బాలీవుడ్ కు ఊపిరినిచ్చిన షారుఖ్ సినిమాలు.. రూ.2000 కోట్లు.. నెక్ట్స్ ఆ చిత్రాలే..

First Published | Sep 26, 2023, 6:10 PM IST

ఓకే ఏడాది రెండు భారీ చిత్రాలతో సక్సెస్ అందుకొని బాలీవుడ్ కు ఊపిరినిచ్చారు షారుఖ్ ఖాన్. అలాగే ‘గదర్2’ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. ముందు రాబోయే చిత్రాలపైనా అంచనాలున్నాయి.
 

షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)  బాలీవుడ్ కు  బాద్షా అని మరోసారి రుజువు చేశారు. కొన్నేళ్ల పాటు హిందీ చిత్రాలతో అలరిస్తున్న కింగ్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న షారుఖ్ ఖాన్ ఇప్పటికీ భారీ చిత్రాలతో అదరగొడుతున్నారు. 
 

అయితే, ‘బాహుబలి’ తర్వాత నుంచి బాలీవుడ్ హవా తగ్గుతూ వచ్చిన విషయం తెలిసిందే. సౌత్ నుంచి ఊహించని విధంగా భారీ బ్లాక్ బస్టర్స్ రావడం.. అదే క్రమంలో బాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో కాస్తా ఊపు తగ్గింది. ‘బాహుబలి’, ‘కేజీఎఫ్’, ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’, ‘మేజర్’, ‘కార్తీకేయ 2’ చిత్రాలు ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో తెలిసిందే. 
 


ఇక 2022లో మాత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సౌత్ నుంచి ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్’ భారీ మార్క్ ను దాటాయి. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ అవార్డును కూడా  సాధించి పెట్టింది. బాలీవుడ్ నుంచి మాత్రం ఏ ఒక్క సినిమా సంచలనంగా మారలేకపోయింది. ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న ‘బ్రహ్మస్త్ర’ కూడా రూ.500 కోట్లు దాటలేకపోయింది. గతేడాది హ్యయేస్ట్ వసూళ్లు సాధించిన చిత్రమిదే. ‘గంగూబాయి కథియావాడి’, ‘దృశ్యం2’, వంటి సినిమాలు కాస్తా ప్రేక్షకులను అలరించాయి. 
 

అమీర్ ఖాన్ లాంటి బిగ్ స్టార్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’, అక్షయ్ నటించి ‘రామ్ సేతు’, హృతిక్ రోషన్ నటించిన ‘విక్రమ్ వేద’ కూడా పెద్దగా సెన్సేషన్ గా మారలేకపోయాయి. ఈ ఏడాది కూడా పరిస్థితి అలానే ఉంటే బాలీవుడ్ క్రేజ్ అట్టడుగున పడేది. కానీ షారుఖ్ ఖాన్ రంగంలోకి దిగి బాలీవుడ్ కు ఊపిరినిచ్చారు. 

ఏకంగా ఒకే ఏడాది రెండు రూ.వెయ్యికోట్ల కలెక్షన్ల సినిమాలతో ఇండియా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపారు. 2023లో బాలీవుడ్ బాద్షాగా సత్తా చాటారు. ఈ ఏడాది Pathaan మూవీతో రూ.1,050 కోట్లు కలెక్ట్ చేశారు. యష్ రాజ్ ఫిల్మ్స్  బ్యానర్ పై వచ్చిన చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ప్రేక్షకులనూ మెప్పించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

ఈనెల 7న విడుదలైన Jawanతోనూ సెన్సేషన్ క్రియేట్ చేశారు. రూ.1,011 కోట్ల వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించారు. షారుఖ్ ఖాన్ సొంత బ్యానర్ లో రూపొందించిన ఈ చిత్రానికి తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించారు. ఈ రెండు భారీ సినిమాలతో రూ.2000 కోట్ల కలెక్షన్లు షారుఖ్ ద్వారా బాక్సాఫీస్ కు చేరడం విశేషం. 
 

అలాగే బాలీవుడ్ స్టార్ సన్నీడియోల్ నటించిన Gadar2 కూడా భారీ మార్క్ ను దాటింది. రూ.680 కోట్లకు పైగా బాక్పాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టింది. ‘ది కేరళ స్టోరీ’ కూడా రూ.300 కోట్లకు పైవగా వసూళ్లు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇలా షారుఖ్ ఖాన్ ‘పఠాన్’తో మొదలెట్టిన విజయ పథంలో బాలీవుడ్ చిత్రాలు నడుస్తున్నాయి. పఠాన్, జవాన్, గదర్2 చిత్రాలు మొత్తంగా రూ.2700 కోట్ల వరకు వసూళ్లు సాధించాయి. 

బాలీవుడ్ నుంచి నెక్ట్స్  విడుదల కాబోతున్న ‘యానిమల్’, ‘టైగర్3’ చిత్రాలపైనా భారీ అంచనాలు ఉన్నాయి. Animal చిత్రానికి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం కావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు అదిరిపోతాయని అంటున్నారు. 2023 డిసెంబర్ 1న విడుదల కానుంది. అలాగే సల్మాన్ Tiger3 పైనా భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం దీపావళి కానుకగా రానుంది. ఆ తర్వాత మళ్లీ షారుఖ్ ఖాన్ Dunki చిత్రంతో రానున్నారు.. ఈ ఏడాది షారుఖ్ ఖాన్ ఇలా ముందుండి బాలీవుడ్ బాద్షా అనిపించారు. 

Latest Videos

click me!