నీకు అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అర్హత లేదు.. అర్ష్‌దీప్‌పై బీజేపీ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు

First Published Jan 6, 2023, 3:10 PM IST

INDvsSL: ఇండియా - శ్రీలంక మధ్య  గురువారం పూణె వేదికగా ముగిసిన రెండో టీ20లో  టీమిండియా పేసర్  అర్ష్‌దీప్ సింగ్ పది బంతుల వ్యవధిలో  ఐదు నో బాల్స్ వేశాడు.  దీంతో లంక  బ్యాటర్లు పండుగ చేసుకున్నారు. 

టీమిండియా లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. నిన్న శ్రీలంకతో రెండో టీ20లో   అత్యంత చోత్త ప్రదర్శన ఇచ్చాడు. తొలి టీ20లో జ్వరంతో బాధపడి రెండో మ్యాచ్ కు  జట్టులోకి వచ్చిన  అతడు.. రెండో ఓవర్లో బౌలింగ్ కు వచ్చి  వరుసగా మూడు నోబాల్స్ వేశాడు.  ఇందులో 19 పరుగులొచ్చాయి.  తర్వాత  కూడా మరో రెండు నోబాల్స్ వేశాడు. 

రెండు ఓవర్లలో ఐదు నోబాల్స్ వేయడంతో హార్ధిక్ పాండ్యా మళ్లీ అతడికి బౌలింగ్ ఇవ్వలేదు.  శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్ లు కూడా  చెరో నోబాల్స్ వేశారు. మొత్తంగా నిన్నటి మ్యాచ్ లో భారత బౌలర్లు ఏడు నోబాల్స్ వేశారు. దాంతో 31 పరుగులు అదనంగా వచ్చాయి.  అయితే అర్ష్‌దీప్ బౌలింగ్ పై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్,  ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న గౌతం గంభీర్  అర్ష్‌దీప్ పై మండిపడ్డాడు. మ్యాచ్ అనంతరం గంభీర్ స్పందిస్తూ...‘ఏడు నోబాల్స్. ఒకసారి ఊహించుకోండి. అంటే  ఒక ఓవర్ కంటే ఎక్కువ. అంటే  ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు 21 ఓవర్లు వేసినట్టు.  క్రికెట్ లో ప్రతీ బౌలర్, బ్యాటర్ కు చేదు అనుభవాలుంటాయి.  బౌలర్లు చెత్త బంతులు వేస్తారు. బ్యాటర్లు చెత్త షాట్లు ఆడి వికెట్ సమర్పించుకుంటారు. 

కానీ ఇది రిథమ్  కు సంబంధించిన విషయం. గాయం తర్వాత తిరిగి జట్టుతో చేరినప్పుడు నేరుగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడకూడదు. అతడు (అర్ష్‌దీప్ ను ఉద్దేశిస్తూ) ముందు దేశవాళీ క్రికెట్ ఆడాలి.  అక్కడ  కొన్ని మ్యాచ్ లు ఆడి బౌలింగ్ లో మీ పాత రిథమ్ అందుకున్నాక   అంతర్జాతీయ మ్యాచ్ ఆడాలి.  ఎందుకంటే టీ20 క్రికెట్ లో  నోబాల్స్ అస్సలు ఆమోదయోగ్యం కాదు.  అర్ష్‌దీప్ లో అదే మిస్ అయింది..  

లేకుంటే ఇలాంటి షాకులు తినక తప్పదు. గాయం నుంచి కోలుకున్నాక  దేశవాళీతో పాటు నెట్స్ లో ఎక్కువసేపు శ్రమించాలి. అక్కడ మెరుగ్గా ఉంటేనే  మ్యాచ్ లో రాణించగలుగుతాం.  అంతేగాక బౌలింగ్ కోచ్ కూడా ఈ విషయంలో  కీలకంగా వ్యవహరించాలి.    ప్రాక్టీస్ సెషన్స్ లో  కోచ్ లు చాలా కఠినంగా  ఉంటేనే మ్యాచ్ లలో మంచి ఫలితాలు వస్తాయి.. ఏడు నోబాల్స్ అంటే   దారుణం.. అదనంగా 30 పరుగులు. ఇది చాలా పెద్ద వ్యత్యాసం..’ అని కామెంట్స్ చేశాడు. 

మ్యాచ్ అనంతరం టీమిండియా సారథి హార్ధిక్ పాండ్యా కూడా బౌలింగ్ యూనిట్ పై విమర్శలు గుప్పించాడు. ‘పవర్ ప్లేలు మాకు కలిసి రాలేదు. బౌలింగ్ పవర్ ప్లేలో అధికంగా పరుగులు ఇచ్చాం. బ్యాటింగ్ పవర్ ప్లేలో కీలక వికెట్లు కోల్పోయాం. మేం చాలా తప్పులు చేశాం. కొన్ని సార్లు ఎక్కువ పరుగులు ఇవ్వాల్సి వస్తుంది. అయితే బేసిక్స్ కూడా మరిచిపోయేంత చెత్త ప్రదర్శన అయితే ఊహించలేదు. ఇంతకుముందు మ్యాచుల్లో కూడా మేం నో బాల్స్ వేశాం. అయితే మరీ ఇంత దారుణంగా ఎప్పుడూ వేయలేదు. ఎవ్వరినీ నిందించడం లేదు కానీ టీ20ల్లో నో బాల్స్ వేయడం నేరం... అర్ష్‌దీప్ సింగ్ రిథమ్ అందుకోవడానికి సమయం తీసుకుంటాడని అనుకోలేదు.’ అని అన్నాడు. 
 

click me!