బోయపాటి శ్రీను బాలయ్యతో సినిమా చేసిన ప్రతిసారి సక్సెస్ దక్కుతోంది. మిగిలిన హీరోలతో సినిమాలు చేసినప్పుడు అంతగా వర్కౌట్ కావడం లేదు. ఇలా ఎందుకు జరుగుతోంది అనేది ఈ కథనంలో తెలుసుకోండి.
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం మరికొన్ని రోజుల్లో థియేటర్లలో సందడి చేయబోతోంది. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న నాల్గవ చిత్రం ఇది. సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు వీరి కాంబోలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. బోయపాటి శ్రీను ఇప్పటి వరకు 10 చిత్రాలకు దర్శకత్వం వహించారు. అందులో బాలయ్యతో మూడు సినిమాలు ఉన్నాయి. బాలయ్యతో కాకుండా బోయపాటి తెరకెక్కించిన సినిమాలు ఎన్ని ? అందులో ఎన్ని హిట్లు ఎన్ని ఫ్లాపులు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
26
తొలి రెండు సినిమాలు సూపర్ హిట్లు
బోయపాటి శ్రీను తెరకెక్కించిన తొలి చిత్రం భద్ర. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో భద్ర ఒకటి. ఆ తర్వాత బోయపాటి.. విక్టరీ వెంకటేష్ తో తులసి అనే చిత్రం రూపొందించారు. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించింది. ఇందులో వెంకీ, నయనతార కెమిస్ట్రీ బాగా ఆకట్టుకుంది.
36
బాలయ్యకి బ్లాక్ బస్టర్, ఎన్టీఆర్ కి డిజాస్టర్
తొలి రెండు చిత్రాలు హిట్లు కావడంతో టాలీవుడ్ లో బోయపాటి పేరు బాగా వినిపించింది. ఆ తర్వాత బోయపాటికి బాలకృష్ణని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ టైంలో వరుస పరాజయాల్లో ఉన్న బాలయ్యకి తిరిగి జోష్ ఇచ్చిన చిత్రం సింహా. వెంటనే బోయపాటి ఎన్టీఆర్ తో దమ్ము చిత్రం తెరకెక్కించారు. హ్యాట్రిక్ హిట్స్ తో జోరుమీద ఉన్న బోయపాటి.. తారక్ కి కూడా బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తారని అంతా భావించారు. కానీ దమ్ము చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశ పరిచింది.
దమ్ము తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్ మరోసారి కుదిరింది. బాలయ్యతో తెరకెక్కించిన రెండవ చిత్రం లెజెండ్ కూడా అద్భుతమైన విజయం సాధించింది. వెంటనే బోయపాటి.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సరైనోడు అనే చిత్రం రూపొందించారు. మాస్ ప్రియులని విపరీతంగా ఆకట్టుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.
56
బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు
సరైనోడు తర్వాత బోయపాటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో జయ జానకి నాయక చిత్రం, రాంచరణ్ తో వినయ విధేయ రామ చిత్రం రూపొందించారు. ఈ రెండు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ముఖ్యంగా రాంచరణ్ వినయ విధేయ రామ చిత్రం ట్రోల్ మెటీరియల్ గా మారింది.
66
బాలయ్యతోనే ఎక్కువ హిట్లు ఎందుకు ?
అఖండ చిత్రంతో బోయాపాటి బాలయ్యతో హ్యాట్రిక్ చిత్రం తెరకెక్కించారు. ఈ మూవీ బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 125 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా అఖండ 2 వస్తోంది. అఖండ తర్వాత కళ్యాణ్ రామ్ తో తెరకెక్కించిన స్కంద డిజాస్టర్ అయింది. బోయపాటి తెరకెక్కించిన 10 సినిమాల్లో 3 హిట్లు బాలయ్యతో ఉన్నాయి. మిగిలిన 7 సినిమాల్లో భద్ర, తులసి, సరైనోడు సూపర్ హిట్స్ గా నిలిచాయి. దమ్ము, జయ జానకి నాయక, వినయ విధేయ రామ, స్కంద చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. బాలయ్యతో కాకుండా మిగిలిన హీరోలతో బోయపాటి సినిమాలు చేసినప్పుడు ఎక్కువ సందర్భాల్లో నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. దీని వెనుక ఉన్న కారణంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. బోయపాటి సినిమాల్లో ఊర మాస్ అనిపించే యాక్షన్ బ్లాక్స్ ఎక్కువగా ఉంటాయి. మాస్ యాక్షన్ తో బీభత్సం చేయాలంటే బోయపాటి తర్వాతే ఎవరైనా. కానీ ఆ మాస్ యాక్షన్ సీన్లు, భారీ డైలాగులు బాలయ్య బాడీ లాంగ్వేజ్ కి సెట్ అవుతున్నాయి కానీ మిగిలిన హీరోలకు సెట్ కావడం లేదు. అందువల్లే బోయపాటి బాలయ్యతో సక్సెస్ అవుతున్నారు. మిగిలిన హీరోలతో ఎక్కువసార్లు ఫెయిల్ అవుతున్నట్లు చర్చ జరుగుతోంది.