అది మా చేతుల్లో లేదు..ఆసియా కప్ వివాదం భారత ఆటగాళ్ల మీద ప్రభావం చూపదు : బీసీసీఐ చీఫ్ కామెంట్స్

First Published | Oct 21, 2022, 11:35 AM IST

BCCI vs PCB: గడిచిన నాలుగైదు రోజులుగా క్రికెట్ వర్గాలలో చర్చకు తెరతీసిన ఆసియా కప్  - 2023 వివాదంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు  రోజర్ బిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా కప్ లో తాము పాల్గొనబోమని బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు జై షా చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల క్రికెట్ అభిమానుల్లో చర్చకు లేవదీశాయి. జై షా వ్యాఖ్యలకు పాక్ కౌంటర్ ఇవ్వడం, ఆ జట్టు మాజీ ఆటగాళ్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం వంటివి జరుగుతూనే ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో  తాజా వివాదంపై  బీసీసీఐకి ఇటీవలే అధ్యక్షుడిగా ఎంపికైన  రోజర్ బిన్నీ స్పందించాడు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిన్నీ ఈ వివాదంపై బీసీసీఐ బాస్ హోదాలో వివరణ ఇచ్చాడు.  టీమిండియా పాకిస్తాన్ కు వెళ్లాలా..? వద్దా..? అనేది నిర్ణయించాల్సింది బీసీసీఐ కాదని, అది భారత ప్రభుత్వం చేతుల్లో ఉందని  స్పష్టం చేశాడు. 


బిన్నీ మాట్లాడుతూ.. ‘భారత జట్టు పాకిస్తాన్ లో పర్యటించాలా..? లేదా..? అనేది  భారత ప్రభుత్వ పరిధిలోని అంశం. ఈ విషయంలో బీసీసీఐ కూడా  కేంద్ర ప్రభుత్వం  నిర్ణయాన్ని ఫాలో అవ్వాల్సిందే తప్ప సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు లేదు.  దీనిపై ఇప్పటికైతే మేము కేంద్రాన్ని సంప్రదించలేదు. ఒకవేళ కేంద్ర నుంచి  ఏవైనా ఆదేశాలు వస్తే మాత్రం మీడియాకు తెలియజేస్తాం’ అని చెప్పాడు. 

అంతేగాక.. ‘గతంలో ఆసియా కప్ ను భారత్ నిర్వహించాలనుకుంటే అందుకు పాకిస్తాన్ తాము ఇండియాకు వెళ్లమని చెబితే టోర్నీని పాకిస్తాన్ కు మార్చారు. ఇటువంటి  విషయాల మీద  రాత్రికి రాత్రి  నిర్ణయాలు  జరిగిపోవు.  చర్చించి నిర్ణయం తీసుకోవాలి. సమయం వచ్చినప్పుడు మేం పాకిస్తాన్  పర్యటనకు  కూడా వెళ్లి ఆ దేశంతో ఆడతాం..’ అని చెప్పాడు. 

ఇక  ఈ వివాదం ఇండియా-పాకిస్తాన్ మధ్య ఈనెల 23న జరుగబోయే మ్యాచ్ మీద ప్రభావం చూపుతుందా..? అన్న ప్రశ్నకు బిన్ని సమాధానమిస్తూ.. ‘ఒత్తిడి  బయట ఉందే తప్ప  టీమ్ లోపల  ఆటగాళ్లకు ఏ ఒత్తిడీ లేదు. ఈ మ్యాచ్ మీద విపరీతమైన హైప్ ఉంది.  అది ప్రజలు తీసుకొచ్చిన హైప్. ఆటగాళ్లకంటే   ప్రజలు ఎక్కువ టెన్షన్ పడుతున్నారు.  ఈ వివాదం ఆటగాళ్ల మీద పడదు..’ అని స్పష్టం చేశాడు. 

ఈనెల 23న ఇండియా-పాకిస్తాన్ మధ్య మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా  హై ఓల్జేజ్ మ్యాచ్ జరుగనుంది.  ఈ మ్యాచ్ కోసం ఇరుజట్లు ఇప్పటికే మెల్‌బోర్న్ కు చేరి ప్రాక్టీస్ తో పాటు  మ్యాచ్ లో అనుసరించాల్సిన  వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్  కు వర్షం ముప్పు ఉన్నట్టు సమాచారం.  

Latest Videos

click me!