మెగాస్టార్ చిరంజీవికి తమ్ముళ్లంటే ప్రాణం. అంతేకాదు కుటుంబానికి పెద్ద. వారి ఫ్యామిలీలో ఆయనే పెద్ద కొడుకు కావడంతో అందరికి సంబంధించిన బాగోగులు చిరంజీవినే చూసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు పెద్దవాళ్లు అయి ఎవరి లైఫ్‌లో వాళ్లు సెట్ అయ్యారు. కానీ చిన్నప్పుడు, వాళ్లు ఎదుగుతున్న సమయంలో మాత్రం చిరంజీవినే కేర్ టేకర్.
అయితే చిరంజీవి టీనేజ్‌లో చేసిన పని నాగబాబు ప్రాణాల మీదకు వచ్చింది. కొద్దిగా అయితే ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. మరి చిరంజీవి ఏం చేశాడు? నాగబాబుకి ఏమైంది అనేది చూస్తే.. అది నిక్కర్లు వేసుకునే ఏజ్. కుర్రాళ్లంతా కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. కొలను లాంటివి కనిపిస్తే ఈత కొడుతుంటారు. అదే సమయంలో అమ్మాయిలంటే క్రష్ కూడా ఉంటుంది.
చిరంజీవి కూడా అదే ఏజ్‌లో ఉన్నాడు. అదే పరిస్థితుల్లో ఉన్నాడు. తమ్ముడు నాగబాబుతోపాటు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి కాల్వలో ఈత కొట్టడానికి వెళ్లారు. నిక్కరు వేసుకుని ఉన్నాడు చిరు. పైన షర్ట్ లేదు. ఈత కొడుతుండగా, అటు వైపు అమ్మాయిలు వచ్చారు. రేగిపళ్లు తెంపుకుంటున్నారు. వాళ్లని చూసి మనసులో తెలియని ఫీలింగ్. వాళ్లని చూస్తూ ఉండిపోయాడు చిరు. అమ్మాయిల మోజులో పడి తమ్ముడు నాగబాబుని మర్చిపోయాడు.
నాగబాబు ఈతకొట్టే క్రమంలో జారి నీళ్లల్లో పడ్డాడు. ఈత సరిగా రాక మునుగూ తేలుతున్నాడు. అమ్మాయిలను చూసే మూడ్‌లో ఉన్న చిరు లేట్‌గా నాగబాబుని గమనించాడు. అప్పటికే ఆయన నీళ్లలో మునిగిపోతున్నాడు. వామ్మో అని దెబ్బకి దూకి తమ్ముడిని బయటకు తీసుకొచ్చి, పొట్ట గట్టిగా నొక్కగా, మొత్తానికి బతికిపోయాడు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అప్పట్నుంచి అమ్మాయిలను చూడాలంటే చిరంజీవికి భయం అట. ఎవరైనా ఎదురుపడితే తలదించుకునే వెళ్లేవాడట. అలా చాలా రోజులు చేసినట్టు చెప్పాడు చిరు.
ఈ సందర్భంగా కాలేజ్ డేట్ క్రష్ గురించి చెబుతూ, కాలేజ్ రోజుల్లో బస్సుల్లో ఎక్కినప్పుడు అమ్మాయిలు వస్తే లేచి వాళ్లకి సీటు ఇచ్చేవాళ్లట. అయితే వాళ్లమీద గౌరవంతోనే, లేక తాను జెంటిల్‌మేన్ అని నిరూపించుకోవడం కోసమో కాదు, అలా అయితే తన వంక చూస్తారని, తనకు పడతారని భావించేవాడట. కానీ అలా ఎవరూ పడలేదని చెప్పారు చిరు. ఫైనల్‌గా సురేఖ పడిందని చెప్పి నవ్వులు పూయించారు. సింగర్ స్మితకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను చిరంజీవి పంచుకున్నాడు.
చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీగా దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్నాడు. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. వచ్చేసంక్రాంతికి ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.