సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట సంఘటన, మహిళ మృతి కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బన్నీ అరెస్ట్ కావడంతో దేశవ్యాప్తంగా ఈ సంఘటన పెను సంచలనంగా మారింది. అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం పుష్ప 2 డిసెంబర్ 5న విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. పుష్ప చిత్రానికి సీక్వెల్ గా సుకుమార్ పుష్ప 2 చిత్రీకరించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన పుష్ప 2 అందుకు తగ్గట్లుగానే బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
డిసెంబర్ 4 రాత్రి నుంచే ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్స్ ప్రారంభం అయ్యాయి. స్టార్ హీరోల సినిమా రిలీజ్ అంటే హైదరాబాద్ లో ఎక్కువ హంగామా కనిపించేది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోనే. అక్కడ ఉన్న సంధ్య, సుదర్శన్ లాంటి థియేటర్స్ ని స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు, హీరోయిన్లు విజిట్ చేస్తుంటారు. తమ చిత్రాలకు ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ గమనిస్తుంటారు.
పుష్ప 2 చిత్రానికి తార స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. బన్నీ పుష్పరాజ్ పాత్ర అంతలా మాస్ ఆడియన్స్ కి ఎక్కేసింది. డిసెంబర్ 4న రాత్రి 9.40 గంటలకు సంధ్య థియేటర్ లో పుష్ప 2 ప్రీమియర్ ప్రదర్శించారు. అల్లు అర్జున్ థియేటర్ విజిట్ కి వెళ్లారు. అప్పటికే థియేటర్ లోపల, బయట ఆవరణం కిక్కిరిసి పోయింది. బన్నీ వెళ్ళగానే అభిమానుల తోపులాటలో రేవతి అనే మహిళ ఊపిరాడక మరణించారు.
ఇంతటి ఘోర సంఘటనకి కారకులు థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్, అతడి సిబ్బంది అంటూ పోలీసులు అభియోగాలతో కొన్ని సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా నేడు పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులతో చిన్న వాగ్వాదం జరిగింది. పోలీసులు మా డ్యూటీ మేము చేస్తున్నాం అని చెప్పారు. మీ డ్యూటీ మీరు చేయడం, నన్ను తీసుకెళ్లడం తప్పు లేదు. కానీ బెడ్ రూమ్ వరకు వచ్చేయడం టూ మచ్ అని అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశారు. అది మంచి విషయం కాదు అని అన్నారు.
టెన్షన్ పడుతున్న తన భార్య అల్లు స్నేహకి బన్నీ ఏమీ కాదు అన్నట్లుగా ధైర్యం చెప్పారు. ఆమెకి ప్రేమగా ముద్దు ఇచ్చి పోలీసులతో వెళ్లారు. అల్లు అర్జున్ వెంట అల్లు అరవింద్ కూడా వెళ్లారు. కానీ బన్నీ తండ్రితో కంగారు పడాల్సిన అవసరం లేదు అన్నట్లుగా మాట్లాడారు. మంచి అయినా చెడు అయినా నాకే రానివ్వండి అని తండ్రితో అల్లు అర్జున్ అన్నారు. కాసేపు కాఫీ తాగి పోలీసులతో బన్నీ వెళ్లారు. ఇదిలా ఉండగా బన్నీ అరెస్ట్ క్రమంలో అతడి తరుపున న్యాయవాది హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ని సోమవారం విచారిస్తామని కోర్టు తెలిపినట్లు తెలుస్తోంది.