బిగ్‌బాస్ షోలో ఎంతో మందికి లైఫ్ ఇస్తుంది. అవకాశాల మాట పక్కన పెడితే ఊహించనంత ఇమేజ్‌ని, పాపులారిటీని తీసుకొస్తుంది. ఓవర్ నైట్‌లో సెలబ్రిటీలు అయిపోతుంటారు. ఈ షో అనంతరం చాలా మంది లైఫ్‌లో బాగా సెటిల్ అయిన వాళ్లు కూడా ఉన్నారు. అదే సమయంలో కొంత మంది నెగటివిటీని మూట గట్టుకున్నారు.
బిగ్‌బాస్ 5వ సీజన్ మాత్రం చాలా మందికి నెగటివిటీని తెచ్చిపెట్టింది. విన్నర్ వీజే సన్నీ, కాజల్, శ్రీరామ్, మానస్, విశ్వ వంటి వారికి మంచి గుర్తింపు వచ్చింది. కానీ మెజారిటీగా చాలా మంది నెగటివిటీని మూటగట్టుకున్నారు. అందులో ప్రధానంగా షణ్ముఖ్ మాత్రం ఆడియెన్స్ దృష్టిలో విలన్ అయిపోయాడనే టాక్ వినిపించింది. హౌజ్‌లో అతని ప్రవర్తన పట్ల చాలా విమర్శలు వచ్చాయి. సిరితో ఆయన రిలేషన్ సైతం వివాదంగా మారింది.
హౌజ్‌లో వీరిద్దరు స్నేహం పేరుతో మరింత క్లోజ్‌గా మూవ్ అయ్యారని, హద్దులు మీరి ప్రవర్తించారని విమర్శలు మూటగట్టుకున్నారు. సిరి విషయంలో షణ్ముఖ్ ప్రవర్తన తీరుపట్ల ఇబ్బంది పడ్డ దీప్తిసునైనా తమ ఐదేళ్ల ప్రేమ బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టింది. బ్రేకప్ చెప్పింది.
అయితే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ సిరిపై కూడా పడుతుందనే టాక్ వినిపిస్తుంది. బిగ్‌బాస్ హౌజ్‌లోకి రావడానికి ముందే సిరి.. సహ నటుడు శ్రీహాన్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. వీరిద్దరు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు. ఈ క్రమంలో షణ్ముఖ్ విషయంపై శ్రీహాన్ కూడా అసంతృప్తిగా ఉన్నారనే కామెంట్లు వినిపించాయి. సోషల్ మీడియాలో ట్రోల్ ఊపందుకున్నాయి.
వాటికి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు సిరి ప్రియుడు శ్రీహాన్. తాజాగా సిరి బర్త్ డే(జనవరి3) సందర్భంగా ఆమెకి విషెస్ తెలిపారు. `హ్యాపీ బర్త్‌డే సిరి.. ఈ సంవత్సరం పాజిటివ్ వైబ్స్‌తో నీ జీవితం సాగాలని ఆశిస్తున్నా. నీ లక్ష్యాలను త్వరలోనే సాధిస్తావ్. గాడ్ బ్లెస్ యూ` అంటూ ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు.