`లెజెండ్` సినిమాలో బాలయ్య చేసిన రిస్క్ గురించి బయటపెట్టారు దర్శకుడు బోయపాటి శ్రీను. అదే సమయంలో బాలయ్యతో నెక్ట్స్ చేయబోయే సినిమాలకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నందమూరి బాలకృష్ణ త్వరలో `అఖండ 2` చిత్రంతో రాబోతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. సంయుక్త ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ నుంచి `జాజికాయ జాజికాయ ` అనే పాటని మంగళవారం విడుదల చేశారు. వైజాగ్‌లోని జగదాంబ థియేటర్లో ఈ ఈవెంట్ జరిగింది. దీనికి బాలయ్య, బోయపాటితోపాటు హీరోయిన్లు, ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పాల్గొన్నారు. ఇందులో బోయపాటి సినిమా విశేషాలను పంచుకున్నారు. ముఖ్యంగా `జాజికాయ` పాట సినిమాలో ఉన్న ఒకే ఒక్క మాస్ సాంగ్ అని తెలిపారు. ఫ్యామిలీ అంతా కలిసి ఉన్నప్పుడు ఓ ఫంక్షన్‌లో భాగంగా వచ్చే సాంగ్ ఇది అని చెప్పారు బోయపాటి. సంయుక్త మొదటిసారి ఇలాంటి మాస్ సాంగ్ చేసిందన్నారు. థమన్ చాలా కేర్ తీసుకొని ఈ పాటకి మ్యూజిక్ కంపోజ్ చేసినట్టు చెప్పారు.
24
బాలయ్యతో నెక్ట్స్ సినిమాపై బోయపాటి కామెంట్
మరోవైపు ఈ పాటలో బాలయ్య డాన్సులు కూడా అదిరిపోతాయని, థియేటర్లలో ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తారని తెలిపారు. బాలయ్యకి ధీటుగా సంయుక్త స్టెప్పులేసిందని, ఈ పాట ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ లాగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. బాలయ్యతో నెక్ట్స్ మూవీ గురించి చెబుతూ, నాకు ఊపిరి ఉన్నంత వరకు, బాలయ్యకి ఓపిక ఉన్నంత వరకు మా కాంబినేషన్‌లో సినిమాలు వస్తూనే ఉంటాయన్నారు బోయపాటి. దీనికి బాలయ్య కూడా ఓకే చెప్పారు. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే `సింహ`, `లెజెండ్`, `అఖండ` చిత్రాలు వచ్చాయి. హ్యాట్రిక్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మరో హ్యాట్రిక్‌కి రెడీ అవుతున్నారు. `అఖండ 2`పై ఇప్పటికే మంచి బజ్ ఉంది. పైగా శివతత్వం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఓ పాత్రలో అఘోరగా కనిపిస్తారు. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కాబోతుంది. పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలోనూ విడుదల కాబోతుంది.
34
లెజెండ్‌లో బాలయ్య చేసిన రిస్క్ బయటపెట్టిన బోయపాటి
ఇదిలా ఉంటే `అఖండ 2` జాజికాయ` సాంగ్ ఈవెంట్‌లో బాలయ్య మాట్లాడుతూ, సినిమా కోసం ఆర్టిస్ట్ ల నుంచి అద్భుతమైన నటనని బోయపాటి రాబట్టుకున్నట్టు తెలిపారు. అయితే ఆయన మాట్లాడుతుండగా, మధ్యలో మైక్ తీసుకున్న బోయపాటి `లెజెండ్` మూవీలోని ఓ సంఘటన పంచుకున్నారు. అందులో గుర్రంపై ఓ సీన్ బాలయ్య రియల్‌గానే చేశాడని, ఎలాంటి డూప్ వాడలేదన్నారు. గుర్రంపై స్వారీ చేస్తూ ఒక గ్లాస్‌ని పగల గొట్టాల్సి ఉంటుంది. అయితే డూప్‌తో చేస్తామంటే ఒప్పుకోలేదు. తానే చేస్తానని ముందుకొచ్చాడని చెప్పారు. సీన్ సహజంగా రావడం కోసం ఆయన అంతటి రిస్క్ తీసుకున్నారని, సెట్‌లో తనపై ఆయనకున్న నమ్మకానికిది నిదర్శనమన్నారు బోయపాటి.
ఇందులో ఇంకా బాలకృష్ణ మాట్లాడుతూ..`సింహాచలం అప్పన్న ఆశీస్సులు తీసుకుని ఇక్కడికి వచ్చాం. మొన్న మన దెబ్బేంటో ముంబైలో హిందీవాళ్లకు చూపించాం. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. అఖండ ఫస్ట్ పార్ట్ మన దగ్గర ఎంత పెద్ద హిట్ అయిందో చూశారు. ఇప్పుడు సీక్వెల్ ‘అఖండ: తాండవం’ పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్ బస్టర్ కాబోతోంది. కోవిడ్ టైమ్‌లోనే అఖండ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సినిమా ఇచ్చిన ధైర్యంతో మిగతా సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఇది కేవలం తెలుగు సినిమా కాదు. మన భారతీయ సనాతన హైందవ ధర్మం శక్తి, పరాక్రమాన్ని చాటిచెప్పే చిత్రం. మన జాతి మూలాలు ఏంటో తెలియజేసే సినిమా. అందుకే అన్ని భాషల్లో సినిమాను ప్రమోట్ చేస్తున్నాం. రేపు కర్ణాటకకు వెళ్లి అక్కడ ప్రమోట్ చేస్తాం. తర్వాత తమిళనాడుకు వెళ్తాం` అని తెలిపారు బాలయ్య.