అనసూయ నెమ్మదిగా యాంకర్ అనే ట్యాగ్ కి దూరం అవుతోంది. అనసూయ యాంకర్ గా ఎలాంటి షోలు చేయడం లేదు. జబర్దస్త్ లాంటి షోలకి కూడా ఎప్పుడో స్వస్తి చెప్పేసింది. కానీ నటిగా మాత్రం అనసూయ సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. క్షణం చిత్రం నుంచి ఆమె హవా మొదలయింది అని చెప్పొచ్చు. రంగస్థలం చిత్రంలో అనసూయ నటనకి అంతా ఫిదా అయ్యారు.
ప్రస్తుతం అనసూయ పుష్ప 2లో దాక్షాయణి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ ఫొటోలతో పాటు ఫ్యామిలీ విశేషాలు కూడా పంచుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా అనసూయ పేరు తరచుగా వివాదాల్లో వినిపిస్తూనే ఉంటుంది.
సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగినా అనసూయ వెనక్కి తగ్గదు. ఆ మధ్యన ఆంటీ వివాదం ఎంత పెద్ద రచ్చగా మారిందో తెలిసిందే. అలాగే విజయ్ దేవరకొండ విషయంలో కూడా అనసూయ తరచుగా ఏదో రకమైన కామెంట్స్ చేస్తూనే ఉంటుంది. అర్జున్ రెడ్డి చిత్రం నుంచే వీరిద్దరి మధ్య రచ్చ మొదలయింది. ఇప్పుడు తాజాగా అనసూయ సందీప్ రెడ్డి వంగాని టార్గెట్ చేసినట్లు ఉంది.
సందీప్ రెడ్డి వంగా న్యూ ఏజ్ స్టోరీ టెల్లర్ గా గుర్తింపు సొంతం చేసుకుంటున్నాడు. అతని చిత్రాలు యువతకి బాగా నచ్చేస్తున్నాయి. అర్జున్ రెడ్డి చిత్రం కానీ, ఇటీవల సంచలనం సృష్టించిన యానిమల్ చిత్రం కానీ యువత ఆదరణతోనే బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.
అయితే సందీప్ రెడ్డి వంగా తన చిత్రాల్లో హీరోయిన్లని చూపించే విధానం మాత్రం ఫెమినిస్టులకి నచ్చడం లేదు. వారిలో అనసూయ కూడా ఉంది. యానిమల్ చిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య ఆయా కొట్టుకోవడం, తిట్టుకోవడం ఏంటి అని చాలా మంది విమర్శలు చేశారు. ఒక రిలేషన్ లో కొట్టుకోవడం తిట్టుకోవడం లేకపోతే ప్రేమ లేనట్లే.. వాళ్లిద్దరూ లైన్ గీసుకుని బతుకుతున్నట్లే అని సందీప్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఎంతో వివాదం అయ్యాయి.
ఇక గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా ప్రేమ చిత్రాలు తీయడంలో లెజెండ్ అని చెప్పొచ్చు. లవ్, రిలేషన్ షిప్ పై ఆయన వెర్షన్ భిన్నంగా ఉంది. ఒక అమ్మాయిపై ప్రేమ చూపించడం అంటే..ఆమెని బలవంత పెట్టకూడదు.. ఒక రిలేషన్ అన్నాక అందులో ఒడిదుడుకులు ఉంటాయి. అంతమాత్రాన ఇష్టం వచ్చినట్లు కోపం చూపించకూడదు అని అన్నారు. చేయి ఎత్తడం లాంటివి చేయకూడదు. డిగ్నిటిగా వ్యవహరించాలి. వాళ్ళకి ప్రేమతో చెప్పాలి అని గౌతమ్ మీనన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
వీళ్ళిద్దరిని పోలుస్తూ ఉన్న పోస్ట్ ని అనసూయ సోషల్ మీడియాలో లైక్ చేసి షేర్ చేసింది. దీనితో అనసూయ మరో వివాదానికిఆజ్యం పోసిందని నెటిజన్లు అంటున్నారు.