
పెళ్లి... వేరువేరుగా సాగుతున్ప రెండు జీవితాలను ఒకటిచేస్తుంది. విడాకులు... ఒక్కటిగా సాగుతున్న రెండు జీవితాలను వేరువేరు చేస్తుంది. పెళ్లి ఎంత ఆనందకరమో... విడాకులు అంత బాధాకరం. తమ జీవితంలో విడాకులు అనే పదమే వినబడకూడదని ప్రతిఒక్కరు కోరుకుంటారు. కానీ విధి ఆడే ఆటలో కొందరికి ఆ పరిస్థితి ఎదురవుతుంది. ఇలా ఈ ఏడాది పలువురు సెలబ్రిటీ జంటలు పెళ్లిబంధంతో ఒక్కటవగా... మరికొన్ని జంటలు విడాకులతో దూరమయ్యారు. ఇలా 2024 లో విడాకులు తీసుకుని దూరమైన సెలబ్రిటీ జంటల గురించి తెలుసుకుందాం.
హార్దిక్ పాండ్యా-నటాషా :
టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రొఫెషనల్ గానే కాదు వ్యక్తిగత జీవితంలోనూ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా విఫలమైన అతడు తీవ్ర ట్రోలింగ్ కు గురయ్యాడు. అయితే ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శనతో మళ్లీ అతడి ప్రొఫెషనల్ లైఫ్ హ్యాపీగా మారింది.
అయితే హార్దిక్ వ్యక్తిగత జీవితంలో మాత్రం గడ్డు పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత కొంతకాలంగా హార్దిక్ భార్య నటాషాకు దూరమైనట్లు ప్రచారం జరుగుతోంది. కానీ తాజాగా వీరిద్దరి విడాకులపై క్లారిటీ వచ్చింది. ఇక తాము కలిసి జీవించడం లేదని...విడాకులు తీసుకోనున్నట్లు హార్దిక్, నటాషా జంట ప్రకటించారు. దీంతో నాలుగు సంవత్సరాల వీరి వివాహ బంధానికి తెరపడింది. కుమారుడు అగస్త్య బాధ్యతలను ఇద్దరం చూసుకుంటామని హార్దిక్, నటాషా తెలిపారు.
సానియా మీర్జా - షోయబ్ మాలిక్ :
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ జంట కూడా విడిపోయారు. సానియాకు దూరమైన షోయబ్ పాకిస్థాని నటి సనా జావేదాను పెళ్లాడాడు. దీంతో రెండేళ్ళుగా సానియా,షోయబ్ విడాకులపై జరుగుతున్న ప్రచార ఈ ఏడాది కన్ఫర్మ్ అయ్యింది. విడాకుల గురించి ప్రత్యక్షంగా ప్రకటన చేయకున్నా పరోక్షంగా జీవితం కఠినంగా మారిందంటూ సానియా సోషల్ మీడియాలో ప్రకటించారు. ప్రస్తుతం కొడుకు ఇజాన్ మీర్జా మాలిక్ సానియా వద్దే వున్నాడు.
అర్జున్ కపూర్ మరియు మలైకా అరోరా:
ఈ ఏడాది తమ బంధానికి బ్రేకప్ చెప్పిన సెలబ్రిటీ జంట అర్జున్ కపూర్, మలైకా అరోరా. తన కంటే వయసులో చాలా పెద్దదైనా సహనటి మలైకాతో ప్రేమాయణం సాగించిన అర్జున్ పెళ్లికాకుండానే రిలేషన్ షిప్ కొనసాగించారు. భార్యాభర్తల్లా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ దూరమైనట్లు తెలుస్తోంది...అయితే తమ బ్రేకప్ గురించి ఇద్దరూ మౌనం పాటిస్తున్నారు.
ఎప్పుడూ జంటగా కనిపించే అర్జున్, మలైకా ఇప్పుడు వేరువేరుగా కనిపిస్తున్నారు. అంతేకాదు ఈ ఏడాది అర్జున్ పుట్టినరోజు వేడుకలకు కూడా మలైకా హాజరుకాలేదు. అనంత్ అంబానీ, రాధిక పెళ్లికి కూడా అర్జున్ ఒంటరిగా హాజరయ్యాడు. అలాగే మలైకా మరో వ్యక్తితో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీటన్నింటిని చూసే వీరిద్దరూ విడిపోయారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇషా డియోల్ - భారత్ తఖ్తానీ:
బాలివుడ్ స్టార్ కపుల్ ధర్మేంద్ర, హేమమాలిని ముద్దుల కూతురు ఇషా డియోల్ కూడా ఈ ఏడాది విడాకులు తీసుకున్నారు. సినీ కుటుంబానికి చెందిన ఇషా పలు సినిమాల్లో నటించారు... అయితే ఆమె సినీ కెరీర్ అంత సక్సెస్ ఫుల్ గా సాగలేదు. దీంతో ప్రముఖ వ్యాపారవేత్త భరత్ తఖ్తానీని 2012 లో వివాహం చేసుకున్నారు. వీరికి రాధ్యా, మిరయా ఇద్దరు సంతానం.
అయితే తాజాగా తమ వివాహ బంధానికి స్వస్తి చెప్పినట్లు ఇషా, భరత్ ప్రకటించారు. పరస్పర అంగీకారంతో ఇద్దరం విడిపోతున్నట్లు ఈ జంట ప్రకటించింది.
ఇషా కొప్పికర్ మరియు టిమ్మీ నారంగ్:
నటి ఈషా కొప్పికర్ మరియు వ్యాపారవేత్త టిమ్మీ నారంగ్ దశాబ్దకాలంగా సాగిన వివాహ బంధాన్ని రద్దు చేసుకున్నారు. తాము విడిపోతున్నట్లు ఈ ఏడాది అరంభంలోనే ఈ జంట ప్రకటించింది. తమ కూతురు రియానా బాధ్యతలను ఇద్దరం పంచుకుంటామని ఇషా,టిమ్మి వెల్లడించారు.