
కాజల్ అగర్వాల్(Kajal Agarwal) తెలుగులో స్టార్ హీరోయిన్‌గా రాణించింది. తెలుగు అందాల చందమామగా పేరు తెచ్చుకుంది. తిరుగులేని స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కాజల్ రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయ్యింది. పెళ్లయ్యాక కూడా సినిమాలు చేసింది. అంతకు ముందే ఒప్పుకున్న `మోసగాళ్లు`, `ఆచార్య`(Acharya),`హే సినామిక` వంటి చిత్రాల షూటింగ్ పూర్తి చేసుకుంది.
కాజల్ ఒప్పుకున్న అన్ని సినిమాల షూటింగ్‌లు పూర్తయ్యాక మూవీస్‌కి గ్యాపిచ్చి పూర్తి ఫ్యామిలీకే టైమ్ కేటాయించింది. దాని ఫలితంగా ఆమెకి పండంటి మగ పుట్టిన విషయం తెలిసిందే. తన చిన్నారి కుమారుడుకి `నీల్ కిచ్లు` అంటూ నామకరణం కూడా చేశారు.
అయితే డెలివరీ అయ్యాక నెల రోజులకే ఫ్రీ అయ్యిందీ అందాల చందమామ. హాట్ ఫోటో షూట్ చేస్తూ తాను ఫిట్‌గానే ఉన్నానని, తన గ్లామర్ ఏమాత్రం తగ్గలేదనే హింట్ ఫిల్మ్ మేకర్స్ కి ఇచ్చింది. అంతేకాదు త్వరలోనే రీఎంట్రీకి ప్లాన్ చేసుకున్నట్టు వార్తలొస్తున్నాయి.
ఇదిలా ఉంటే కాజల్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు `ఆచార్య` టీమ్. ఆమెని బుల్లితెరపై చూసే అవకాశాన్ని కల్పించబోతున్నారు. కాజల్ డెలివరీకి ముందు చివరగా నటించిన చిత్రం `ఆచార్య`. చిరంజీవి హీరోగా రామ్‌చరణ్ కీలక పాత్రలో, ఆయనకు జోడీగా పూజా హెగ్డే నటించిన చిత్రమిది. కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఘోర పరాజయం చవిచూసింది. అనేక విమర్శలపాలయ్యింది. సుమారు యాభై కోట్ల వరకు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది.
ఓటీటీలోనూ ఈ సినిమాకి ఆదరణ దక్కలేదు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కొరటాల శివ ఇంటిముందుకొచ్చారు. ఇది పెద్ద వివాదంగా మారింది. చిరంజీవి, రామ్‌చరణ్ సైతం ఇన్ వాల్వ్ అయి నష్టనివారణ చర్యలు చేపట్టారు. మ్యాటర్ సెటిల్ చేసే పనిలో పడ్డారు. కానీ ఇంకా ఆ కష్టాలు దర్శకుడు కొరటాలని వదలడం లేదు. ఎందుకంటే సినిమా బిజినెస్ కి సంబంధించి కొరటాలనే ముందుండి డీల్ చేశాడు. దీంతో ఆయనే బలి కావాల్సి వస్తుంది. మరోవైపు చిరు, చరణ్ కూడా తమ పారితోషికంలో కొంత వెనక్కి ఇచ్చారని టాక్.
ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా నటించింది. చిరంజీవికి జోడీగా ఆమెని తీసుకున్నారు. షూటింగ్ కూడా చేశారు. కానీ తీరా సినిమాలో ఆమె పాత్రని తీసేశారు. కాజల్ ప్రెగ్నెంట్ కావడం, ఆమె సినిమాలకు దూరం కావడంతో ఈ సినిమాకి హీరోయిన్ రోల్ పెద్దగా అవసరం లేదని, కథకి ఆమె పాత్ర అడ్డుగా ఉంటుందని కట్ చేశారని టాక్ వినిపించింది. గ్లామర్ సైడ్ అది కాస్త వెలితిగానే మిగిలింది.
సినిమాలో కాజల్ రోల్ లేకపోవడంతో ఇప్పుడు శాటిలైట్ ఇబ్బందులు తలెత్తాయి. ప్రముఖ ఎంటర్టైన్‌మెంట్ ఛానెల్‌కి భారీ ధరకి ఈ చిత్ర శాటిలైట్ హక్కులు అమ్మారు. ముందు అగ్రిమెంట్ ప్రకారం సినిమాలో కాజల్ పాత్ర ఉంది. కానీ ఇప్పుడు ఆమె పాత్ర లేదు. దీంతో సదరు టీవీ ఛానెల్ సినిమాని ప్రదర్శించేందుకు నిరాకరిస్తుందని టాక్. ఇది పెద్ద ఇష్యూ అయ్యిందట. ఇలానే ప్రదర్శించాలంటే తాము చెల్లించాల్సిన మొత్తంలో కోత పెట్టాలని నిర్ణయించింది. దాదాపు 2.5కోట్లు కట్ చేసి ఇవ్వాలని నిర్ణయించిందట.
దీంతో ఇప్పటికే నష్టాల్లో ఉన్న టీమ్‌కి అది మరో దెబ్బగా మారుతుంది. ఇ లాభం లేదని భావించిన `ఆచార్య` టీమ్ ఓ నిర్ణయానికి వచ్చిందట. కాజల్ పాత్రతో సినిమాని ప్రదర్శించాలని నిర్ణయించింది. కట్ చేసిన కాజల్ ఎపిసోడ్లని కలిపి, మరికొన్ని సీన్లని జోడీంచి సినిమాని శాటిలైట్ ఛానెల్‌కి ఇవ్వాలని నిర్ణయించిందట. దీంతో సినిమాలో చాలా కొత్త అంశాలు ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఇది ఓ రకంగా కాజల్ అభిమానులకు సర్‌ప్రైజ్ న్యూస్ అనే చెప్పాలి. మరి థియేటర్‌లో, ఓటీటీలో దక్కని ఆదరణ టీవీ ఆడియెన్స్ నుంచి లభిస్తుందో చూడాలి.