పవన్ కళ్యాణ్-రానా(Pawan Kalyan- Rana) కలిసి నటిస్తున్న చిత్రం `భీమ్లా నాయక్`(Bheemla Nayak). ఉత్కంఠ పోటీ నడుమ ఈ సినిమా సంక్రాంతికి జనవరి 12న విడుదల కానుందని చిత్ర బృందం చెబుతోంది. సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయని, సంక్రాతి పోటీ నుంచి తప్పుకుంటుందని సోషల్ మీడియాలో వార్తలొస్తున్న నేపథ్యంలో తగ్గేదెలే అని సంక్రాంతికి రావడం పక్కా అని యూనిట్ పదే పదే రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేస్తూ వస్తోంది. `ఆర్‌ఆర్‌ఆర్`(RRR Movie), `రాధేశ్యామ్`(Radheshyam)లతో పోటీ పడబోతుందని స్పష్టం చేస్తున్నారు.
అయితే `భీమ్లా నాయక్`ని వాయిదా వేసుకునేందుకు ఇప్పటికే `ఆర్‌ఆర్‌ఆర్` మేకర్స్ పవన్ సినిమా నిర్మాతలో చర్చలు జరిపారని, అందుకు వాళ్లు ఒప్పుకోలేదని, సంక్రాంతి బెస్ట్ సీజన్ అని, దాన్ని మిస్ చేసుకోకూడదని నిర్ణయించుకున్నారట. అదే సమయంలో విడిగా వస్తే ఏపీ ప్రభుత్వం `భీమ్లా నాయక్` సినిమాని ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని, దీంతో సంక్రాంతి ఊపులోనే దాన్ని రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అయితే తాజా సమాచారం మేరకు రాజమౌళినే రంగంలోకి దిగబోతున్నారట. డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్‌తోనే ఈ విషయం చర్చించి ఆయన్ని రిక్వెస్ట్ చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో `భీమ్లా నాయక్` సినిమాకి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. సినిమా రీషూట్ జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. త్రివిక్రమ్ పర్యవేక్షణలోనే సినిమా షూటింగ్ జరుగుతూ వచ్చింది. కానీ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యాక చూసుకున్నప్పుడు క్లైమాక్స్ పార్ట్ విషయంలో మేకర్స్ సంతృప్తి చెందలేదట. దీంతో ఆ పార్ట్ ని మళ్లీ రీషూట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
అయితే ఇప్పుడు ఏకంగా త్రివిక్రమే రంగంలోకి దిగారట. ఆయా క్లైమాక్స్ పార్ట్ ని మాటల మాంత్రికుడే డైరెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్త మాత్రం ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్‌లో, సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వార్తతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ షాక్‌కి గురవుతున్నారట. ఇప్పటికే వరకు విడుదలైన గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. సినిమా నెక్ట్స్ లెవల్‌లో ఉండబోతుందనేలా అవి అంచనాలను పెంచాయి. పవన్, రానాల మధ్య వచ్చే ఎపిసోడ్స్ గూస్‌బంమ్స్ తెప్పిస్తాయని అంటున్న నేపథ్యంలో ఇప్పుడీ వార్త అభిమానులను ఆందోళనకి గురి చేస్తుంది.
ఇదిలా ఉంటే `భీమ్లా నాయక్` చిత్రానికి ఏపీ ప్రభుత్వం నుంచి ఎట్టిపరిస్థితుల్లో తిప్పలు తప్పవనే చర్చ కూడా మొదలైంది. సీఎం జగన్ ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్‌కి పడటం లేదు. రాజకీయ పరమైన విభేధాల కారణంగా ఆ ప్రభావం ఇప్పుడు `భీమ్లా నాయక్` సినిమాపై పడేలా ఉందని అంటున్నారు. పైగా `రిపబ్లిక్` సినిమా ఈవెంట్‌లోనూ పవన్.. ఏపీ సీఎం జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇవన్నీ ఆయన సినిమాలపై ప్రభావం చూపుతాయని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరగబోతుందనేది వేచి చూడాలి.
మలయాళంలో విజయం సాధించిన `అయ్యప్పనుమ్ కోషియుమ్` చిత్రానికి రీమేక్‌గా `భీమ్లా నాయక్` రూపొందుతుంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.