Amma Paata: ఈ త‌రానికి బాగా న‌చ్చిన అమ్మ పాట‌.. 11 కోట్ల‌కుపైగా వ్యూస్‌తో యూట్యూబ్ షేక్

Published : Jul 12, 2026, 03:05 PM IST

Amma Paata: అమ్మ గురించి ఎన్ని పాటలు వచ్చినా, ఆమె ప్రేమను పూర్తిగా వర్ణించడం అసాధ్యమే. అలాంటి పాటల జాబితాలోకి వ‌స్తుంది అమ్మ‌పాట‌. సురేందర్ మిట్టపల్లి రచించిన ఈ గీతానికి సిస్కో డిస్కో అందించిన సంగీతం, జాన్హవి గానం యువ‌త‌ను తెగ ఆక‌ట్టుకుంది.

PREV
15
అమ్మ ప్రేమ అమృతంతో స‌మానం

పాట ప్రారంభంలోనే... "అమ్మపాడే జోలపాట అమృతానికన్నా తియ్యనంట... అమ్మపాడే లాలిపాట తేనెలూరి పారే ఏరులంట"... అనే పంక్తులతో తల్లి ప్రేమకు ఎంతటి విలువ ఉందో ఎంతో అందంగా చెప్పారు. చిన్నారి జీవితంలో మొదట వినిపించే స్వరం తల్లి జోలపాటే. ఆ పాటలో ప్రేమ ఉంటుంది, భరోసా ఉంటుంది, భవిష్యత్తుకు ఆశీర్వాదం ఉంటుంది. "నిండు జాబిలి చూపించి... గోటితో బుగ్గను గిల్లేసి... ఉగ్గును పట్టి ఊయలలూపే అమ్మ లాలన" అనే పంక్తులు ప్రతి ఒక్కరికీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి. తల్లి ఇచ్చే ప్రతి స్పర్శలో ప్రేమ, ప్రతి చూపులో ఆశీర్వాదం దాగి ఉంటాయని ఈ పల్లవి చెబుతోంది.

25
ప్రకృతిలో ప్రతి అందానికి తల్లే ప్రతిరూపం

మొదటి చరణంలో తల్లిని ప్రకృతితో పోల్చిన విధానం ఎంతో ఆకట్టుకుంటుంది. "కురిసే వాన చినుకులకి నీలినింగి అమ్మ... మొలిచే పచ్చని పైరులకి నేలతల్లి అమ్మ" అనే పంక్తులు తల్లి గొప్పతనాన్ని ప్రకృతి ద్వారా వివరిస్తాయి. వానకు ఆకాశం ఎంత అవసరమో, పంటకు నేల ఎంత ముఖ్యమో, చల్లని గాలికి పూలకొమ్మ ఎంత అందమో, అలాగే ప్రతి జీవికి తల్లి అంతే అవసరం అని రచయిత చెబుతున్నారు. "ప్రకృతిపాడే పాటలకి యలకోయిల అమ్మ" అనే భావం తల్లి స్వరాన్ని కోయిల గానంతో పోల్చుతుంది. చివరగా "సృష్టికి మూలం అమ్మతనం... సృష్టించలేనిది అమ్మ గుణం" అనే పంక్తులు తల్లి ప్రేమకు ప్రత్యామ్నాయం లేదని, అది సృష్టిలోనే అత్యంత గొప్ప వరం అని తెలియజేస్తాయి.

35
ప్రతి విజయానికి, ప్రతి వెలుగుకూ పునాది అమ్మే

రెండో చరణంలో తల్లి జీవితంలో ఎంత కీలకమైన పాత్ర పోషిస్తుందో అద్భుతమైన ఉపమానాలతో వివరించారు."నింగిని తాకే మేడలకి పునాది రాయి అమ్మ..."అనే పంక్తి ప్రతి గొప్ప విజయానికి వెనుక తల్లి ప్రోత్సాహం ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తుంది. "అందంపొందిన ప్రతి శిలకి ఉలిగాయం అమ్మ" అనే లైన్ శిల్పం అందంగా మారడానికి శిలపై పడే ప్రతి ఉలి దెబ్బ ఎంత అవసరమో, పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడానికి తల్లి పడే కష్టం కూడా అంతే విలువైనదని చెబుతోంది. "చీకటి చెరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మ... లోకం చూపే కన్నులకి కంటిపాప అమ్మ" అనే పంక్తులు తల్లి జీవితం మొత్తానికి వెలుగని, బిడ్డకు మార్గదర్శకురాలని ఎంతో భావోద్వేగంగా తెలియజేస్తాయి. చివరిగా "అమ్మంటే అనురాగ జీవని... అమ్మ ప్రేమే సంజీవని" అనే మాటలతో తల్లి ప్రేమ జీవితం మొత్తం నిలబెట్టే శక్తిగా చిత్రీకరించారు.

45
యువతను ఆకట్టుకుంటున్న సంగీతం, గానం, భావోద్వేగం

ఈ పాటకు యువత నుంచి మంచి స్పందన రావడానికి కారణం కేవలం సాహిత్యం మాత్రమే కాదు. సిస్కో డిస్కో అందించిన సంగీతం ఆధునిక శైలిలో సాగుతూ కూడా భావోద్వేగాన్ని ఏమాత్రం తగ్గించలేదు. జాన్హవి యర్రం తన మధురమైన గాత్రంతో ప్రతి పదానికి ప్రాణం పోశారు. పాటలోని ఫ్లూట్, గిటార్, కీబోర్డ్, డ్రమ్స్ వినియోగం మెలోడీకి మరింత అందాన్ని తీసుకొచ్చింది. అందుకే ఈ గీతం ఒకసారి విన్నవారు మళ్లీ మళ్లీ వినాలనిపించేలా నిలుస్తోంది. రీల్స్, షార్ట్ వీడియోల రూపంలో కూడా ఈ పాట యువతలో వేగంగా ప్రాచుర్యం పొందుతోంది.

55
'అమ్మపాట' వెనుక నిలిచిన బృందం

ఈ అందమైన గీతాన్ని రవి వై, మిట్టపల్లి స్టూడియో నిర్మించారు. సాహిత్యాన్ని సురేందర్ మిట్టపల్లి అందించగా, దర్శకత్వం, సినిమాటోగ్రఫీని తిరుపతి గౌని నిర్వహించారు. జాన్హవి యర్రం ఆలపించిన ఈ పాటకు సిస్కో డిస్కో సంగీతం సమకూర్చారు. ఎడిటింగ్‌ను అశోక్ కర్రి నిర్వహించగా, అదనపు ప్రోగ్రామింగ్, గిటార్స్‌ను అరుణ్ చిలువేరు అందించారు. ఫైనల్ మిక్సింగ్, మాస్టరింగ్‌ను జే వినయ్ కుమార్ పూర్తి చేశారు. వోకల్ రికార్డింగ్‌ను రామ్ గండికోట, ఆనంద్ పాల్ నిర్వహించారు. ఫ్లూట్‌పై శివమ్, కీస్‌పై బెన్నీ, డ్రమ్స్‌పై జేక్ జాకబ్, గిటార్‌పై జోషువా తమ ప్రతిభను చూపించారు. జాజ్9, రిథమ్ ఆన్‌లైన్ స్టూడియోల్లో రికార్డింగ్ జరగగా, ప్రచార డిజైన్లను సాగర్ ముడిరాజ్ రూపొందించారు. ఈ పాట‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ఏకంగా 2024 మే5న విడుద‌లైన ఈ పాటను ఇప్ప‌టి వ‌ర‌కు ఏకంగా 116,611,873 మంది చూడ‌డం ఈ పాట గొప్ప‌త‌నానికి నిద‌ర్శ‌నం.

Read more Photos on
click me!

Recommended Stories