ఓడినా సరే ప్రత్యర్థులకు గౌరవం ఇవ్వాలి, అందుకే అలా చేశా... అజింకా రహానే కామెంట్...

First Published | Jan 30, 2021, 12:04 PM IST

అజింకా రహానే... ఆస్ట్రేలియా టూర్‌కి ముందు ఈ క్రికెటర్‌ను పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. నిజానికి ఒకప్పుడు రోహిత్, విరాట్ కోహ్లీతో సమానంగా భారత జట్టులో స్టార్‌గా ఉన్న రహానే, ఆ తర్వాత కేవలం టెస్టు టీమ్‌కే పరిమితమయ్యాడు. అయితే ఆసీస్ టెస్టు సిరీస్ తర్వాత రహానే స్టార్ డమ్ పూర్తిగా మారిపోయింది...

కూల్ అండ్ కామ్ యాటిట్యూడ్‌తో ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే మట్టి కరిపించిన అజింకా రహానే... ఎక్కడా ఆవేశం, ఆగ్రహం చూపించకుండా జట్టును నడిపించాడు.
ప్రత్యర్థి జట్టు మాటలతో కవ్విస్తున్నా, బౌన్సర్లతో ఆటగాళ్లకు గాయాలు చేస్తున్నా... ఎంతో వినయంగా నడుచుకున్న రహానే జట్టు... ఆటతోనే వారికి సరైన సమాధానం చెప్పింది...

టెస్టు సిరీస్ విజయం తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన రహానేకి అదిరిపోయే రేంజ్‌లో స్వాగతం లభించింది. రహానే నివసించే ముంబైలోని సోసైటీ సభ్యులు ‘కెప్టెన్ రహానే’ అంటూ హోర్డింగులు ఏర్పాటు చేశారు.
కంగారులపై సాధించిన విజయానికి గుర్తుగా కంగారూ ఆకారంలోనే కేక్ తయారుచేశారు సోసైటీ సభ్యులు. అయితే ఈ కేక్‌ను కట్ చేసేందుకు రహానే అంగీకరించలేదు...
తాజాగా ఈ విషయంపై రహానేని ప్రశ్నించాడు క్రికెట్ కామెంటేటర్ హర్షా బోగ్లే... ‘కంగారు ఆకారంలో తయారుచేసిన కేక్ కట్ చేసేందుకు మీరు అంగీకరించలేదట... ఎందుకు?’ అని రహానేని అడగగా...
‘కంగారు వారికి జాతీయ జంతువు. అందుకే కట్ చేయనని చెప్పాను. ప్రత్యర్థికి మనం గౌరవం ఇవ్వాలి. గెలిచినా, ఓడినా ప్రత్యర్థిని గౌరవించడం చాలా అవసరం...
మనదేశాన్ని మనం ఎంత గౌరవిస్తామో, వాళ్లు అంతే గౌరవిస్తారు. అందుకే మిగిలిన దేశాల సెంటిమెంట్లను కూడా మనం గౌరవించాలి..
అందుకే కంగారూ ఆకారంలో తయారుచేసిన కేక్‌ను నేను కట్ చేయడానికి ఒప్పుకోలేదు’ అని చెప్పుకొచ్చాడు అజింకా రహానే...
ఆసీస్ టూర్‌లో టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర క్రియేట్ చేసిన తర్వాత మళ్లీ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఇవ్వడం ఎలా అనిపించిందని ప్రశ్నించాడు హర్షా బోగ్లే...
‘కెప్టెన్‌గా ఆస్ట్రేలియాను ఓడించి, టెస్టు సిరీస్ గెలిచాం...కానీ అది చరిత్ర. గడిచిపోయింది. దాని గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఓ ఆటగాడిని కోహ్లీకి జట్టు విజయంలో ఎలా సాయపడాలనే దానిపైనే నా ఆలోచన’ అంటూ చెప్పుకొచ్చాడు రహానే...
ఐపీఎల్, ఆస్ట్రేలియా టూర్ కారణంగా ఐదు నెలల తర్వాత ఇంటికి చేరుకోవడం సంతోషంగా ఉందని చెప్పిన రహానే... ఇలా అలసిపోవడం కూడా ఆనందంగా ఉందని అన్నారు...
రహానే చెప్పిన సమాధానం ఆస్ట్రేలియన్ల మనసు దోచుకుంది. రహానే ఇంటర్వూపై కామెంట్ చేసిన ఆస్ట్రేలియా మహిళా జర్నలిస్టు అమాండా బెయిలీ... ‘ఎంతో వినయంగా, ఎంతో అందంగా చెప్పారు... మరింత గౌరవం పెరిగింది’ అంటూ కామెంట్ చేసింది.

Latest Videos

click me!