18 Pages Review: నిఖిల్‌-అనుపమా `18 పేజెస్‌` రివ్యూ

First Published Dec 23, 2022, 1:04 PM IST

`కార్తికేయ2`తో ఇండియా వైడ్‌గా సత్తాచాటారు హీరో నిఖిల్‌, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్‌. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో వచ్చిన మరో మూవీ `18 పేజెస్‌`. ఈ చిత్రం నేడు శుక్రవారం (డిసెంబర్‌ 23)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

`కార్తికేయ2`తో ఇండియా వైడ్‌గా సత్తాచాటారు హీరో నిఖిల్‌, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్‌. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో వచ్చిన మరో మూవీ `18 పేజెస్‌`. `కుమారి 21ఎఫ్‌` ఫేమ్‌ పల్నాటి సూర్యప్రతాప్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి సుకుమార్‌ కథ అందించడం విశేషం. అంతేకాదు సుకుమార్‌ రైటింగ్స్, జీఏ2 ఫిల్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. సరికొత్త లవ్‌ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం నేడు శుక్రవారం (డిసెంబర్‌ 23)న విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

కథః 
సిద్ధూ(నిఖిల్‌) హైదరాబాద్‌లో ఓ కార్పొరేట్‌ కంపెనీలో యాప్‌ డెవలపర్‌గా ఉద్యోగం చేస్తుంటాడు. లవ్‌ ఫెయిల్యూర్‌ అబ్బాయి. ఆ బాధలో ఉన్న అతనికి ఓ డైరీ దొరుకుతుంది. అది నందిని(అనుపమా పరమేశ్వరన్‌) అనే అమ్మాయి డైరీ. ఫోన్‌కి నేటి టెక్నాలజీ దూరంగా ఉండే, మనుషులపై ప్రేమ కలిగిన, అనుబంధాలకు విలువిచ్చే అమ్మాయి. ఆమె తాను పొందిన అనుభూతులను, తాను ఫేస్‌ చేసిన సంఘటలను, తాను బతికిన క్షణాలను డైరీలో రాసుకుంటుంది. ప్రతి రోజు ప్రతి మూవ్‌మెంట్‌ని నోట్‌ చేస్తుంది. ఆ డైరీ చదివే క్రమంలో నందినిపై ఆసక్తి ఏర్పడుతుంది సిద్దూకి. ఆమె జీవితాన్ని తాను జీవిస్తుంటాడు. ఆమె అనుభూతులను తాను పొందుతుంటాడు. నందిని కష్టాల్లో ఉంటే తాను ఆ కష్టాన్ని అనుభవిస్తాడు. ఆమె మరో వ్యక్తితో ప్రేమలో పడితే తాను బాధపడతాడు. ఆమెపై దుండగులు దాడి చంపేస్తే తాను పెయిన్‌ పొందుతాడు. కుమిలిపోతాడు. అసలు నందిని అంటే ఎవరో తెలియని, చూడని అమ్మాయితో సిద్ధూ ఎలా ప్రేమలో పడ్డాడు. నందిని నిజంగానే చనిపోయిందా? చంపేశారా? నందిని లైఫ్‌ ఏంటీ? ఆమె దుండగులు ఎందుకు చంపాలనుకుంటారు. నందిని తీసుకొచ్చిన కవర్‌ కథేంటి? అసలు నందినిని సిద్ధూ కలిశాడా? 18పేజీల డైరీకే పరిమితమయ్యిందా? అనేది మిగిలిన కథ. 
 

విశ్లేషణః 
`18పేజెస్‌` ఒక డిఫరెంట్‌ లవ్‌ స్టోరీ. పీరియడ్‌, టైమ్‌ ట్రావెల్‌ ఫ్లేవర్‌ కలిగిన లేటెస్ట్ లవ్‌ స్టోరీ. అత్యంత భావోద్వేగ భరితంగా సాగే స్వచ్ఛమైన ప్రేమకథ. ఇలాంటి ప్రేమ కథలు చాలా అరుదు. హీరోయిన్‌ రాసుకున్న డైరీలోని పేజీలను చదువుతూ, ఆమె చేసే పనులను ఫీల్‌ అవుతూ ఆమె ప్రేమలో పడిపోవడం చాలా ముచ్చటగా అనిపిస్తుంది. హీరోయిన్‌ జీవితాన్ని, ఫీలింగ్‌ని హీరో పొందడం ఇక్కడ ఆకట్టుకునే అంశం. టెక్నాలజీ పెరిగిపోయి, స్మార్ట్ ఫోన్లు, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టలలో మునిగిపోతూ ఇంటర్నెట్‌ తో బతికేస్తున్న ఈ ప్రపంచంలో వాటి అన్నింటికి దూరంగా మనుషులంటే ఇష్టపడే అమ్మాయి లైఫ్‌ని ఆవిష్కరించిన తీరు బాగుంది. అందులో అనుపమా పరమేశ్వరన్‌ నటించడం యాప్ట్ గా ఉంది. అదే సమయంలో ఈ రోజుల్లో ఫోన్లు, ఇంటర్నెట్‌ వాడని వారుఉన్నారా? అనేది లాజిక్‌కి అందని విషయం. అదే అసహజంగా అనిపిస్తుంది. 
 

ఇక మొదటి భాగం నందిని తన డైరీలో రాసుకున్న పేజీలను చదువుతూ ఆమె లైఫ్‌ని ఊహించుకుంటూ హీరో బతకడంతోనే సాగుతుంది. ఆమె రాసుకున్న 18పేజీలు అయిపోవడం వరకు సాగుతుంది. అది ఆద్యంతం ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. ఆ తర్వాత నందిని జీవితం ఏమైంది? నందినికి ఏమైందనే ఉత్కంఠ రేపే అంశంతో ఇంటర్వెల్‌ పడుతుంది. సెకండాఫ్‌ నందిని రియల్‌ లైఫ్‌ని చూపిస్తాడు. ఆమె పడిన ఇబ్బందులు, తాను తీసుకొచ్చిన కవర్‌ వల్ల తాను ప్రమాదంలో పడటం, ఆమె చనిపోయిందనే ట్విస్ట్ ఆద్యంతం ఉత్కంఠకి దారితీస్తూనే భావోద్వేగాలను పెంచేస్తుంది. ప్రారంభం నుంచి నెమ్మదిగా ప్రారంభమైన ఫీల్‌ పెరుగుతూ వెళ్తుంది. ఆమె చనిపోయిందనే వార్తతో హీరోనే కాదు, ఆడియెన్స్ కి కూడా గుండెల్ని పిండేసేలా ఉంటుంది. ఫ్లో కాస్త డౌన్‌ అవుతుందన్న సమయంలో ఫ్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఆసక్తిని మరింత పెంచుతాయి. క్లైమాక్స్‌ పీక్‌లో ఉంటుంది. ట్రైన్‌ సీన్‌ క్లాప్స్ కొట్టేలా ఉంటుంది. మొత్తంగా భావోద్వేగ భరితంగా సాగే ఫీల్‌ గుడ్‌ డిఫరెంట్‌, క్రేజీ లవ్‌ స్టోరీగా నిలుస్తుంది. 

అదే సమయంలో సినిమాలు లాజిక్‌కి అందని అంశాలు చాలా ఉన్నాయి. హీరోయిన్‌ రాసుకున్న డైరీని చదువుతూ తాను రియల్‌ లైఫ్‌లోనూ హీరో అలానే బతకడం, అదే ఫీల్‌ అవడమనేది సహజంగా అనిపించదు. మరోవైపు నిఖిల్‌ పక్కన ఫ్రెండ్ గా చేసిన సరయు తెలంగాణ బాషలో మాట్లాడటం ఆకట్టుకున్నా, కాస్త ఓవర్‌గా అనిపిస్తుంది. ఆమె పాత్ర అతిగా అనిపిస్తుంది. మరోవైపు డైరీలోనూ సన్నివేశాలు చూస్తే హీరో ఫీలైపోతుంటాడు, కానీ అంతటి ఫీల్‌ ఆడియెన్స్ పొందేలా లేదు. అది డిస్‌ కనెక్టింగ్‌ అంశం. మరోవైపు హీరోయిన్‌ ఎలా చనిపోయింది? నిజంగానే చనిపోయిందా? లేదా? అని హీరో చేసే అన్వేషణలో చాలా చోట్ల లాజిక్‌ లేకుండా ఉన్నాయి. అమ్మాయిని చూడకుండా ప్రేమించడమనేది కొత్తేమి కాదు, కానీ ఇందులో దాన్ని తెరపై ఆవిష్కరి తీరు బాగుంది. దర్శకుడు స్క్రీన్‌ప్లేతో చేసిన మ్యాజిక్‌తో లాజిక్కులన్నీ పక్కకు వెళ్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఆర్‌ఆర్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ పాటలతో లాజిక్‌లు చాలా చిన్నవిగా అనిపించడం విశేషం. 

నటీనటులుః 
సిద్దూ పాత్రలో నిఖిల్‌ యాప్ట్ గా చేశాడు. ఆ పాత్రకి తనే పర్‌ఫెక్ట్ అనేలా కుదిరాడు. అంతే బాగా చేశాడు. మరోవైపు నందిని పాత్రలో అనుపమా పరకాయ ప్రవేశం చేసింది. పాత్రకి ప్రాణం పోషింది. ఆమె పాత్రలో ఓ పొయెటిక్‌ నేచర్‌ అబ్బురపరుస్తుంది. ఈ రెండు పాత్రలే సినిమాకి బలం, ప్రాణం. మిగిలిన పాత్రల్లో సరయు ఉన్నంతలో కామెడీగా బాగా చేసింది. కామెడీ పండించే పాత్ర అంటూ ఉంటే అది ఆమెదే. పోసాని, అజయ్‌ వంటి వారు ఉన్నా పెద్దగా రిజిస్టర్‌ అయ్యే పాత్రలు కాదు. 

టెక్నీషియన్లుః 
దర్శకుడు సుకుమార్‌ కథ, మాటలు, దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్‌ టేకింగ్‌ ఈ సినిమాకి బలం. అవి గ్రిప్పింగ్‌గా ఉండటం వల్లే చాలా లూప్స్ ఉన్నా, అవి పెద్దగా కనిపించకుండా చేశాయి. సినిమా టెంపోని పెంచుకుంటూ వెళ్లిన తీరు బాగుంది. క్లైమాక్స్ డిజైన్‌ చేసిన తీరు ఇంకా బాగుంది. దీనికి గోపీసుందర్‌ మ్యూజిక్‌ మ్యాజిక్‌ చేసింది. ఆర్‌ఆర్‌, పాటలు బాగున్నాయి. లవ్ స్టోరీలోని ఫీల్‌ని మరింత పెంచాయి. `టైమ్‌ ఇవ్వు పిల్లా`, `నిదురన్నది లేదే ఓ పిల్లా` అనేతెలంగాణ యాసలో సాగే పాట, `నన్నయ్య రాసిన ` పాటలు చాలా బాగున్నాయి. కెమెరావర్క్ రిచ్‌గా, కలర్‌ ఫుల్‌గా ఉంది. మరోవైపు నిర్మాణ విలువలకు కొదవ పెట్టేది లేదు. 
 

ఫైనల్‌గాః మ్యాజికల్‌ ఫీల్‌గుడ్‌ లవ్‌ స్టోరీ. నేటి యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. 

రేటింగ్‌ః 3
 

click me!