Betting Apps
Betting Apps Case: టాలీవుడ్ లో బెట్టింగ్ యాప్స్ వివాదం హీటెక్కుతోంది. ఇప్పటికే విష్ణుప్రియ, టేస్టీ తేజ లాంటి వారిని పోలీసులు విచారించారు. విష్ణుప్రియ ఫోన్ ని పోలీసులు సీజ్ చేశారు. రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, హర్ష సాయి, యాంకర్ శ్యామల, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, సుప్రీతా, రీతూ చౌదరి లాంటి సెలెబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి వివాదాలు కొనితెచ్చుకున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కూడా మొదలు పెట్టారు. వీరందరిపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. దీనితో ముందస్తు చర్యల్లో భాగంగా వీళ్లంతా వివరణ ఇవ్వడం ప్రారంభించారు. కొందరు తమ తప్పు లేదని చెబుతుండగా మరి కొందరు చట్ట ప్రకారమే ఈ పని చేశామని కవర్ చేసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ వివాదంలో చిక్కుకున్న సెలెబ్రిటీలు ఎవరెవరు ఏ విధంగా స్పందించారో ఇప్పుడు చూద్దాం.
లా చదివా, అయినా తప్పని తెలియదు
అనన్య నాగళ్ళ ఓ ఇంటర్వ్యూలో బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడం గురించి స్పందించింది. 'నేను ప్రమోట్ చేసింది ఒకే ఒక్క బెట్టింగ్ యాప్ ని. ఆ తర్వాత చేయలేదు. దానికి 1 లక్ష 20 వేలు రెమ్యునరేషన్ ఇచ్చారు. ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తున్నాను అని అనుకున్నాను తప్ప బెట్టింగ్ యాప్ అని తెలియదు. తెలియక తప్ప చేశా. అది తప్పని తెలిసిన తర్వాత ఆ బెట్టింగ్ యాప్ ద్వారా నష్టపోయిన వారిని గుర్తించి వాళ్ళకి నా రెమ్యునరేషన్ ఇచ్చేసా' అని అనన్య పేర్కొంది. మీరు లా చదివారు కదా.. ఇలా చేయడం తప్పు అనిపించలేదా అని యాంకర్ అడగగా.. అవును లా చదివాను. కానీ ఆ టైంలో ఇది తప్పని తెలియదు అని అనన్య పేర్కొంది.
రానా, విజయ్ దేవరకొండ ఒకే రకమైన రియాక్షన్
బెట్టింగ్ యాప్స్ వివాదంలో చిక్కుకున్న రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ తరుపున వాళ్ళ టీమ్స్ స్పందించాయి. ఇద్దరి రియాక్షన్ ఒకే విధంగా ఉంది. స్కిల్ ఆధారిత గేమింగ్ కి మాత్రమే రానా ఒప్పందం కుదుర్చుకున్నారు. దానికి మాత్రమే ప్రమోట్ చేశాడు. ఆ ఒప్పందం 2017 ముగిసింది అని రానా టీం పేర్కొంది. చట్టపరమైన అంశాలని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆన్లైన్ గేమింగ్ ని రానా ప్రమోట్ చేసినట్లు తెలిపారు. అది కూడా ఆన్లైన్ గేమింగ్ కి అనుమతి ఉన్న ప్రాంతాల్లోనే రానా ప్రమోట్ చేశారు.
విజయ్ దేవరకొండ టీం కూడా దాదాపుగా ఇలాంటి వివరణే ఇచ్చింది. స్కిల్ బేస్డ్ గేమ్ కి విజయ్ ప్రచార కర్తగా ఉన్నారు. ఆ ఒప్పందం ఇప్పుడు ముగిసింది. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని సుప్రీం కోర్టు పలు సందర్భాల్లో చెప్పినట్లు విజయ్ దేవరకొండ టీం ప్రస్తావించింది.
విష్ణుప్రియ మొబైల్ ఫోన్ సీజ్
కొన్ని రోజుల క్రితం ఈ కేసులో విష్ణుప్రియ పోలీసుల ఎదుట విచారణకు హాజరైంది. ఇప్పటి వరకు తాను 15 బెట్టింగ్ యాప్ సంస్థలకు ప్రమోషన్ నిర్వహించానని, ఒక్కో యాడ్ కి 90 వేలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు విష్ణుప్రియ పోలీసుల విచారణలో అంగీకరించింది. దీనితో పోలీసులు ఆమె మొబైల్ ఫోన్ సీజ్ చేశారు. విచారణ తర్వాత విష్ణుప్రియ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం 'కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది' అంటూ పోస్ట్ చేసింది.
Prakash Raj
అందరినీ ప్రశ్నించే నేను సమాధానం చెప్పాల్సిందే
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ వివాదంపై స్పందించారు. అందరినీ ప్రశ్నించే తాను కూడా సమాధానం ఇవ్వాల్సిందే అని ప్రకాష్ రాజ్ అన్నారు. తాను ఇంత వరకు పోలీసుల నుంచి ఎలాంటి నోటీసులు అందుకోలేదని తెలిపారు. ఒక వేళ నోటీసులు వస్తే తప్పకుండా సమాధానం ఇస్తా. అది నా బాధ్యత. 2016లో బెట్టింగ్ యాప్ సంస్థకి ప్రచారం చేశాను. అది లీగల్ గా జరిగింది. ఆ తర్వాత అది తప్పని రియలైజ్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేసింది లేదు. 2021లో అదే సంస్థ నా ఫోటోలని మళ్ళీ ఉపయోగించారు. కాట్రాక్ట్ ముగిసిన తర్వాత ఇలా చేయడం తప్పని వాళ్ళకి మెయిల్ చేశాను. బెట్టింగ్ యాప్స్ బాధితులు కావద్దని యువతని కోరుతున్నా అంటూ ప్రకాష్ రాజ్ తెలిపారు.