓన్లీ మ్యాజిక్‌ అన్నట్టుగా ఈ మూవీని నడిపించారు. కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్‌ అయ్యింది. మిత్ర మండలి బ్యాచ్‌ కొట్టుకోవడం, పార్టీ చేసుకునే విషయంలో వీళ్లు వ్యవహరించే తీరు, స్నేహం కోసం వీళ్లు చేసే పనులు నవ్వించేలా ఉంటాయి. తుట్టెకులం పేరుతో క్యాస్ట్ పై సెటైర్ బాగుంది. దీంతోపాటు పోలీస్‌ స్టేషన్‌ ఎపిసోడ్‌లో వెన్నెల కిశోర్‌, సత్యల సీన్లు కొంత వరకు నవ్వులు పూయిస్తాయి. తుట్టెకులం బ్యాచ్‌ చేసే తెలివితక్కువ పనులు నవ్వించేలా ఉంటాయి. అయితే సందర్భానుసారంగా జనరేట్‌ అయ్యే కామెడీని నమ్ముకుని ఈ మూవీని తీసినట్టుగా ఉంది. కానీ ఆ కామెడీ ఆశించిన స్థాయిలో వర్కౌట్‌ కాలేదు. గోల ఎక్కువ నవ్వులు తక్కువ అనేలా ఉంది. బాగా అరవడం, చిల్లర్‌గా వ్యవహరించడం వంటి సీన్లు కామెడీని దాటి చిరాకు తెప్పిస్తాయి. పోలీస్‌ స్టేషన్‌లో సత్య, వెన్నెల కిశోర్‌, వీటీవీ గణేష్‌ సీన్లు సైతం అలానే ఉంటాయి. సినిమా ప్రారంభంలోనే ఇది బలవంతపు కామెడీ అనేది అర్థమవుతుంది. రాను రాను దాని తీవ్రత పెరుగుతుంది. ఏ పాత్ర ఎందుకు వస్తుందో తెలియదు. ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌ అంటూ సత్యని బాగా రుద్దారు. కానీ ఆయన పాత్ర ఆశించిన స్థాయిలో నవ్వించలేకపోయింది. నిహారిక సీన్లు కూడా అలానే అనిపిస్తాయి. లవ్‌ ట్రాక్‌ ఏమాత్రం కనెక్టింగ్‌గా లేదు. స్ఫూఫ్‌ కామెడీ, ట్రెండీ డైలాగ్‌లు ఏవీ నవ్వించే విషయంలో సక్సెస్‌ కాలేకపోయాయి. ఇందులో ఎవరు ఏం చేసినా ఓవర్‌గానే అనిపిస్తుంది. ఎక్కడా సహజంగా అనిపించదు, అదే పెద్ద మైనస్‌. కామెడీ అనేది సందర్భానుసారంగా జనరేట్‌ అవ్వాలి. కానీ బలవంతంగా చొప్పించకూడదు. ఇందులో ఆ లైన్‌ దాటినట్టుగా ఉంది. (సినిమాని చూసిన తోటి జర్నలిస్ట్ లు, ఫ్యామిలీ ఆడియెన్స్ సైతం ఈ మూవీ విషయంలో కాస్త పెదవి విరిచినట్టుగా కనిపించారు. కొందరు టైమ్‌ పాస్‌ మూవీ అంటున్నారు)

56
`మిత్ర మండలి` నటీనటుల పర్ఫెర్మెన్స్

చైతన్య పాత్రలో ప్రియదర్శి తన స్టయిల్‌లో చేసుకుంటూ వెళ్లాడు. నవ్వించే ప్రయత్నం చేశాడు. అలాగే సాత్విక్‌ పాత్రలో విష్ణు అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశాడు. రాగ్‌ మయూర్‌ పాత్ర సైతం అంతే. ప్రసాద్‌ బెహరా నుంచి చాలా ఫన్‌ ఆశిస్తారు. కానీ ఇందులో వర్కౌట్‌ కాలేదు. నటులు బాగానే చేసినా, వీరి నుంచి సహజమైన కామెడీని తీసుకోవడంలో దర్శకుడు సక్సెస్‌ కాలేదు. ఇక ఎస్‌ఐగా వెన్నెల కిశోర్‌, ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌ అంటూ సత్య రెచ్చిపోయి చేశారు. తుట్టెకులం పెద్దగా వీటీవీ గణేష్‌ ఫన్‌ తేలిపోయింది. బ్రహ్మానందం పాటలోనే మెరిశారు. అనుదీప్‌ ఓ సీన్‌లో కనిపించాడు. ఆకట్టుకున్నాడు. మిగిలిన ఆర్టిస్ట్ లు జస్ట్ ఓకే అనిపించారు.

66
`మిత్ర మండలి` టెక్నీషియన్ల పనితీరు

ఆర్‌ఆర్‌ ధ్రువన్‌ సంగీతం పాటల వరకు ఫర్వాలేదు. కానీ ఆర్‌ఆర్‌ విషయంలో చిరాకు తెప్పించారు. సిద్ధార్థ్‌ కెమెరా వర్క్ బాగానే ఉంది. పీకే ఎడిటింగ్‌ ఇంకాస్త కత్తెరకు పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు ఓకే. దర్శకుడు విజయేందర్‌ తొలి ప్రయత్నంగా చేసిన మూవీ ఇది. అనుదీప్‌ బ్యాచ్ నుంచి వచ్చిన దర్శకుడు ఇంతటి కథ లేకుండా సినిమా తీస్తారని ఊహించలేదు. సినిమాపై ఆడియెన్స్ లో అంచనాలున్నాయి. కానీ వాటిని దర్శకుడు అందుకోలేకపోయాడు. చాలా డిజప్పాయింట్‌ చేశాడు. కామెడీని జనరేట్‌ చేయడంలో ఆయన సక్సెస్‌ కాలేకపోయారు. పాత్రల మధ్య కాన్ల్ఫిక్ట్ క్రియేట్‌ చేసి కామెడీ పుట్టించే ప్రయత్నం బాగున్నా, అది తెరపై వర్కౌట్‌ కాలేదు. ఆ కామెడీ పండలేదు. మధ్య మధ్యలో అక్కడక్కడ రియల్‌గానే నవ్వు వచ్చినా, అది ఆడియెన్స్ ని సాటిస్ఫై చేయదు. కామెడీ విషయంలో ఇంకా బాగా రాసుకుని, ఇంకా బాగా తీయాల్సింది.

ఫైనల్‌గాః `మిత్ర మండలి` నవ్వులు తక్కువ గోల ఎక్కువ.

రేటింగ్‌ః 2.25

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories