
ఒకప్పుడు చాలామంది హీరోలు స్టార్ ఇమేజ్ తో రాణించి మధ్యలోనే కనుమరుగైపోయారు. స్టార్లు సూపర్ స్టార్లు అవ్వాల్సిన వారు మధ్యలోనే కెరీర్ ను పోగొట్టుకుని తెరమరుగు అవ్వడమో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మిగిలిపోవడమో జరిగేది. అటువంటి హీరోలలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఉన్న చిరంజీవి, రజినీకాంత్, కమల్ హాసన్ ల కంటే ముందు స్టార్ గా వెలిగిన వారిలో మైక్ మోహన్ ఒకరు.
ఒకే ఏడాదిలో 14 సినిమాలు హిట్ కొట్టిన హీరోగా మైక్ మోహన్ రికార్డ్ క్రియేట్ చేశాడు. 80ల కాలంలో మైక్ మోహన్ చాలామందికి అభిమాన హీరో, తమిళ పరిశ్రమలో ఉన్న స్టార్స్ లో ఒకరు కూడా.
రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి పెద్ద పెద్ద హీరోలకు గట్టి పోటీ ఇచ్చారు. ఆయన వరుస విజయాలు చూసి అప్పటి స్టార్ హీరోలు కూడా ఆశ్చర్యపోయారు. అందుకే ఆయన్ని సిల్వర్ జూబ్లీ హీరో అని నిర్మాతలు, దర్శకులు పిలిచేవారు.
తక్కువ బడ్జెట్ లో మోహన్ తో సినిమాలు తీసిన నిర్మాతలకు మంచి లాభాలు వచ్చాయి. మోహన్ అదృష్టవంతుడు మాత్రమే కాదు, షూటింగ్ కి సరిగ్గా టైం కి వచ్చేవారు. షూటింగ్ లో ఏ ఇబ్బంది పెట్టేవారు కాదు. అందుకే నిర్మాతలందరికీ ఆయన అంటే ప్రత్యేక అభిమానం ఉండేది.
ఆయన సినిమా అంటే పాటలు బాగుంటాయి, సినిమా బోర్ కొట్టదు. కుటుంబంతో కలిసి చూడొచ్చు అనే నమ్మకం ప్రేక్షకులకు ఉండేది.
1956 ఆగస్టు 23న కర్ణాటకలోని ఉడిపిలో పుట్టారు మోహన్. ఆయన అసలు పేరు మోహన్ రావు. తండ్రి బెంగళూరులో హోటల్ నడిపేవారు. బెంగళూరులోనే చదువుకున్న మోహన్ కి నటన అంటే ఇష్టం. అందుకే అక్కడి నాటకాలలో నటించేవారు. ఒకసారి బెంగళూరు వెళ్ళిన సినిమాటోగ్రాఫర్ బాలు మహేంద్ర కంట పడ్డారు. మోహన్ నటన, ఆయన లుక్ బాలు మహేంద్రను ఆకట్టుకున్నాయి.
అందుకే ఆయన తీసిన కన్నడ సినిమా కోకిల లో మోహన్ కి చిన్న పాత్ర ఇచ్చారు. కమల్ హీరోగా, శోభన హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మోహన్ చిన్న పాత్రలో కనిపించారు. తర్వాత మూడుపని సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చాడు మోహాన్.
ఈ అవకాశం కూడా ఇచ్చింది బాలు మహేంద్రే. మూడుపని సినిమాలో ఫోటోగ్రాఫర్ గా నటించారు. ఈ సినిమాలో కేవలం నాలుగు సీన్లలో మాత్రమే కనిపిస్తారు.
తర్వాత మహేంద్రన్ దర్శకత్వంలో నెంజతై కిల్లాదే సినిమాలో సుహాసిని ప్రియుడిగా నటించారు. సుహాసిని అన్నయ్యగా శరత్ బాబు, భర్తగా ప్రతాప్ పోతన్ నటించారు. ఇందులో మోహన్ కి చిన్న పాత్రే అయినా కార్ మెకానిక్ గా నటించి అందరి దృష్టిని ఆకర్షించారు. మూడుపని, నెంజతై కిల్లాదే రెండూ 1980లో వరుస నెలల్లో విడుదలై మంచి విజయం సాధించాయి.
1981లో వచ్చిన 'క్లింజల్గల్' సినిమా మోహన్ కి హీరోగా మంచి పేరు తెచ్చిపెట్టింది. మామూలు హీరోలలా కాకుండా, సహజంగా నటించిన మోహన్ ని అప్పటి తరం ప్రేక్షకులు బాగా ఆదరించారు.
కమల్ హాసన్ తర్వాత అత్యధిక అభిమానులను సంపాదించుకున్న హీరో మోహన్. మోహన్ లాంటి భర్త కావాలని అప్పట్లో చాలా మంది అమ్మాయిలు కలలు కనేవారు.
మోహన్ విజయానికి ఇళయరాజా పాటలు కూడా బాగా ఉపయోగపడ్డాయి. సహజమైన కథను బాగా చెప్పే దర్శకులు, ఇళయరాజా సంగీతం ఉంటే ఆ సినిమా హిట్ అనే నమ్మకం అప్పట్లో ఉండేది. అలాంటి సినిమాలే మోహన్ కి దక్కాయి.
ఎక్కువ సినిమాల్లో మైక్ పట్టుకుని పాడుతుండటంతో ఆయన్ని మైక్ మోహన్ అని పిలిచేవారు. మోహన్ నటించిన చాలా హిట్ సినిమాలకు ఇళయరాజా సంగీతం అందించారు.
పయణంగళ్ ముడివదిళ్ల సినిమాలో మొదటిసారి మోహన్ మైక్ పట్టుకుని పాడారు. అప్పటి నుంచి ఆయన్ని మైక్ మోహన్ అని పిలవడం మొదలైంది. సినిమాలో మోహన్ మైక్ తో కనిపిస్తే ఆ సినిమా హిట్ అనే నమ్మకం కూడా ఉండేది.
హీరోగా ఉన్నప్పుడే ప్లే బాయ్, విలన్ లాంటి పాత్రలు కూడా చేశారు. తెలుగులో కూడా చాలా సినిమాలు చేశారు మైక్ మోహన్. చూపులు కలిసిన శుభవేళ, స్రవంతి లాంటి సినిమాల్లో హీరోగా చేసిన మోహన్. ఆతరువాత అబ్బయితో అమ్మాయి సినిమాలో నాగశౌర్య తండ్రిగా నటించారు.
తొలినాళ్లలో కొన్ని సినిమాల్లో నటించిన మోహన్ తర్వాత ఒకే ఏడాదిలో 14 హిట్ సినిమాలు చేసిన ఘనత సాధించారు. ఒక్కొసారి ఏడాదికి 10 సినిమాల్లో నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 1, 2, 3 సినిమాలు హిట్ చేయగలరు. కానీ 14 సినిమాలు వరుసగా హిట్ చేయడం చాలా కష్టం. కానీ ఆ ఘనతను మోహన్ సులువుగా సాధించారు. ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్నాళ్లు కనిపించి.. తెరమరుగైపోయారు. చాలా గ్యాప్ తర్వాత ఈమధ్యే మళ్లీ క్యారెక్టర్ రోల్స్ చేయడానికి రెడీ అవుతున్నాడు.