పవన్‌ దెబ్బకి మారిన `మా` లెక్కలు.. మంచు విష్ణు గెలుపు ఖాయమేనా?.. ఒంటరైనా మెగా ఫ్యామిలీ?

First Published Sep 29, 2021, 8:28 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రధానంగా చెప్పుకునే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌(మా) ఎన్నికలు టాలీవుడ్‌ని మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. తాజాగా సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 
 

తెలుగులో నటించే నటీనటులకు సంబంధించిన అసోసియేషన్‌ `మా`. ఇందులో 900లకుపై చిలుకు ఆర్టిస్టులు సభ్యులుగా ఉన్నారు. స్టార్‌ హీరోల నుంచి చిన్న పాటి క్యారెక్టర్‌ ఆర్టిస్టుల వరకు ఇందులో సభ్యులుగా ఉంటారు. పూర్తిగా ఇది నటీనటులకు సంబంధించిన అసోసియేషన్‌ మాత్రమే. అయితే టాప్‌ స్టార్స్ ఇందులో సభ్యులు కావడంతో వెయ్యిలోపు సభ్యులున్న ఈ సంస్థ ఇప్పుడు ఏకంగా రెండు రాష్ట్రాలను ప్రభావితం చేస్తుంది. ఎక్కడ చూసిన దీని గురించిన చర్చే జరుగుతుంది. ఇందులోని వివాదాలు దీన్ని మరింత హాట్‌ టాపిక్‌గా మారుస్తుంది. 

అక్టోబర్‌ 10న `మా` ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి రెండు నెలల నుంచే పోటీలో ఉన్న వారు ప్లానింగ్‌తో, స్ట్రాటజీలతో ముందుకు సాగుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సారి పోటీ రసవత్తరంగా మార్చేశారు. అయితే ప్రస్తుతం `మా` అధ్యక్ష పీఠం కోసం ప్రకాష్‌ రాజ్‌, మంచు విష్ణు పోటీ పడుతున్నారు. వీరితోపాటు సీవీఎల్‌ నర్సింహరావు పోటీలో ఉన్నారు. ప్రకాష్‌ రాజ్‌, మంచు విష్ణు ఇప్పటికే తమ ప్యానెల్‌లను ప్రకటించారు. 
 

ప్రకాష్‌రాజ్‌ వైపు మెగా ఫ్యామిలీ ఉందని, ప్రముఖులంతా ఆయన వెంటే ఉన్నారనే టాక్‌ వినిపించింది. ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌ గెలుపు ఖాయమనే గుసగుసలు వినిపించాయి. అయితే మంచు విష్ణు సైతం తన తండ్రి మోహన్‌బాబు సపోర్ట్ తో సూపర్‌ స్టార్‌ కృష్ణ, కృష్ణంరాజు, బాలకృష్ణ వంటి వారి సపోర్ట్ తో ముందుకెళ్తున్నారు. మంచు విష్ణుకి ప్రస్తుత `మా` అధ్యక్షుడు వీ.కే నరేష్‌ కూడా సపోర్ట్ చేస్తున్నారు. తాను ప్రభావితం చేయగలిగిన వారంతా మంచు విష్ణుకి ఓట్‌ వేసేలా చక్రం తిప్పుతున్నారు నరేష్‌. ఈ రోజు ఆయన ప్రెస్‌మీట్‌లో సైతం పనిచేసేవారికే ఓటు వేయాలని, పనికి మాలిన వాళ్లంతా వస్తే సంస్థ మనుగడ కష్టమని స్పష్టం చేశారు. 

ఇదిలా ఉంటే నాలుగు రోజుల క్రితం `మా` ఎన్నికల వేడి ఒకలా ఉండేది. ప్రకాష్‌రాజ్‌ గెలుస్తారనే టాక్‌ ఇండస్ట్రీలో వినిపించింది. కానీ శనివారం `రిపబ్లిక్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌ కళ్యాణ్‌ స్పీచ్‌తో `మా` లెక్కలు మారిపోయాయని తెలుస్తుంది. పవన్‌ ఇండస్ట్రీలోని కులాన్ని టచ్‌ చేయడం, మోహన్‌బాబుని ఈ వివాదంలోకి లాగడం, మరోవైపు ప్రకాష్‌రాజ్‌ లోకల్‌, నాన్‌లోకల్‌ విషయాన్ని తెరపైకి తీసుకురావడం వంటి వాటి కారణంగా ఇప్పుడు సమీకరణాలు మారిపోయాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

విద్యావేత్తగా మోహన్‌బాబు.

మంచు మోహన్‌బాబు .. వైసీపీ ప్రభుత్వానికి సానుభూతి పరులుగా ఉన్నారు. పైగా వైఎస్‌ జగన్‌కి బంధువులు కూడా. ఇదే ఇప్పుడు మంచు విష్ణుకి కలిసొచ్చే అంశంగా, దీన్ని ఆయుధంగా వాడుకుని మంచు ఫ్యామిలీ `మా` ఎన్నికల బరిలోకి దిగుతున్నారని తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో విష్ణుని గెలిపిస్తే ఏపీలో చిత్ర పరిశ్రమకి సంబంధించిన సమస్యలను, థియేటర్ల ఓపెన్‌కి సంబంధించిన ఇష్యూని, అలాగే టికెట్‌ రేట్ల విషయాన్ని తాను సీఎం జగన్‌తో మాట్లాడి పరిష్కరిస్తానని మోహన్‌బాబు సినీ పెద్దలకు హామీ ఇచ్చారని, ఆ దిశగా ప్రచారం ముమ్మరం చేసినట్టు తెలుస్తుంది. 

మొన్న పవన్‌ కళ్యాణ్‌ ఇండస్ట్రీ.. ఏపీ ప్రభుత్వంపై గళం విప్పాలని తెలిపారు. దీనిపై మంచు మోహన్‌బాబు స్పందించాలని తెలిపారు. జగన్‌కి బంధువులనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇండస్ట్రీ సమస్యలపై మాట్లాడాలని, కూర్చొని పరిష్కరించాలని ఆయన తన ప్రసంగంలో వెల్లడించారు. ఆయన మాటలనే తనకు సానుకూలంగా మలుచుకోబోతున్నారట మంచు ఫ్యామిలీ. ఆ రిలేషన్‌తోనే ఇండస్ట్రీ విషయాలను జగన్‌తో చర్చించి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారని టాక్‌. 

అయితే ఇప్పటి వరకు `మా` ఎన్నికలను, అందులో గెలుపుని మెగా ఫ్యామిలీ శాషిస్తుందని, చిరంజీవి ఎవరికి సపోర్ట్ చేస్తే వారిదే విజయమనే నానుడి ఉండేది. కానీ పవన్‌ స్పీచ్‌ అనంతరం ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఒంటరైందని, పవన్‌ ఓరకంగా చిరుని ఇరకాటంలో పెట్టారని చర్చ నడుస్తుంది. పవన్‌కి ఒకరిద్దరు హీరోలు తప్ప పెద్దగా ఎవరూ మద్దతు ప్రకటించలేదు. పైగా తాజాగా నిర్మాత దిల్‌రాజు బుధవారం ఏపీ మంత్రి పేర్ని నానితో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పవన్‌ వ్యాఖ్యలకు, చిత్ర పరిశ్రమకి సంబంధం లేదనే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ పరిణామాలు చూస్తుంటే మంచు ఫ్యామిలీ వైపే ఆర్టిస్టులు మొగ్గు చూపుతున్నారనే టాక్‌ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రకాష్‌ రాజ్‌ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 
 

click me!