ఓ మహిళ నుంచి యాంకర్ శ్యామల భర్త కోటీ రూపాయలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడని ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఛీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో శ్యామల భర్త నరసింహారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజాగా ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. ఇంటికొచ్చాక తనపై వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వివరణ ఇచ్చారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు నరసింహారెడ్డి ఓ వీడియోని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
`నాకు చట్టాలు, న్యాయస్థానంపై పూర్తి నమ్మకం ఉంది. నాపై పెట్టింది తప్పుడు కేసేనని నిరూపించడానికి నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. రెండు రోజుల్లో అన్ని సాక్షాలతో మీ ముందుకు వస్తాను. నాపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేశారని అప్పుడు మీకే తెలుస్తుంది. కొన్నిసార్లు మనపై తప్పుడు ఆరోపణలు చేస్తుంటారు. ఇలాంటివి సహజంగానే జరుగుతుంటాయి. ఇప్పుడు దాన్ని ఎదుర్కోవాలి. వీటిలో నిజనిజాలేంటో ఫ్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది. ఇప్పటిదాకా నాకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు` అని నరసింహారెడ్డి ఈ వీడియో పేర్కొన్నారు.
2017 నుంచి ఇప్పటి వరకు విడతల వారిగా దాదాపు కోటీ రూపాయలు తీసుకున్న నరసింహారెడ్డి ఇప్పటిదాకా తిరిగి ఇవ్వలేదని ఓ బిజినెస్ ఉమెన్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. డబ్బులు అడిగితే తనను బెదిరించడమే కాకుండా, లైంగిక వేధింపులకు కూడా గురిచేశాడని తెలిపింది.గంటిపేటలోని తమకి గల నాలుగు ఎకరాల ల్యాండ్‌లో స్విమ్మింగ్ ఫూల్, పబ్, గేమ్ జోన్ నిర్మిస్తామని ఈ అమౌంట్‌ని తీసుకున్నారట. కానీ ఇప్పటి వరకు నిర్మించలేదని, తన డబ్బులు తిరిగివ్వమంటే వేధింపులకు దిగుతున్నాడని ఆమె పేర్కొంది.
దీనిపై సెటిల్మెంట్ చేసుకోవాలంటూ నరసింహారెడ్డి తరపున మరో మహిళ రాయబారం నడిపినట్లుగా తెలిపింది. మహిళా ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, శ్యామల భర్త నరసింహారెడ్డితోపాటు రాయబారం నడిపిన మహిళను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. బెయిల్‌పై వచ్చిన నరసింహారెడ్డి తనపై తప్పుడు కేసు పెట్టారని తెలిపారు.
నరసింహారెడ్డి టీవీ నటుడిగా రాణిస్తున్నారు. ఇక శ్యామల నటిగా, టీవీ యాంకర్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే.