
'లాల్ సింగ్ చద్దా' లాంటి భారీ డిజాస్టర్ తర్వాత ఆమిర్ ఖాన్ నటించిన చిత్రం 'సితారే జమీన్ పర్'. ఈ చిత్రం శుక్రవారం రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. రెండేళ్ల విరామం తర్వాత ఆమిర్ ఖాన్ నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానులు ఊహించినట్లుగానే, ఈసారి కూడా ఆమిర్ ఖాన్ విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రూ. 200 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన 'సితారే జమీన్ పర్' చిత్రానికి దర్శకుడు ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ తో పాటు జెనీలియా దేశ్ ముఖ్, అరౌష్ దత్తా, వేదాంత్ శర్మ, గోపికృష్ణ వర్మ లాంటి నటులు నటించారు. ఆమిర్ ఖాన్ ఈ చిత్రానికి కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరించాలని అనుకున్నారు. హిందీ, తమిళ భాషలలో ఒకేసారి ఈ చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్న ఆమిర్ ఖాన్, తమిళంలో శివకార్తికేయన్, హిందీలో ఫర్హాన్ అక్తర్ లను నటింపజేయాలని నిర్ణయించుకుని వారితో చర్చలు జరిపారు. వారు కూడా ఈ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పారని చెప్పారు. ఏదైనా సినిమా షూటింగ్ ప్రారంభించే ముందు ఆమిర్ ఖాన్ ప్రతి సందర్భంలో కథ మొత్తం అడిగి తెలుసుకుంటారు. అదేవిధంగా, అతను 'సితారే జమీన్ పర్' సినిమా కథను కూడా విన్నాడు.
కథ విన్న తర్వాత బాగా నచ్చడంతో నేనే ఈ చిత్రంలో ఎందుకు నటించకూడదు అని అనుకున్నారట. ఈ చిత్రంలో తానే నటించాలని అనుకుంటున్నట్లు శివకార్తికేయన్, ఫరాన్ అక్తర్ లకి చెప్పాడట. వారు కూడా తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ఈ చిత్రం నుంచి బయటకి వచ్చారు. ఆ తర్వాతే ఆమిర్ ఖాన్ ఈ సినిమాలో నటించాడు. ఆమిర్ ఖాన్ ఎంతో ఇష్టపడి నటించిన సితారే జమీన్ పర్ చిత్రం ఎలా ఉంది ? ప్రేక్షకులని ఆకట్టుకుందా లేదా ? అనే విషయాలు సమీక్షలో తెలుసుకుందాం.
ఆమిర్ ఖాన్ మరోసారి వైవిధ్యమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్ర కథ గుల్షన్ (ఆమిర్ ఖాన్) అనే బాస్కెట్‌బాల్ కోచ్ చుట్టూ తిరుగుతుంది. ప్రతిభావంతుడైన కోచ్ అయిన అతను కొన్ని చెడు అలవాట్ల కారణంగా ఇబ్బందుల్లో పడతాడు. ఒకసారి, అతను తాగి వాహనం నడపడం వల్ల ఇబ్బందుల్లో పడతాడు. దీనితో అతడు పోలీస్ స్టేషన్, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. న్యాయమూర్తి అతన్ని సమాజ సేవ చేయమని ఆదేశిస్తాడు. దాని ప్రకారం, అతను నాడీ సంబంధిత రుగ్మతలు ఉన్నవారికి బాస్కెట్‌బాల్ శిక్షణ ఇవ్వడానికి వెళ్తాడు. గుల్షన్ వారికి శిక్షణ ఇచ్చాడా? అలాంటి రుగ్మతలు ఉన్నవారిని ఎలా సంప్రదించాడు? ర్ క్రమంలో గుల్షన్ కి ఎదురైన సవాళ్లు ఏంటి ? అనేది మిగిలిన కథ.
'సితారే జమీన్ పర్' అనేది 2018లో సాధించిన స్పానిష్ చిత్రం 'ఛాంపియన్స్' కి రీమేక్ గా తెరకెక్కింది. దర్శకులు ఆర్.ఎస్. ప్రసన్న, రచయిత దివ్య నిధి శర్మ ఈ కథను భారతీయ నేపథ్యానికి తగ్గట్లుగా మార్చారు. కథకు బలం చేకూర్చడానికి, దర్శకుడు ప్రసన్న డౌన్ సిండ్రోమ్, ఆటిజం లాంటి నాడీ సంబంధిత రుగ్మతలు ఉన్న నిజమైన పిల్లలని ఈ చిత్రంలో నటింపజేసినట్లు తెలుస్తోది. వాళ్ళని నటించమని ఒప్పించడం అంత సులభం కాదు, కానీ అతను చాలా కష్టపడి తెరపై అందంగా చిత్రీకరించాడు. అతని కష్టానికి తగ్గ ఫలితం తెరపై కనిపిస్తుంది. ఈ సినిమా కథ మనల్ని కదిలిస్తుంది. కొన్ని సన్నివేశాలు మనల్ని నవ్విస్తాయి, కొన్ని ఏడిపిస్తాయి. "మన బంధం వల్ల ఈ పోరాటంలో నువ్వు గెలిచినా నేను గెలిచినా బాధ తప్పదు" అంటూ సాగే ఎమోషనల్ డైలాగులు హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి.
ఫస్ట్ హాఫ్ లో కథ వేగంగా వెళుతూ ఎంగేజింగ్ గా ఉంటుంది. తన యంగ్ టీమ్ తో గుల్షన్ బాస్కెట్ బాల్ కోచ్ గా పడే ఇబ్బందులు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయి. ఆ సన్నివేశాలు రియలిస్టిక్ గా ఉంటాయి. సెకండ్ హాఫ్ లో దర్శకుడు పట్టు కోల్పోయినట్లు అనిపిస్తుంది.
'సితారే జమీన్ పర్' సినిమాలో ఆమిర్ ఖాన్ తాగుడుకు బానిసైన స్పోర్ట్స్ కోచ్ పాత్రను తన భుజాలపై మోశారు. కోపం, చిరాకు అతని జీవితంలో ఒక భాగం. ఎప్పటిలాగే, ఆమిర్ ఖాన్ తన పాత్రలోని లోతును గ్రహించి పెర్ఫార్మెన్స్ తో కట్టిపడేశారు. అవసరమైనప్పుడు భావోద్వేగాలతో ఆమిర్ ఖాన్ చూపించిన వేరియేషన్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు అరుష్ దత్తా, గోపీ కృష్ణ వర్మ, సాన్విద్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆయుష్ భన్సాలీ, ఆశిష్ పెండ్సే, రిషి షాని, రిషబ్ జైన్, నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్ తమ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించారు. జెనీలియా కూడా తనకు ఇచ్చిన పాత్ర మేరకు నటించి మెప్పించింది. రామ్ ప్రసాద్ నేపథ్య సంగీతం, శంకర్ ఎహ్సాన్ లాయ్ పాటలు ఈ చిత్రానికి బలాలు. శ్రీనివాస్ రెడ్డి సినిమాటోగ్రఫీ పర్ఫెక్ట్ గా ఉంది.
మొత్తం మీద, 'సితారే జమీన్ పర్' నవ్విస్తూ, ఏడిపిస్తూ ఎమోషనల్ గా ఆకట్టుకునే చిత్రం అని చెప్పొచ్చు.