బాలకృష్ణ ఎప్పుడూ తన భార్య ప్రస్తావన తీసుకురారు. మొదటిసారి ఆయన తన భార్యచెప్పిన మాట బయటపెట్టారు. తాను ఆమె ఒక్కదానితోనే ఉండిపోయినందుకు ఆమె సంతోషంగా ఫీలవుతున్నట్టు తెలిపారు.
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం `అఖండ 2`లో నటించారు. బోయపాటి శ్రీను రూపొందించిన ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో బాలయ్య మాట్లాడుతూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనతో తన భార్య వసుంధర దేవి చెప్పిన మాటలను వెల్లడించారు. తాను పాదరసం లాంటి వాడిని అని, ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తానని తెలిపారు. `ఓ వైపు నటుడిగా, మరోవైపు హిందూపురం ఎమ్మెల్యేగా, ఇంకోవైపు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి చైర్మెన్‌గా ఉంటున్నాను. ఒక్కదగ్గర ఉండను. కానీ ఒక విషయంలో మాత్రం ఒకే దగ్గర లాక్ అయిపోయాను. అదే నా భార్య విషయంలో. నా భార్య ఎప్పుడూ అంటుంది. హమ్మయ్య నన్ను ఈ విషయంలో మోసం చేయలేదు. నన్నే అంటిపెట్టుకుని ఉన్నారని అంటుంది` అని చెప్పి నవ్వులు చిందించారు బాలయ్య. ఇది విని వెనకాల బోయపాటి కూడా నవ్వడం విశేషం.
24
ధర్మాన్ని కాపాడేదే అఘోరాలు, స్వామిజీలు
`అఖండ ` సినిమా గురించి చెబుతూ, ఈ సినిమాలో సనాతన ధర్మం గురించి గొప్పగా చూపించాం. ఈ విషయాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా అభినందించారు. దేశాన్ని కాపాడటానికి సైనికులు ఎలా అయితే ఉంటారో, సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఈ అఘోరాలు, స్వామిజీలు ఉంటారని చెప్పేదే ఈ సినిమా. బోయపాటి ఈ విషయాన్ని సినిమాలో అద్భుతంగా చూపించారు. బాలయ్య సినిమా అంటే ఉగాది పంచడి లాంటిది. ఇందులో అన్ని రుచులుంటాయి. అదే సమయంలో మంచి పాట కూడా ఉంది. సంయుక్తతో ఉండే పాట ఐటెం సాంగ్ కాదు, అది ప్రత్యేక పరిస్థితుల్లో వస్తుంది. చాలా బాగా ఉంటుంది` అని చెప్పారు బాలయ్య.
34
ఇండస్ట్రీకి బాలయ్య సూచన
ఇందులో అభిమానులపై ప్రశంసలు కురిపించారు బాలయ్య. `నేను విజయానికి పొంగిపోలేదు, అపజయానికి కుంగిపోను. అభిమానులు నా విజయంలో నాతో ఉన్నారు. నా విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. అదే సమయంలో పరాజయాల్లోనూ నా వెంటే ఉన్నారు. అదీ నా అభిమానులంటే` అని చెప్పారు. ఈ సందర్భంగా సినిమాలు వేగంగా తీయాలని ఇండస్ట్రీకి సూచించారు. నేను, బోయపాటి కలిస్తే మూడే నిమిషాలు మాట్లాడుకుంటాం. అంతే సినిమా చేస్తాం, పెద్దగా చర్చలు ఉండవు. చెప్పిన టైమ్‌లో సినిమాని కంప్లీట్ చేస్తాం. సినిమా ఇండస్ట్రీ కూడా దీన్ని ఫాలో అవ్వాలి. వేగంగా సినిమాలు పూర్తి చేస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. మనిషికి ఇప్పుడు నిత్యావసరాల్లో సినిమా కూడా భాగమయ్యింది. అంతగా ఆడియెన్స్ సినిమాని ప్రేమిస్తున్నారు, అలాంటి సినిమా ఎలా ఉండాలనేది ఇండస్ట్రీ ఆలోచించాలి` అని తెలిపారు. ఈ విషయంలో డెడికేషన్ చాలా ముఖ్యమని చెప్పారు బాలయ్య.
ఈ సందర్భంగా తాను చేయబోతున్న `ఎన్బీకే111`లోని డైలాగ్‌ని లీక్ చేశారు. `చరిత్రలో చాలామంది ఉంటారు. చరిత్రని మరలా మరలా తిరిగి రాసి సృష్టించేవాడు ఒకడే ఉంటాడు. నేనే ఈ చరిత్ర, నాదే ఆ చరిత్ర` అని చెబుతూ అభిమానులను ఉర్రూతలూగించారు బాలయ్య. `మహా శివుడు శక్తి, ఆదిశక్తి సాక్షిగా గంగమ్మ తల్లి ఆశీర్వాదంతో చెబుతున్నాను. ఈ రుద్ర తాండవ విన్యాసం నాలో ఆవేశమై, ఆ త్రినేత్రుడి వీక్షణ దృష్టి నాలో నిక్షిప్తమై, ఆయన త్రిశూలం నా ఆయుధానికి శక్తి శూలమై.. ఎలా ఉండబోతుందో నా పాత్ర మీరు తెరపై చూస్తారు` అని చెప్పారు బాలయ్య. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.