ఎపిసోడ్ ప్రారంభంలో భార్య కష్టపడుతుందని వాడు మంచి పని చేస్తే ఆ పనిని తప్పు పడతారేంటి.. అయినా ఏనాడైనా వంట గదిలోకి వెళ్లే మొహమేనా అని రుద్రాణిని మందలిస్తుంది చిట్టి. సుభాష్ కూడా రుద్రాణి మన ఇంట్లో తగువులు పెట్టాలని చూస్తుంది ఆవిడ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు అని భార్యకి చెప్తాడు సుభాష్. అయినా మన కొడుకుకి నిర్ణయం తీసుకునే స్వతంత్రం మన ఇంట్లో లేదా అని నిలదీస్తాడు.
వాడిని నిర్ణయం తీసుకోవద్దు అనలేదు కానీ నాకు చెప్తే సరిపోయేది కదా అంటున్నాను, లేకపోతే ఈ రుద్రాణి లాంటి వాళ్లు కూడా గొంతు ఎత్తి మాట్లాడే సందర్భం వస్తుంది. అయినా పాపం ఇక్కడ ఏదో జరిగిపోతుందని బాగా ఎక్స్పెక్ట్ చేసినట్లు ఉన్నావు, డిసప్పాయింట్ చేసినట్టు ఉన్నాను అని రుద్రాణి తో చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ. సీన్ కట్ చేస్తే పది లక్షల అప్పు కోసం ఎవరికో ఫోన్ చేస్తాడు రాహుల్.
ఆ మాటలు విన్న రుద్రాణి అసలు నీకు అంత డబ్బు ఎందుకు, ఏం చేస్తున్నావు మళ్లీ ఏమైనా ప్లాన్ చేసావా అని కొడుకుని నిలదీస్తుంది. మైకెల్ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని తెలిస్తే అమ్మ కంగారు పడుతుంది అని మనసులో అనుకొని ఏమీ లేదమ్మా చిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం అంతే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాహుల్. మరోవైపు టాబ్లెట్ వేసుకోమని స్వప్నని మందలిస్తుంది కనకం.
తర్వాత వేసుకుంటాను అని చెప్పినా వినదు. దగ్గరుండి ఆమె చేత టాబ్లెట్ వేయించి ఇంక ఫోన్ చూసుకో అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కనకం వెళ్ళిపోయిన తర్వాత నోట్లో టాబ్లెట్ తీసి డస్ట్ బిన్ లో వేసేస్తుంది స్వప్న. మరోవైపు కావ్య భర్త దగ్గరికి వచ్చి ఎందుకు పని మనిషిని పెట్టారు అని అడుగుతుంది. నీ కోసమే కదా పెట్టాను అంటాడు రాజ్.
అయితే శాంతనే ఎందుకు తీసుకురావాలి, అత్తయ్య గారికి ఇష్టం లేని పని ఎందుకు చేయాలి ఆమెని మాన్పించేయండి అంటుంది కావ్య. తప్పు లేకుండా పని నుంచి తీసేయడమే తప్పు, మళ్ళీ పిలిపించి ఇప్పుడు పంపించేస్తే అది ఇంకా తప్పు. అయినా నేను వెళ్లి అమ్మని ఒప్పిస్తాను అని చెప్పి తల్లి దగ్గరికి వెళ్తాడు రాజ్.
ఈయన నిజంగానే నాకోసం ఆలోచిస్తున్నారా లేక నటిస్తున్నారా కానీ ఆయన నా కోసం ఇలా చేయడం చాలా బాగుంది అనుకుంటుంది కావ్య. మరోవైపు నా కూతురు కష్టపడి నాకోసం చీరలు కొంటే వాటిని నువ్వు కత్తిరించేస్తావు కదా అని చెప్పి రుద్రాణి చీరలు అన్ని కత్తిరించేసి ఏమీ తెలియనట్లు మంచం మీద పడుకుంటుంది కనకం. మరోవైపు తన దగ్గరికి వచ్చిన రాజ్ తో నిష్టూరంగా మాట్లాడుతుంది అపర్ణ.
నేను ఎందుకు బాధపడుతున్నానో కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు, నీ ప్రవర్తనతో విసుగిపోతున్నాను. నీ భార్యని ప్రేమిస్తే ఆ ప్రేమని చూపించు, కోప్పడితే ఆ కోపాన్ని చూపించు అంతేగాని మధ్యలో ఈ తల్లిని పిచ్చిదాన్ని చేయొద్దు అని చెప్పి రాజ్ ఇంకేదో చెప్పబోతున్నా కూడా వినిపించుకోకుండా అక్కడినుంచి పంపించేస్తుంది అపర్ణ. మరోవైపు బెడ్ రూమ్ లోకి వచ్చిన రుద్రాణి కబోర్డు ఓపెన్ చేసేసరికి తన చీరలని చిరిగిపోయి ఉండడం చూస్తుంది.
అయ్యో నా చీరలు అని అంటుంది. అప్పుడే మెలకువ వచ్చిన దానిలాగా కనకం లేచి ఏం జరిగింది అని అడుగుతుంది. చిరిగిపోయిన చీరలు చూసి ఆ మాయదారి ఎలుకలే కొట్టేసి ఉంటాయి అంటుంది. ఆ ఎలుకలకి నేను కాపలా ఉంటాను మీరు వెళ్లి స్వప్న రూమ్ లో పడుకోండి అంటుంది. ఏమి అక్కర్లేదు నువ్వు పడుకో అని కోపంగా అంటుంది రుద్రాణి.
తిక్క కుదిరింది అని అనుకొని నవ్వుకుంటూ పడుకుంటుంది కనకం. మరోవైపు పొట్ట టైట్ గా ఉంది అని ఇంటి చుట్టూ వాకింగ్ చేయడానికి బయలుదేరుతాడు ప్రకాష్. మరోవైపు తల్లి మాట్లాడిన మాటలు తలుచుకుంటూ ఉంటాడు రాజ్. ఇంతలో అతని ఆత్మ బయటకు వచ్చి అతనితో మాట్లాడడం ప్రారంభిస్తుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.