
యాక్షన్ హీరో అర్జున్ తాజాగా `సీతా పయణం` అనే చిత్రంతో రాబోతున్నారు. ఇందులో ఆయన నటించడంతోపాటు దర్శకత్వం వహించారు. తన కూతురు ఐశ్వర్య ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. ఈ మూవీ ఈ నెల 14న విడుదల కాబోతుంది. చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను చాలా మంది చేత మోసం పోయినట్టు తెలిపారు. చుట్టూ ఉన్నవారే మోసం చేశారట. అలాగే శోభన్ బాబు చెప్పిన మాట వినలేదట. ఆ సంగతులేంటనేది చూస్తే.
కన్నడ నటుడు అయిన అర్జున్ కన్నడతోపాటు తెలుగులోనూ స్టార్ హీరోగా ఎదిగారు. తెలుగు హీరోగా గుర్తిండిపోయారు. ఎక్కువగా యాక్షన్ ప్రధాన చిత్రాలు చేసి యాక్షన్ కింగ్‌గా పేరుతెచ్చుకున్నారు. అదే సమయంలో దేశభక్తి చిత్రాలతో మెప్పించారు. ఒకప్పుడు అర్జున్ అంటే దేశ భక్తి చిత్రాలే గుర్తుకు వచ్చేవి. పోలీసు, ఆర్మీ నేపథ్యం ఉన్న కథలతో విజయాలు అందుకుని తిరుగులేని స్టార్ గా ఎదిగారు. అదే సమయంలో విభిన్నమైన మూవీస్‌తోనూ మెప్పించారు.
అర్జున్ `మా పల్లెలో గోపాలుడు` చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు. దీంతో తెలుగులో వరుసగా అవకాశాలను దక్కించుకున్నారు. `నాగదేవత`, `కౌబాయ్ నెం 1`, `కోనసీమ కుర్రాడు`, `మనవడొస్తున్నాడు`, `మా వూరి మారాజు`, `ద్రోహి`, `శుభవార్త`, `హనుమాన్ జంక్షన్`, `పుట్టింటికి రా చెల్లి`, `శ్రీ ఆంజనేయం`, `స్వాగతం` వంటి చిత్రాలతో మెప్పించారు. తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యారు. ఆయన తమిళంలో నటించిన సినిమాలు కూడా తెలుగులో విడుదలయ్యేవి. అవి కూడా మంచి ఆదరణ పొందేవి.
అయితే కెరీర్ ప్రారంభంలో అర్జున్ చాలా బిజీగా ఉండేవారు. రోజు ఏడు షిఫ్ట్ ల్లో సినిమాలు చేసేవారట. ఒకే రోజు ఏడు సినిమాల షూటింగ్‌లో పాల్గొనేవారు. ఆయన తెలుగులో నటించిన సినిమాకు తీసుకున్న తొలి పారితోషికం రూ.25వేలు. అయితే అప్పట్లో మంచిగానే రెమ్యూనరేషన్ తీసుకున్నారట. కానీ వాటిని సరిగ్గా వాడుకోలేకపోయారు. పారితోషికం రూపంలో భారీగానే సంపాదించినా, వాటిని ఆస్తులుగా మల్చుకోలేకపోయారట. ఈ విషయంలో సోగ్గాడు శోభన్ బాబు మాట కూడా వినలేదట. శోభన్ బాబుతో కలిసి అర్జున్ `చట్టంతో చదరంగం` అనే సినిమాలో నటించారు. ఆ సమయంలో తనతో ఎంతగానో క్లోజ్‌గా ఉండేవారట. ఆయన అన్ని విషయాలు పంచుకునేవారట.
ఈ క్రమంలో వచ్చిన డబ్బుని భూమిపై పెట్టు అని, ఆస్తులు కొనుక్కో అని చెప్పేవారట. తనతో శోభన్ బాబు ఎంతో క్లోజ్‌గా ఉండేవారని, చాలా విషయాలు చెప్పేవారని, కానీ తానే వినలేదన్నారు అర్జున్. ఆయన మాట విని ల్యాండ్ కొంటే ఇప్పుడు వంద వేల కోట్లు ఉండేవని చెప్పారు అర్జున్. శోభన్ బాబు తనతో ఎంతో క్లోజ్‌గా ఉన్నారని, చాలా గొప్ప మనిషి అని చెప్పారు. అంతేకాదు ఈ క్రమంలో పలు షాకింగ్ విషయాలు పంచుకున్నారు. తనచుట్టూ ఉన్న వాళ్లే మోసం చేశారని తెలిపారు అర్జున్.
తాను చాలా సినిమాలు చేశాను, కానీ చాలా మంది తనని మోసం చేశారని తెలిపారు. వారి పేర్లు చెప్పడానికి ఇష్టపడని అర్జున్ ఇండస్ట్రీలో తన చుట్టూ ఉన్నవాళ్లే మోసం చేశారని తెలిపారు. ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది, ఎక్కడికిపోతుంది, ఎవరు తన డబ్బు మిస్ యూజ్ చేస్తున్నారో తెలిసేది కాదు, ఆ తెలియని ఏజ్‌ని ఉపయోగించుకుని మోసం చేశారని తెలిపారు అర్జున్. అప్పుడే తాను ఇన్వెస్ట్ చేసి ఉంటే ఒక్కో ప్రాపర్టీ వేరే రేంజ్‌లో ఉండేదన్నారు. ఆ తర్వాత తెలివి వచ్చాక కొన్ని ప్రాపర్టీస్ కొన్నానని, అవి కూడా ఫోర్స్ మీదనే కొన్నానని తెలిపారు. మొత్తంగా తన చుట్టూ ఉన్న వాళ్లు మోసం చేయడం, శోభన్ బాబు మాట వినకపోవడం వల్ల అర్జున్ వందల వేల కోట్ల ఆస్తులను కోల్పోయారని చెప్పొచ్చు. ఈ విషయాలను గ్రేట్ ఆంధ్రాకి ఇచ్చిన ఇంటర్వ్యూ అర్జున్ తెలిపారు.